Voter identification card
-
అవేవీ నకిలీ ఓటర్ కార్డులు కావు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్) నంబర్‌తో ఒకటికి మించి ఓటర్ గుర్తింపు కార్డులు జారీ అయిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచి్చంది. ఒకే ఎపిక్ నంబర్ ఉన్నా అవేవీ నకిలీ ఓటర్ కార్డులు కావని స్పష్టంచేసింది. ‘‘వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌లను ఉపయోగించడం వల్ల కొందరు ఓటర్లకు ఒకే తరహా ఎపిక్ నంబర్ ఉన్న కార్డులు జారీ అయ్యాయి. ఎపిక్ నంబర్ ఒకలా ఉన్నంత మాత్రాన అవి నకిలీ/డూప్లికేట్ కార్డులు కావు. అన్నీ ఒరిజినల్ కార్డులే’’ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. పలు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటర్లు ఒకే ఎపిక్ నంబర్లను కలిగి ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఈసీ ఈ మేరకు స్పందించింది. దాంట్లో గందరగోళ పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ‘‘పలు రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు ఒకే ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌ను అనుసరించడంతో ఇలా జరిగింది. అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ డాటాబేస్‌ను సమీకృత ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ (ఎరోనెట్) ప్లాట్‌ఫాంలోకి మార్చడానికి ముందు, అంటే కేంద్రీకృత వ్యవస్థను అమలుచేయని కాలంలో ఎపిక్ మాన్యువల్‌గా నంబర్లను కేటాయించినప్పుడు ఇది జరిగింది. ఓటర్ల ఎపిక్ నంబర్లు ఒకేలా ఉండొచ్చు గానీ వారి వ్యక్తిగత వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ తదితర వివరాలన్నీ వేరుగానే ఉంటాయి. అలాంటి ఓటరు స్వరాష్ట్రంలో సంబంధిత నియోజకవర్గంలో నిర్దేశించిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేసేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా భయాందోళనలుంటే అలాంటి వారికి ప్రత్యేక (యూనిక్) ఎపిక్ నంబర్‌ను కేటాయిస్తాం. అందుకు వీలుగా ఎరోనెట్ 2.0 ప్లాట్‌ఫాంను త్వరలో అప్డేట్ చేస్తాం’’ అని ఈసీ పేర్కొంది. -
అనుసంధానం
ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ మొదటి స్థానంలో డోర్నకల్.. చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ మార్చి 15న ప్రారంభమైన ప్రక్రియ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం పోచమ్మమైదాన్ : బోగస్ ఓట్లను ఏరివేయూలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం చేసింది. జిల్లాలో మార్చి 15న ప్రారంభమై.. జూలై చివరి వరకు పూర్తికావాలని గడువు విధించారు. అనంతరం మళ్లీ ఆగస్టు 15 వరకు పొడిగించారు. అనుసంధాన ప్రక్రియలో డోర్నకల్ నియోజకవర్గం మొదటిస్థానంలో ఉండగా, చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. కాగా, ఒకరికి రెండు నుంచి మూడు చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని గుర్తించేందుకు ఆధార్ కార్డుతో లింక్ పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఫస్ట్ డోర్నకల్ ఈ నెల 13 వ తేదీ వరకు ఓటు హక్కుకు ఆధార్ లింక్ చేయడంలో డోర్నకల్ ప్రథమ స్థానంలో నిలిచింది. డోర్నకల్ నియోజకవర్గంలో 1,70,890 మంది ఓటర్లు ఉండగా అందులో 1,70,833 మంది ఓటర్లను ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు. మిగతా 57 ఓటర్లలో బీఎల్ఓలు పరిశీలించగా డూప్లికేట్వి 9, మరణించిన వారివి 3, షిఫ్ట్ అయినవి 39, డోర్ లాక్ ఉన్నవి 4, ఎన్రోల్ చేసుకోనివి 2 ఉన్నాయి. 100 శాతం డోర్నకల్ నియోజకవర్గం ఓటర్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం పూర్తయింది. చివరన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. 