న్యూఢిల్లీ: దేశీ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం ఎపిక్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,730 కోట్లు). అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఎపిక్ కొనుగోలు తోడ్పడగలదని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్‌పై అదనంగా 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ సందర్భంగా రవీంద్రన్ వివరించారు. ఎపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సురేన్ మార్కోసియన్‌తో పాటు మరో సహ వ్యవస్థాపకుడు కెవిన్ డోనాహ్యూ ఇకపైనా అదే హోదాల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.
‘నేర్చుకోవడంపై పిల్లల్లో ఆసక్తి కలిగించాలన్నది మా లక్ష్యం. ఎపిక్, దాని ఉత్పత్తులు కూడా ఇదే లక్ష్యంతో రూపొందినవి. అందుకే ఈ కొనుగోలు ఇరు సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదు‘ అని ఆయన తెలిపారు. తమ లక్ష్యాల సాధానకు బైజూస్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని మార్కోసియన్ ధీమా వ్యక్తం చేశారు. ఎపిక్ ప్లాట్‌ఫాంలో 40,000 పైచిలుకు పుస్తకాలు, ఆడియోబుక్స్, వీడియోలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఇరవై లక్షల పైచిలుకు ఉపాధ్యాయులు, 5 కోట్ల దాకా యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఆన్‌లైన్ విద్యాభ్యాసం వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితుల నేపథ్యంలో ఎడ్‌టెక్ రంగ సంస్థలకు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది.
జోరుగా కొనుగోళ్లు..
2015లో ప్రారంభమైన బైజూస్ సర్వీసులను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పలు సంస్థలను బైజూస్ వరుసగా కొనుగోలు చేస్తోంది. 2017లో ట్యూటర్‌విస్టా, ఎడ్యురైట్‌ను.. 2019లో ఓస్మోను దక్కించుకుంది. గతేడాది కోడింగ్ ట్రైనింగ్ ప్లాట్‌ఫాం వైట్‌హ్యాట్ జూనియర్‌ను 300 మిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. ఇక ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను (ఏఈఎస్‌ఎల్) కొనుగోలు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి బైజూస్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, సెకోయా క్యాపిటల్, నాస్పర్స్, చాన్–జకర్‌బర్గ్ ఇనీషియేటివ్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి.
బైజూస్ విదేశీ షాపింగ్
Published Thu, Jul 22 2021 3:11 AM | Last Updated on Thu, Jul 22 2021 3:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment