epic
-
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్‌తో
పోలింగ్ బూత్ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్ష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్లైన్లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే సరి ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ (voters. eci.gov.in)ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్‌తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌కు వెళ్లవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం!
ఎందరో రచయితలు ఎన్నో పుస్తకాలు రాస్తారు. అవి పాఠకులెందరినో అలరించాయి. కొన్ని పుస్తకాలు విశేషమైన ప్రజాదరణతో పాఠకుల మనసులను రంజింప చేస్తాయి. కానీ ఈ పుస్తకం మాత్రం అరుదైన గౌరవం పొందేలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం పాఠకులను ఆకట్టుకోవచ్చు లేదా రంజింపచేయకపోవచ్చేమో! గానీ చదివే వారిని ఆలోచింపజేసి చైతన్యవంతుల్ని చేస్తుంది. ఇలాంటి ఆలోచనలతో కూడిన గీతాలు ఉంటాయా? ఇలా కూడా సమాజ సేవ చేయొచ్చా అనిపించేలా ఉంటుంది ఈ విశిష్ట పుస్తకం. ఆ పుస్తకం కథాకమామీషు గురించే ఈ కథనం!. పుస్తకం పేరు "ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వోకేషన్". ఇది ప్రపంచ శాంతి, సామరస్యం ప్రధాన ఇది వృత్తంగా ఆంగ్లభాషలో సవివరంగా రచించిన సుదీర్ఘ కావ్యం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రపంచశాంతి కోసం రచించిన ఓ అమూల్యమైన ప్రార్థన. ఇందులో మానవచరిత్రలోనే ప్రపంచశాంతి కోసం సాగిన విస్తృత అన్వేషణ గురించి తెలియజేసే భావగీతం ఉంటుంది. పైగా ఈ విశిష్ట పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము నూరు శాతం సమాజానికే కేటాయించడం మరో విశేషం. ఈ పుస్తక రచయిత తెలంగాణకు చెందిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పుస్తకాన్ని ఈ నెల అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితికి అంకితం చేయనున్నారు. ఈ పుస్తక విక్రయం ద్వారా వచ్చే డబ్బును ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలకు వరుసగా 50%, 25%, 25% చొప్పున లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అంకితం చేశారు. ఈ పుస్తక థీమ్ ప్రపంచ శాంతి, సామరస్యం కాగా, ఇందులో 10 కావ్యభాగాలు ఉన్నాయి. ఈ విశిష్ట పుస్తకంలో ఏం ఉంటాయంటే.. పుస్తకం టైటిల్ / శీర్షిక : “ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” (An Invaluable Invocation) ఓ అమూల్యమైన ప్రార్థన కవి/రచయిత : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సాహిత్య ప్రక్రియ/ జానర్ : సుదీర్ఘ కావ్యం (Epic poem) రచన ఉద్దేశం, ఆశయం (Scope) : మానవ చరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ భావగీతం. ప్రధానాంశం / ఇతివృత్తం (Theme) : ప్రపంచ శాంతి, సామరస్యం రచన నిర్మాణక్రమం (Structure) : 10 కావ్యభాగాలు / ఆశ్వాసాలు (Cantos) 1.Prelude to Peace (శాంతి ప్రస్తావన / శాంతి పీఠిక) 2.Invocation (ప్రార్థన) 3.Humanity and Unity (మానవజాతి-ఐక్యత) 4.The Broken World (దుఃఖమయ ప్రపంచం) 5.Global Peace and Unity (ప్రపంచ శాంతి-ఐక్యత) 6.United Nations, United Efforts (ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ) 7.Protecting Our Planet (భూమాత పరిరక్షణ) 8.Realization and Power (మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు) 9.The Final Verse : A Summation of Our Journey (అంతిమ పద్యకృతి--ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం) 10.Acknowledgments (కృతజ్ఞతాంజలి) ఈ పుస్తకం ఎవరికోసం అంటే.. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులు, ప్రపంచ పౌరులు, ప్రతీ ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే అద్వితీయ, అమేయ భావగీతమిది. పుస్తక రచయిత శ్రీనాథాచారి నేపథ్యం దగ్గరకు వస్తే..ఆయన ఇంగ్లిష్‌లో పీహెచ్డీ, సైకాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కళాశాల ప్రిన్సిపల్, ఆంగ్ల విభాగాధిపతిగా సేవలందించారు. అంతేగాదు బహుళ విభాగాల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డును దక్కించుకున్న విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం ఫ్రీలాన్స్‌గా వక్తిత్వ వికాస నిపుణులుగా పలు సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఇక ఆయన రచనల విషయానికి వస్తే.. ఫర్సేక్ మీ నాట్(Forsake Me Not) టైటిల్ ఓ ఆంగ్ల కవితా సపుటిని వెలువరించారు. ఇది ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో eబుక్‌గా అందుబాలో ఉంది కూడా. ఎన్నో పత్రికల్లో ఆయన కవితలు అచ్చు అయ్యాయి. ఇంగ్లీష్ జాతీయాలపై ఆయన రాసిన హ్యాండీ క్రిస్టల్స్ (Handy Crystals) పుస్తకం 2010లో లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ బుక్ విభాగంలో గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. (చదవండి: అక్షరాల... టైమ్ ట్రావెల్!) -
వివాదాస్పదంగా గూగుల్ భారీ డీల్
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ పోటీలో నిలబడేందుకు గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్‌లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి కాంట్రాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం మరింత వివాదానికి దారితీసింది. 2019లో గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు గనుక థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించనట్లయితే(ప్రీ ఇన్స్టాల్ టైంలో వేరే ప్లేస్టోర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం).. వల్ల గూగుల్ ఆ కంపెనీలకు కొంత రెవెన్యూను అందజేస్తుంది. ఈ ప్రోగ్రాంతోనే ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఓ వెలుగు వెలుగుతోంది గూగుల్. అయితే తాజాగా ఆ డీల్‌ను మరోసారి తెర మీదకు తెచ్చింది. చదవండి:గూగుల్ ఫొటోస్.. ఇది తెలుసుకోండి ఈసారి థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతో పాటు, ఏపీకే ఇన్స్టాల్స్ యాప్స్‌ను సైతం ఇన్స్టాల్ చేయకూడదని కండిషన్స్ పెట్టింది గూగుల్. అప్పుడు కేవలం ఫోన్ల మార్కెట్‌ప్లేస్‌లో గూగుల్‌ప్లేస్టోర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎపిక్ గేమ్స్‌తో గూగుల్‌కు వివాదం మొదలైంది. సీక్రెట్‌గా ఫోన్ కంపెనీలతో గూగుల్ చేసుకుంటున్న ఒప్పందం నైతిక విలువలకు విరుద్ధమని కోర్టుకు ఎక్కింది ఎపిక్ గేమ్స్. ఇక గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం రెవెన్యూ నుంచి 12 శాతం వాటా తీసుకుంటాయి కంపెనీలు. ఇది ఆల్రెడీ అందుకుంటున్న 8 శాతం ఆదాయం కంటే అదనం. original equipment manufacturer (OEM)లో భాగంగా.. ఒప్పో, వీవో, వన్‌ఫ్లస్ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ భాగం అయ్యాయి. -
బైజూస్ విదేశీ షాపింగ్
న్యూఢిల్లీ: దేశీ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం ఎపిక్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,730 కోట్లు). అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఎపిక్ కొనుగోలు తోడ్పడగలదని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్‌పై అదనంగా 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ సందర్భంగా రవీంద్రన్ వివరించారు. ఎపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సురేన్ మార్కోసియన్తో పాటు మరో సహ వ్యవస్థాపకుడు కెవిన్ డోనాహ్యూ ఇకపైనా అదే హోదాల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ‘నేర్చుకోవడంపై పిల్లల్లో ఆసక్తి కలిగించాలన్నది మా లక్ష్యం. ఎపిక్, దాని ఉత్పత్తులు కూడా ఇదే లక్ష్యంతో రూపొందినవి. అందుకే ఈ కొనుగోలు ఇరు సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదు‘ అని ఆయన తెలిపారు. తమ లక్ష్యాల సాధానకు బైజూస్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని మార్కోసియన్ ధీమా వ్యక్తం చేశారు. ఎపిక్ ప్లాట్‌ఫాంలో 40,000 పైచిలుకు పుస్తకాలు, ఆడియోబుక్స్, వీడియోలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఇరవై లక్షల పైచిలుకు ఉపాధ్యాయులు, 5 కోట్ల దాకా యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఆన్లైన్ విద్యాభ్యాసం వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితుల నేపథ్యంలో ఎడ్టెక్ రంగ సంస్థలకు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. జోరుగా కొనుగోళ్లు.. 2015లో ప్రారంభమైన బైజూస్ సర్వీసులను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పలు సంస్థలను బైజూస్ వరుసగా కొనుగోలు చేస్తోంది. 2017లో ట్యూటర్‌విస్టా, ఎడ్యురైట్ను.. 2019లో ఓస్మోను దక్కించుకుంది. గతేడాది కోడింగ్ ట్రైనింగ్ ప్లాట్‌ఫాం వైట్‌హ్యాట్ జూనియర్‌ను 300 మిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. ఇక ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను (ఏఈఎస్ఎల్) కొనుగోలు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి బైజూస్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, సెకోయా క్యాపిటల్, నాస్పర్స్, చాన్–జకర్బర్గ్ ఇనీషియేటివ్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. -
కరామా
చర్చి ఆవరణలో గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్న కేరళ, ఆంధ్రప్రదేశ్ మహిళలల్లో.. కరుణను వెదుక్కోసాగాడు గంగాధర్. అతణ్ణి చూసిన కరుణ ‘‘గంగాధర్...’’ అని పిలుస్తూ చేయి ఊపింది. తన పేరు వినిపించిన వైపు వెళ్లాడు. ‘‘మస్తు సేపట్నించి నిలబడ్డవా?’’ అడిగాడు. ‘‘లేదు ఇప్పుడే అయిపోయింది’’ అంది అతణ్ణి చేరుకుంటూ. చలికాలపు ఉదయం వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇద్దరి నడక ఒక్కటిగానే సాగుతున్నా.. మనసుల్లో వేర్వేరు ఆలోచనలు! ‘‘ఎట్ల మొదలు వెట్టాలే?’’ అని గంగాధర్‌లో, ‘‘తను చెప్పేవాటికి ఒప్పు కుంటాడో లేదో?’’ అని లక్ష్మీ కరుణలో ఒకరకమైన అంతర్మ థనం! ‘‘సమర్ ఖండ్‌కి పోదామా?’’ అడిగాడు. సరే అన్నట్టుగా తలూపింది ఆమె. ‘‘ఆ హోటల్లో పనిచేస్తున్న ఫ్రెండ్.. కరామాలో బంకర్..’’ అని నాలుక్కర్చుకున్నాడు. ఆ చివరి మాట విననట్టే నటించింది ఆమె. ఇంకా చెప్పాలంటే ఆ మాటతో ఒక ధైర్యం కూడా వచ్చినట్టయింది ఆమెకు. తేలికగా శ్వాసను వదులుతూ హాయిగా నిట్టూర్చింది. అంతలోకే మనసులో ఏదో దిగులూ మొదలైనట్టుంది.. తన కేరళ ఫ్రెండ్ షేర్లీ పనిచేసే షేక్ దగ్గరే గంగాధర్ కూడా పనిచేస్తున్నాడు డ్రైవర్‌గా. అట్లా షేర్లీతోనే పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం చర్చి దగ్గరకు వస్తున్నాడు. కలుస్తున్నాడు. అతని మనసులో ఏముందో తనకు తెలుసు.. కాని తనకిది కొత్త. దుబాయ్‌కి ఆ మాటకొస్తే గల్ఫ్‌కే తను వచ్చి యేడాది అవుతోంది. మూడేళ్ల పిల్లాడిని అమ్మ దగ్గర వదిలేసి. తాగుబోతు సచ్చినోడు.. వాడే బాగుంటే ఇక్కడ ఇలా.. ఈ దున్నపోతు పిల్లల ముడ్లు, షేక్ పెళ్లాల గుడ్డలు, ఎంగిలి కంచాలు కడిగే ఖర్మే పట్టేది కాదు. వాడికి కష్టపడ్డం చేతకాక తనను పంపించాడు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఏం తింటున్నాడో...’’ అనుకుంటూంటే కళ్లల్లో నీళ్లొచ్చాయి లక్ష్మీ కరుణకు. ‘‘కరుణా.. నా రూమ్ ఇక్కడ్నే’’ అంటూ తన బ్యాచలర్ రూమ్ ఉన్న రెడ్డి కంపౌండ్‌ను చూపిస్తున్న గంగాధర్ మాటతో తన జ్ఞాపకాలను వదిలేసింది ఆమె. సమర్ ఖండ్‌లోని మూల టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్న వాళ్లను చూసి సర్వర్ డ్రెస్‌లో ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు.. ‘‘హలో గంగన్నా..’’అంటూ! ‘‘ఆ.. రాజేష్’’అంటూ ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘‘ కరుణ, ఆంధ్ర’’ అంటూ పరిచయం చేశాడు. పలకరింపుగా నవ్వింది ఆమె. ‘‘టిఫిన్ జేస్తరు కదా..?’’ అడిగాడు రాజేష్. అవునన్నట్టు తలూపాడు గంగాధర్. ‘‘ఇడ్లీ, దోసె.. పెసరట్టు.. ’’ అంటూ అతను ఇంకేదో చెప్పబోతుంటే ‘‘పెసరట్టు, ఉప్మా’’ అన్నది లక్ష్మీ కరుణ. రాసుకుంటూ ‘‘నీకు అన్నా..’’ అడిగాడు గంగాధర్‌ను. ‘‘రెండు ఇడ్లీ, వడ తమ్మీ’’చెప్పాడు గంగాధర్. రాసుకొని లోపలికి వెళ్లాడు అతను. గంగాధర్ కళ్లకు తన కళ్లు చిక్కకుండా హోటల్ నాలుగు దిక్కులను, అందులోని జనాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది ఆమె. గంగాధర్ చూపులు కరుణ మీదున్నాయి కాని.. మెదడు తన ఊళ్లోని ఇంటికి వెళ్లింది. ఇద్దరు ఆడివిల్లలు.. కొడుకు పుడ్తడు మూడో కాన్పు సూడుండ్రిరా అని అమ్మ అంటే ఇంట్ల ఎవ్వరికీ తెల్వకుండా సర్కారు దవాఖాన్ల ఆపరేషన్ జేసుకొని అచ్చిండు. జీవితంల ఏదన్న మంచి పని జేషిండు అంటే గదే! ఉన్న రెండకరాల పొలంకు వారసుడు లేకుండా జేషిండు కొడుకు అని అమ్మ ముక్కు చీదని చుట్టపు ఇల్లు లేదు. గల్ఫ్‌ల ఉంటున్ననని ఆ పొలంకు రైతుబంధు కూడా వస్తలేదు. ఏం జేస్తడు? మంచమున్నంతల్నే కాళ్లు జాపుకోవాల్నని బాపమ్మ జెప్తుండే. తాత ఇచ్చిన షేనుందా? బాపు సంపాదించిపెట్టిన బంగ్లలున్నయా గంపెడు పోరగాండ్లను కని సాకతందుకు? పెండ్లాం నూకితే నూరడ్డాలు వడేటట్టు ఉంటది. ఆ బక్కపానానికి బీడీలు జేసుకుంట ఇల్లెల్లేటట్టు జూస్తుంది. తను పంపేది మిత్తీలు, అప్పులు కట్టతందుకే అయితుంది. కాపాయం దాకా రానేరాలే ఇంకా! గివన్నీ దల్సుకుంటే ఇండియాకే పోబుద్ధికాదు... ‘‘గంగన్నా...’’ అంటూ రాజేష్ అతని భుజం తడ్తేకాని తను దుబాయ్‌లో ఉన్న సంగతి గుర్తుకురాలేదు గంగాధర్‌కు. ‘‘ఏమైంది’’ అన్నట్టు సైగ చేసింది లక్ష్మీకరుణ. ‘‘ఏం లేదు’’ అన్నట్టు కళ్లతోనే చెప్పి ముందున్న టిఫిన్ ప్లేట్ వైపు చూశాడు. తన బ్యాగ్‌లోంచి శానిటైజర్ తీసి అతనికి ఇచ్చింది. చేతులు తుడుచుకొని టిఫిన్‌కు ఉపక్రమించాడు. ‘‘అన్నా.. మధు ఎరికే గదా నీకు?’’ అడిగాడు రాజేష్ గంగాధర్ పక్కనే కూర్చుంటూ. ‘‘కోరుట్ల మ«ధే గదా..’’ నోట్లో ఇడ్లీ ముక్కతో గంగాధర్. ‘‘ఔనే..! గాయన, కడ్తాల్ శ్రీను ఇద్దరు కల్సి కరామాలో ఒక కాంప్లెక్స్‌ల అపార్ట్మెంట్ లీజ్‌కి తీస్కున్నరు. గండ్లనే ఒక బంకర్బెడ్ ఉన్నదన్నడు మధు. ఇయ్యాల నువ్వు కలుస్తవని జెప్పిన. ఫోన్ నంబర్ ఇస్త నీకు.. పొయ్యి కలువు.. ఓకే అయినట్టే’’ చెప్పాడు రాజేష్. అతని మాటలు వింటూ లక్ష్మీకరుణ వంక చూశాడు గంగాధర్. ఆమె తల వంచుకొని ఉప్మాను పెసరట్టుతో చుడుతోంది. ‘‘సరే’’అన్నట్టు తలూపాడు గంగాధర్. ‘‘మంచిదన్నా మరి.. పోతా.. మేనేజర్ చూస్తే ఒర్రుతడు. మధు నంబర్ నీకు మెసేజ్ చేస్తా.. ’’ అంటూ లక్ష్మీకరుణ వైపూ తిరిగి వీడ్కోలుగా నవ్వి.. గంగాధర్ ఎడమ చేయిలో చేయివేసి ‘‘ఆడికి వొయినంక ఏదన్నా ప్రాబ్లం ఉంటే కాల్ జెయ్’’ అని చెప్పి పనిలోకి వెళ్లిపోయాడు రాజేష్. మెట్రో స్టేషన్‌వైపు వెళ్తుంటే చెప్పింది లక్ష్మీకరుణ.. ‘‘ముందు షాపింగ్‌కి పోదాం.. ’’ అని. అర్థమైంది గంగాధర్‌కు. లక్ష్మీకరుణను కాస్త ముందు నడవనిచ్చి జేబులోంచి పర్స్తీసి చూసుకున్నాడు.. అయిదు, ఇరవై నోట్ల దిర్హామ్‌ల చిన్న కట్ట ఉంది. ఊపిరి పీల్చుకొని ఆమెను అనుసరించాడు. అంతకు ముందు సాగిన వాళ్ల అంతర్మాథ నానికి వాళ్ల ప్రయత్నం లేకుండానే పరిష్కారం దొరికి నట్టయింది. ∙సరస్వతి రమ -
పురాణ దృశ్య కావ్యాలు.. పద్య నాటకాలు
– ముగిసిన నంది నాటకోత్సవాలు కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పద్యనాటకాలు భారతీయ పురాణ గాథల దృశ్యకావ్యాలుగా నిలిచాయి. రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో నిర్వహించగా.. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన నాటక సమాజాలకు కర్నూలు వేదికగా నిలిచింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు ప్రదర్శించిన పద్యనాటకాలు పౌరాణిక నాటక ప్రాభవాన్ని చాటిచెప్పాయి. కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’, కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి ప్రదర్శించిన ‘దేవుడు’, సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్వారు ప్రదర్శించిన ‘గంగాంబిక’ పద్య నాటకాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రమీలార్జున ప్రణయ వృత్తాంతానికి అద్దం పట్టిన ప్రమీలార్జున పరిణయం... కర్నూలు లలిత కళాసమితి కళాకారులు గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం పద్యనాటకం మహాభారతంలోని ప్రమీలార్జున ప్రణయగాథకు అద్దం పట్టింది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాప పరిహారం కోసం ధర్మరాజును అశ్వమేథ యాగం చేయాలని వ్యాసుడు ఆదేశిస్తాడు. ధర్మరాజు అర్జునుడికి అశ్వరక్షకుడిగా పంపిస్తాడు. భీముడు, అర్జునుడు యుద్ధాలలో తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నా పేరు, ప్రఖ్యాతులు మాత్రం శ్రీకృష్ణునికే చెందుతున్నాయని బాధపడతారు. ఇది గమనించిన కృష్ణుడు అశ్వమేథ యాగానికి తాను దూరంగా ఉంటానని భీమార్జునులతో చెబుతాడు. అర్జునుడు అశ్వరక్షణకు బయలుదేరి మహిళా సామ్రాజ్య అధినేత్రి ప్రమీల రాణిని చేరుకుంటాడు. స్త్రీ సామ్రాజ్యానికి మహారాణిగా చాటుకున్న ప్రమీల అర్జునుడిని యుద్ధంలో ఓడిస్తుంది. గర్వభంగమైన అర్జునుడు.. కృష్ణుడు తన వెంట లేకపోవడమే తన ఓటమికి కారణమని గుర్తిస్తాడు. ఘటోత్కచుని తనయుడు మేఘవర్ణుడు శ్రీకృష్ణుడిని అశ్వమేథ యాగంలో ప్రవేశపెడతాడు. కృష్ణుడు ప్రమీలకు గర్వభంగం చేసి అర్జునునితో పరిణయం చేయిస్తాడు. నాటకం మధ్యలో భీముడు, మేఘవర్ణుని యుద్ధ సన్నివేశం, కుతూహలం, కోలాహలం అనే పాత్రల మధ్య సాగే హాస్య సరస సంభాషణ ప్రేక్షకులను అలరించాయి. పల్లేటి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. దైవభక్తి విశిష్టతను చాటిన ‘దేవుడు’... కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడు’ పద్యనాటకం ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి విశిష్టతను చాటుకుంది. దైవభక్తి మెండుగా కల్గిన మహేంద్రుడనే యువకుడు సన్యాసిగా మారి దేశమంతటా పర్యటిస్తూ ధర్మప్రచారం చేస్తూ సాటి వారిపై ప్రేమానురాగాలు చూపిస్తూ మానవతా దృక్పథాన్ని చాటిచెప్పడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. మహేంద్రుడు ఒక వృద్ధుడిని కాపాడబోయి చేతిలోని శివలింగాన్ని జారవిడుస్తాడు. శివలింగం ముక్కలైపోగా విచారంగా ఇల్లు చేరుకుంటాడు. అతని తండ్రి విశ్వనాథుడు ఆ నింద నుండి విముక్తి పొందడానికి కాళీ మాతని దర్శించమని కోరుతాడు. గంగానది ఒడ్డున ఉన్న కాళీ మాత దర్శనం కోసం వెళ్తూ ఒక పడవ వాడిని, పవిత్ర అనే దేవదాసిని, దళితుడైన లక్ష్మన్నను కలసి మానవత్వం గురించి తెలుసుకుంటాడు. చివరకు బాధితులైన మానవులకు సేవ చేయడంలోనే దైవదర్శనం జరుగుతుందని మహేంద్రుడు గ్రహిస్తాడు. బి.