2,45,335 మంది ఒటర్లు ఉండగా 1,00,901 ఓటర్లు మాత్రమే ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం అయింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య. పశ్చిమ నియోజకవర్గంలో బీఎల్ఓ ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఇంక ఆధార్ లింక్ కాని 1,44,434 ఓటర్ల ఇంటింటికి తిరిగి బీఎల్ఓ విచారణ చేపట్టగా 3,049 ఓట్లు డుప్లికేట్విగా, ఎలిజిబుల్ కానీ వారు 983, మరణించిన వారు 1,974, షిఫ్ట్ అయిన వారు 30,579, డోర్ లాక్ ఉన్నవి 1,00,004, ఎన్రోల్ చేసుకోని వారు 3,269, ఇంక ఎన్రోల్ చేయాల్సినవి 4,576 ఉన్నాయి. జిల్లాలో 24,44,989 మంది ఓటర్లు ఉండగా 19,95,749 మంది ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేశారు. ఆధార్ అనుసంధానంకు అందరూ సహకరించాలి రవీందర్, తహసీల్దార్, వరంగల్. ఆధార్ ఆనుసంధానంకు ప్రతీ ఒక్క ఓటరూ సహకరించాలి. తమ వద్దకు వచ్చే బీఎల్ఓలకు ఆధార్ కార్డుల నంబర్లు అందజేయాలి. ఇలా చేయడం వలన డబుల్ ఉన్న ఓటర్లు తొలగించబడుతారు. దీంతో బోగస్ ఓటర్లు పూర్తి స్థాయిలో తొలగించబడుతారు. -
ఓటర్ల పేర్లు తొలగించడం లేదు
-
ఓటర్ల పేర్లు తొలగించడం లేదు
ఆధార్‌తో అనుసంధానం 44.4 శాతం పూర్తి జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టీకరణ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం గురువారం నాటికి 44.4 శాతం పూర్తయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం 73.51 లక్షల ఓటర్ల కుగాను ఇప్పటి వరకు 32.45 లక్షలు ఓటర్లు ఆధార్‌తో అనుసంధానమయ్యారన్నారు. అలాగే ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వచ్ఛ ఓటర్ల జాబితాకై ఓటర్ల గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. గురువారం జీహెచ్ఎంసీలో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పోల్చి చూస్తే హైదరాబాద్ నగరంలో ఓటర్ల గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందన్నారు. పౌరసరఫరాల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఆధార్ డేటా సేకరించి ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా ఇళ్లు మారినా.. డోర్‌లాక్ , మరణించిన ఓటర్ల జాబితా అన్ని రాజకీయపార్టీలకు అందజేస్తామన్నారు. అలాగే జాబితాను అన్ని సర్కిల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం, వెబ్సైట్లో పొందుపర్చడం చేస్తామన్నారు. -
15 లక్షల బోగస్ ఓటర్లు
నగరంలో నిర్దేశిత జనాభాకన్నా మించిన ఓటర్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఈవో భన్వర్‌లాల్ భేటీ ఆధార్ సీడింగ్, బోగస్ ఏరివేతకు సహకరిస్తామన్న సీఎం ఓటు హక్కును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచన 20 రోజుల్లోగా వందశాతం సీడింగ్ పూర్తిచేస్తామని వెల్లడి హైదరాబాద్ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66 శాతం ఓటర్లు ఉండాల్సి ఉంటే, హైదరాబాద్‌లో ఓటర్ల శాతం అంతకు మించిపోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 15 లక్షల మంది బోగస్ ఓటర్లున్నట్లు అంచనా వేశామన్నారు. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయటం తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేస్తామని, బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఈసీ తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముందుగా హైదరాబాద్ నగరంలో, ఆ తర్వాత రాష్ట్రమంతటా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 15-20 రోజుల్లోనే వంద శాతం ఆధార్ సీడింగ్ చేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున, మొదట ఇక్కడే సీడింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కోరారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితాలు రూపొందాలన్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. నగరంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. లేకుంటే వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే.. అందులో 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయని, బోగస్ ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆధార్ సీడింగ్‌కు సహకరించాలని అభ్యర్థించారు. ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి ఒకటీ, రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అప్పటికీ స్పందించకపోతే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారి పాల్గొన్నారు. -
మరో లింకు!
