
ఒకే ఎపిక్ నంబర్ ఉన్న కార్డులపై ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్) నంబర్‌తో ఒకటికి మించి ఓటర్ గుర్తింపు కార్డులు జారీ అయిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచి్చంది. ఒకే ఎపిక్ నంబర్ ఉన్నా అవేవీ నకిలీ ఓటర్ కార్డులు కావని స్పష్టంచేసింది. ‘‘వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌లను ఉపయోగించడం వల్ల కొందరు ఓటర్లకు ఒకే తరహా ఎపిక్ నంబర్ ఉన్న కార్డులు జారీ అయ్యాయి.
ఎపిక్ నంబర్ ఒకలా ఉన్నంత మాత్రాన అవి నకిలీ/డూప్లికేట్ కార్డులు కావు. అన్నీ ఒరిజినల్ కార్డులే’’ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటర్లు ఒకే ఎపిక్ నంబర్‌లను కలిగి ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఈసీ ఈ మేరకు స్పందించింది. దాంట్లో గందరగోళ పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ‘‘పలు రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు ఒకే ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌ను అనుసరించడంతో ఇలా జరిగింది.
అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ డాటాబేస్‌ను సమీకృత ఎలక్టోరల్ రోల్ మేనేజ్‌మెంట్ (ఎరోనెట్) ప్లాట్‌ఫాంలోకి మార్చడానికి ముందు, అంటే కేంద్రీకృత వ్యవస్థను అమలుచేయని కాలంలో ఎపిక్ మాన్యువల్‌గా నంబర్లను కేటాయించినప్పుడు ఇది జరిగింది. ఓటర్ల ఎపిక్ నంబర్లు ఒకేలా ఉండొచ్చు గానీ వారి వ్యక్తిగత వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ తదితర వివరాలన్నీ వేరుగానే ఉంటాయి. అలాంటి ఓటరు స్వరాష్ట్రంలో సంబంధిత నియోజకవర్గంలో నిర్దేశించిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేసేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా భయాందోళనలుంటే అలాంటి వారికి ప్రత్యేక (యూనిక్) ఎపిక్ నంబర్‌ను కేటాయిస్తాం. అందుకు వీలుగా ఎరోనెట్ 2.0 ప్లాట్‌ఫాంను త్వరలో అప్‌డేట్ చేస్తాం’’ అని ఈసీ పేర్కొంది.