పద్మనాభాచారి ఈ నాటకానికి రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మానవతా విలువలను చాటిన ‘గంగాంబిక’... సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్ కళాకారులు ప్రదర్శించిన గంగాంబిక పద్యనాటకం మానవతా విలువలను చాటిచెప్పింది. భూలోకంలో మానవతా విలువలు తగ్గుముఖం పట్టి రాక్షసత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో నారదుడు మానవులలో ప్రేమానుబంధాల పట్ల విశ్వాసాన్ని, వర్ణవైశమ్యాలు లేని సమసమాజాన్ని ఏర్పరచమని దేవతలను కోరతాడు. త్రిమూర్తులలో ఒకరైన మహేశ్వరుడు సంగమేశ్వరుడై తన బాధ్యతను గంగా బసవేశ్వర రూపంలో నెరవేరుస్తాడు. గంగా బసవేశ్వరులను భూలోకానికి పంపి భార్యాభర్తల అనుబంధాన్ని, మనిషి మనిషికి మధ్య ఉండాల్సిన మానవీయ బంధాన్ని ఏర్పరచడమే శైవ మత ప్రధాన లక్ష్యమని తెలియజేస్తాడు. తడకమల్ల రామచంద్రరావు రచించిన ఈ నాటకానికి సావేరి భవాని దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. విజయవంతంగా ముగిసిన నంది నాటకోత్సవాలు కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, ఈ నాటకోత్సవాల నిర్వహణకు సహకరించిన కళాకారులు, ప్రేక్షకులు, టీజీవి కళాక్షేత్ర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలియజేశారు. 16 రోజులుగా టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో సాంఘిక, బాలల, పౌరాణిక పద్య నాటకాల విభాగాల్లో 61 నాటకాలు ప్రదర్శించారని.. 1300 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారన్నారు. ఈ నాటకోత్సవాల్లో ప్రముఖ సినీ, టీవీ కళాకారులు కోట శంకర్రావు, సుబ్బరాయ శర్మ, మేక రామకృష్ణ, గోవాడ వెంకట్, జబర్దస్త్ మురళి, కృష్ణమోహన్, సురభి ప్రభావతి తదితరులు పాల్గొన్నారన్నారు. సాంఘిక నాటికల విభాగంలో 30 ప్రదర్శనలు, కళాశాల, విశ్వవిద్యాలయ విభాగంలో రెండు ప్రదర్శనలు, బాలల విభాగంలో 7 ప్రదర్శనలు, పద్యనాటక విభాగంలో 22 ప్రదర్శనలు టీజీవి కళాక్షేత్రంలో జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో జరిగిన నంది నాటకోత్సవాలలో విజేతలైన కళాకారులకు మార్చి మొదటి వారంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 14 వ్యక్తిగత బహుమతులు అందజేస్తామన్నారు. నాటకోత్సవాలకు ఐదుగురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారన్నారు. పద్య నాటకాలకు ప్రథమ బహుమతిగా రూ.80 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు పారితోషికంగా అందుతుందన్నారు. సాంఘిక నాటకాలకు ఇదే వరుసలో రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు.. నాటికలు, బాలల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు పారితోషికంగా అందజేస్తామన్నారు.