పురాణ దృశ్య కావ్యాలు.. పద్య నాటకాలు
పురాణ దృశ్య కావ్యాలు.. పద్య నాటకాలు
Published Thu, Feb 2 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
– ముగిసిన నంది నాటకోత్సవాలు
కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పద్యనాటకాలు భారతీయ పురాణ గాథల దృశ్యకావ్యాలుగా నిలిచాయి. రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో నిర్వహించగా.. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన నాటక సమాజాలకు కర్నూలు వేదికగా నిలిచింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు ప్రదర్శించిన పద్యనాటకాలు పౌరాణిక నాటక ప్రాభవాన్ని చాటిచెప్పాయి. కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’, కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి ప్రదర్శించిన ‘దేవుడు’, సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్‌వారు ప్రదర్శించిన ‘గంగాంబిక’ పద్య నాటకాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
ప్రమీలార్జున ప్రణయ వృత్తాంతానికి అద్దం పట్టిన ప్రమీలార్జున పరిణయం...
కర్నూలు లలిత కళాసమితి కళాకారులు గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం పద్యనాటకం మహాభారతంలోని ప్రమీలార్జున ప్రణయగాథకు అద్దం పట్టింది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాప పరిహారం కోసం ధర్మరాజును అశ్వమేథ యాగం చేయాలని వ్యాసుడు ఆదేశిస్తాడు. ధర్మరాజు అర్జునుడికి అశ్వరక్షకుడిగా పంపిస్తాడు. భీముడు, అర్జునుడు యుద్ధాలలో తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నా పేరు, ప్రఖ్యాతులు మాత్రం శ్రీకృష్ణునికే చెందుతున్నాయని బాధపడతారు. ఇది గమనించిన కృష్ణుడు అశ్వమేథ యాగానికి తాను దూరంగా ఉంటానని భీమార్జునులతో చెబుతాడు.
అర్జునుడు అశ్వరక్షణకు బయలుదేరి మహిళా సామ్రాజ్య అధినేత్రి ప్రమీల రాణిని చేరుకుంటాడు. స్త్రీ సామ్రాజ్యానికి మహారాణిగా చాటుకున్న ప్రమీల అర్జునుడిని యుద్ధంలో ఓడిస్తుంది. గర్వభంగమైన అర్జునుడు.. కృష్ణుడు తన వెంట లేకపోవడమే తన ఓటమికి కారణమని గుర్తిస్తాడు. ఘటోత్కచుని తనయుడు మేఘవర్ణుడు శ్రీకృష్ణుడిని అశ్వమేథ యాగంలో ప్రవేశపెడతాడు. కృష్ణుడు ప్రమీలకు గర్వభంగం చేసి అర్జునునితో పరిణయం చేయిస్తాడు. నాటకం మధ్యలో భీముడు, మేఘవర్ణుని యుద్ధ సన్నివేశం, కుతూహలం, కోలాహలం అనే పాత్రల మధ్య సాగే హాస్య సరస సంభాషణ ప్రేక్షకులను అలరించాయి. పల్లేటి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు.
దైవభక్తి విశిష్టతను చాటిన ‘దేవుడు’...
కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడు’ పద్యనాటకం ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి విశిష్టతను చాటుకుంది. దైవభక్తి మెండుగా కల్గిన మహేంద్రుడనే యువకుడు సన్యాసిగా మారి దేశమంతటా పర్యటిస్తూ ధర్మప్రచారం చేస్తూ సాటి వారిపై ప్రేమానురాగాలు చూపిస్తూ మానవతా దృక్పథాన్ని చాటిచెప్పడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. మహేంద్రుడు ఒక వృద్ధుడిని కాపాడబోయి చేతిలోని శివలింగాన్ని జారవిడుస్తాడు.
