పరహితమైన కార్యమతి భారముతోడిదియైన పూను సత్పురుషుడు లోకము ల్పొగడ, పూర్వమునందొక రాలవర్షమున్ కురియగ జొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిర నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా!
కృష్ణుడు చిన్నప్పట్నించీ కొంటె వాడే కాదు, కొంచెం విప్లవ భావాలు కూడా కలిగిన వాడు. మహాభారత కథ కురు-పాండవులదే అయినా, అదంతా కృష్ణుని చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. ఇదంతా, కృష్ణుడి శక్తియుక్తుల వల్లే అనిపిస్తుంది. ఇది రామాయణంలోని రాముడికి పూర్తి భిన్నమైన వైఖరి. భారతంలోనే కాదు, భాగవత కథల్లోనూ ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది.
రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలను చదివినపుడు నిజంగా ఇవన్నీ జరిగాయా? అనే ఒక సందేహం కలుగుతుంది.
జరగనేలేదని, జరిగాయని, ఏదో కొంచెం జరిగితే వాటికి అద్భుతాలు, అతిశయోక్తులు, అతీంద్రియశక్తుల్ని జోడించి మహా ఉద్గ్రంథాలు చేశారని... ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. ఆ వివాదాల్లోకి పోకుండా, అందులో ఉన్న కథ, కథన నైపుణ్యం, వస్తువు, వైవిధ్యం, శిల్పం... ఇట్లాంటివి తీసుకొని రసాస్వాదన చేసేవారూ ఉన్నారు. అందులోంచి ధార్మిక, నైతిక, భక్తి, చైతన్య, ఆధ్యాత్మిక... భావనల్ని తీసుకొని జీవితాల్ని క్రమబద్ధీకరించుకున్న వారూ ఉన్నారు.
అవి జరిగాయా? జరగలేదా? అన్న మీమాంసను కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే కూడా, ఆయా ఇతిహాసాల్లో పేర్కొన్న అంశాల్ని బట్టి, కనీసం అయిదారు వేల సంవత్సరాల కిందటే, ఈ నేలపై ఓ ఉత్కృష్టమైన మానవ జీవనగతి సాగిందనే విషయాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. ఎంత కాల్పనికమైనా గాలిలోంచి పుట్టదు. ఆయా గ్రంథాల రచయితలైన వాల్మీకి, వ్యాసుడి ఊహ శక్తి కూడా ఓ మానవ సమూహ జీవనగతిని ఆధారం చేసుకునే సాగుతుంది కదా! అతిశయోక్తులు, అతీంద్రియశక్తులు, మాయా-మంత్ర, తంత్య్ర విద్యల వంటి వాటిని తొలగించి చూసినా, మనిషి మౌలిక జీవన సరళి, పద్ధతులు, సంప్రదాయాలు, వాటిలో అత్యధికం నేటికీ కొనసాగుతుండటం వంటివి ఆశ్చర్యం కలిగిస్తాయి.
కృష్ణ లీలలలోని ఒక అంశాన్ని ఇక్కడ మారద వెంకయ్య కవి గుర్తు చేస్తున్నాడు. చక్కని, చిక్కని తెలుగును దట్టించిన నీతి పద్యాలతో భాస్కర శతకం రాసారాయన. భర్తృహరి సంస్కృత సుభాషితాలను తెలుగించిన ఏనుగు లక్ష్మణకవి పద్యాలలాగే వెంకయ్య పద్యాలు కూడా, భాష-భావమై జతకట్టిన జోడు గుర్రాళ్లా పరుగులిడుతుంటాయి. అలాంటిదే ఈ పద్యం.
అంతకు మున్ను రేపల్లె వాసులు అష్టదిక్పాలురను ఇంకా ఎవరెవరో దేవతల్ని కొలుస్తూ ఉండేవారట. ‘ఆ కంటికి కనిపించని దేవతల్ని కొలిస్తే ఎంత, కొలువకపోతే ఎంత? కళ్లెదుట ఉన్న ప్రకృతిని మించిన దేవతల్లేరు, పంచభూతాలతో నిండిన ఈ కొండలు, కోనలు, చెట్లు, నదులు వీటినే కొలుద్దాం, వీటికే పూజలు చేద్దా’మని కృష్ణుడు స్థానికుల్ని ఛైతన్య పరుస్తాడు.
కృష్ణుడిపై ఉన్న గురి వల్ల వారలాగే చేస్తారు. ఇది గమనించిన దిక్పాలురు కోపగించుకుంటారు. ఓ రోజున వరుణుడు, వాయువు ఇత్యాది దేవతలు కూడబలుక్కొని, ‘ఓహో! మమ్మల్ని పూజించరా, సరే మీ సంగతి చూపిసా’్తమని రేపల్లె వాసులపై కుంభవృష్టి కురిపిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రాళ్లవర్షానికి రేపల్లె గోప పరివారమంతా కకావికలమౌతుంది. అందరూ కృష్ణుడ్ని చేరి మొరపెట్టుకుంటారు, ‘కృష్ణా, నీవే ఏదైనా దారి చూపించు’ అని వేడుకుంటారు. ఎవ్వరూ ఆందోళన చెందవలదని అభయమిస్తూ గోవర్ధనగిరిని ఒంటి చేత్తో ఎత్తి అఖిల రేపల్లె జనావళి, గోవులు, గోపాలురకు గొడుగుగా పట్టి రక్షణ కల్పిస్తాడు.
నాయకుడనే వాడు అలా ఉండాలి. తనవారికి కష్టమొచ్చినపుడు, తాను చేసే కార్యం ఎంత భారమైనదైనా లెక్కచేయడు. నలుగురికి ఉపయోగమౌతుంది అనిపిస్తే క్షణం జాప్యం చేయకుండా కార్యక్షేత్రంలోకి దిగిపోతారు సత్పురుషులు. ఇదే వెంకయ్య ఇంకో పద్యంలో, ‘ ఒక్కడు మాంసమిచ్చె (శిబి), మరియొక్కడు చర్మము గోసి యిచ్చె (కర్ణుడు), వేరొక్కరు డస్థి నిచ్చె (దదీచి), నిక నొక్కడు ప్రాణములిచ్చె (బలి) వీరిలో నొక్కనిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తికిచ్చిరో....?’’అంటాడు. ఇతరుల ప్రయోజనాలు, ఆర్తిని బట్టి ఆయా ప్రముఖులు త్యాగనిరతి-కీర్తి కాంక్షతో అవి ఇచ్చారు తప్ప జీవించజాలక మాత్రం కాదని చెబుతున్నాడు. అన్నీ సవ్యంగా ఉన్నపుడు నాయకత్వం అప్పగిస్తే సగర్వంగా స్వీకరించి, తోచిన తరహాలో సూచనలు-సలహాలూ, ఆజ్ఞ-ఆదేశాలూ ఇస్తూ ఆధిపత్యం చలాయించడమే కాదు! పరిస్థితి వికటించినపుడు, అదే చొరవతో ముందుకు వచ్చి భారమెంతని చూడకుండా బాధ్యతను భుజాన వేసుకున్నవాడే నిజమైన నాయకుడు.
- దిలీప్‌రెడ్డి
పద్యానవనం: అదీ... నాయకత్వం అంటే!
Published Sat, Apr 26 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM
Advertisement
Advertisement