శివలింగం ముక్కలైపోగా విచారంగా ఇల్లు చేరుకుంటాడు. అతని తండ్రి విశ్వనాథుడు ఆ నింద నుండి విముక్తి పొందడానికి కాళీ మాతని దర్శించమని కోరుతాడు. గంగానది ఒడ్డున ఉన్న కాళీ మాత దర్శనం కోసం వెళ్తూ ఒక పడవ వాడిని, పవిత్ర అనే దేవదాసిని, దళితుడైన లక్ష్మన్నను కలసి మానవత్వం గురించి తెలుసుకుంటాడు. చివరకు బాధితులైన మానవులకు సేవ చేయడంలోనే దైవదర్శనం జరుగుతుందని మహేంద్రుడు గ్రహిస్తాడు. బి.పద్మనాభాచారి ఈ నాటకానికి రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
మానవతా విలువలను చాటిన ‘గంగాంబిక’...
సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్ కళాకారులు ప్రదర్శించిన గంగాంబిక పద్యనాటకం మానవతా విలువలను చాటిచెప్పింది. భూలోకంలో మానవతా విలువలు తగ్గుముఖం పట్టి రాక్షసత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో నారదుడు మానవులలో ప్రేమానుబంధాల పట్ల విశ్వాసాన్ని, వర్ణవైశమ్యాలు లేని సమసమాజాన్ని ఏర్పరచమని దేవతలను కోరతాడు. త్రిమూర్తులలో ఒకరైన మహేశ్వరుడు సంగమేశ్వరుడై తన బాధ్యతను గంగా బసవేశ్వర రూపంలో నెరవేరుస్తాడు. గంగా బసవేశ్వరులను భూలోకానికి పంపి భార్యాభర్తల అనుబంధాన్ని, మనిషి మనిషికి మధ్య ఉండాల్సిన మానవీయ బంధాన్ని ఏర్పరచడమే శైవ మత ప్రధాన లక్ష్యమని తెలియజేస్తాడు. తడకమల్ల రామచంద్రరావు రచించిన ఈ నాటకానికి సావేరి భవాని దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
విజయవంతంగా ముగిసిన నంది నాటకోత్సవాలు
కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, ఈ నాటకోత్సవాల నిర్వహణకు సహకరించిన కళాకారులు, ప్రేక్షకులు, టీజీవి కళాక్షేత్ర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎఫ్‌డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలియజేశారు.
16 రోజులుగా టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో సాంఘిక, బాలల, పౌరాణిక పద్య నాటకాల విభాగాల్లో 61 నాటకాలు ప్రదర్శించారని.. 1300 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారన్నారు. ఈ నాటకోత్సవాల్లో ప్రముఖ సినీ, టీవీ కళాకారులు కోట శంకర్‌రావు, సుబ్బరాయ శర్మ, మేక రామకృష్ణ, గోవాడ వెంకట్, జబర్దస్త్ మురళి, కృష్ణమోహన్, సురభి ప్రభావతి తదితరులు పాల్గొన్నారన్నారు. సాంఘిక నాటికల విభాగంలో 30 ప్రదర్శనలు, కళాశాల, విశ్వవిద్యాలయ విభాగంలో రెండు ప్రదర్శనలు, బాలల విభాగంలో 7 ప్రదర్శనలు, పద్యనాటక విభాగంలో 22 ప్రదర్శనలు టీజీవి కళాక్షేత్రంలో జరిగాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో జరిగిన నంది నాటకోత్సవాలలో విజేతలైన కళాకారులకు మార్చి మొదటి వారంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 14 వ్యక్తిగత బహుమతులు అందజేస్తామన్నారు. నాటకోత్సవాలకు ఐదుగురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారన్నారు. పద్య నాటకాలకు ప్రథమ బహుమతిగా రూ.80 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు పారితోషికంగా అందుతుందన్నారు. సాంఘిక నాటకాలకు ఇదే వరుసలో రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు.. నాటికలు, బాలల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు పారితోషికంగా అందజేస్తామన్నారు.
Advertisement
Advertisement