ఈసారి ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం ⇒ బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడమే లక్ష్యం ⇒ ప్రయోగాత్మకంగా అమలుకు జిల్లా ఎంపిక ⇒ తొలుత ఎనిమిది నియోజకవర్గాల్లో.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: బోగస్ ఓటర్లకు ఇక కళ్లెం పడనుంది. ఒకే వ్యక్తికి పలుచోట్ల ఉన్న ఓట్లను ఏరివేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త చిట్కాను కనుగొంది. అన్నింటా ఆధార్‌ను ఉపయోగిస్తున్నట్టే.. ఇకపై ఓటరు గుర్తింపు కార్డుకూ ఆధార్‌ను అనుసంధానం చేయనుంది. అంతేకాకుండా ఆధార్ నంబర్‌ను ఓటర్ల జాబితాలోనూ పొందుపరచనుంది. ఈ ప్రక్రియతో ఒక వ్యక్తి కేవలం ఒక ఓటరు కార్డు మాత్ర మే పొందే వీలుంటుంది. అంతేకాకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఓటర్ల సంఖ్యపైనా స్పష్టత రానుంది. ఎనిమిది నియోజకవర్గాల్లో.. ఓటరు గుర్తింపు కార్డు వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం(సీడింగ్) చేసేం దుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రి య పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశలవారీగా మిగతా నియోజకవర్గాలకు దీన్ని విస్తరించాలని భావిస్తోం ది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎనిమిది నియోజకవర్గాల్లో ఎపిక్, ఆధార్ కార్డుల సీడింగ్‌ను మొదలుపెట్టాలని ఈసీ సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఈఆర్వో)ను ఆదేశించింది. ఇందులో మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరి లింగంపల్లి నియోజకవర్గాలున్నాయి. ఈ సెగ్మెంట్ల ఈఆర్వోలకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించిన సీడింగ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసింది. డూప్లికేషన్‌కు చెల్లు.. తాజాగా చేపట్టిన ఈ ప్రక్రియతో ఒకరికి ఒక్కచోట మాత్రమే ఓటేసే వీలుం టుంది. సీడింగ్ ప్రక్రియలో ఓటరు ఆధార్ సంఖ్యను ఎన్నికల గుర్తింపు కార్డు(ఎపిక్)తో అనుసంధానం చేస్తారు. దీంతో గతంలో మాదిరిగా రెండుమూడు చోట్ల ఓటరుగా నమోదు చేయించుకుం టే.. వాటిలో ఒకటి మినహా మిగతా ఓట్ల న్నీ సాఫ్ట్వేర్ తొలగిస్తుంది. దీంతో ఇప్పటివరకున్న డూప్లికేట్ ఓట్లన్నీ తొలగిపోనున్నాయి. జిల్లాలో సీడింగ్ ప్రక్రియ చేపట్టే ఎనిమిది నియోజకవార్గాలన్నీ అర్బన్ ప్రాంతాలే. పట్టణ ప్రాంతాల్లో వలసల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటరు నమోదులో పలువురు రెండేసి చోట్ల ఓట్లు నమోదు చేసుకునే వీలుంది. తాజాగా సీడింగ్ ప్రక్రియతో అలాంటి డూప్లికేట్ ఓట్లన్నీ డిలీట్ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
పట్టభద్రుల నమోదు ఇలా..
వైరా : పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో సవరణకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి, తప్పులు సరిచేసుకునేందుకు, మార్పులు, చేర్పులతో పాటు పేర్లు తొలగించడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. మరి ఏయే దరఖాస్తుకు ఎలాంటి ఫారం కావాలి... అవి ఎక్కడ దొరుకుతాయి... ఎక్కడ దరఖాస్తు చేయాలి..? తదితర వివరాలు ఇలా... దరఖాస్తు విధానం దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా http://ec-.in/ecimain1/formsvoters.aspx లింక్‌ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి వివరాలు కరెక్ట్‌గా నమోదు చేయాలి. ఫారంలో చూపిన చోట ఈ-మెయిల్, ఫోన్ నంబరు ఇస్తే నమోదు వివరాల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు జత చేయాల్సినవి... పట్టభద్ర (డిగ్రీ) ధ్రువీకరణ పత్రం ఓటరు గుర్తింపు కార్డు అర్హతలు ఇవీ... నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉండాలి. 2014 జనవరి 1వ తేదీకి మూడేళ్లకు ముందు భారతదేశంలో ఏదైనా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. (డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తి కావాలి) దేనికి ఏ ఫారం..? కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకునే వారు ఫారం 18 పేరును తొలగించేందుకు ఫారం 7 ఓటు హక్కులో ఏమైనా మార్పులు చేయాలంటే ఫారం 8ఏ ఓటు హక్కులో కొత్తగా చేర్పులు చేయాలంటే ఫారం 8 పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను జత చేయాలి. కొత్తగా పేరు నమోదు చేసుకునే వారు, పేరును తొలగించుకోవాలని అనుకునేవారు ఫొటో జత చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఎవరికి సమర్పించాలి..? పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గంలోని అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఇవ్వాలి. ఈనెల 25 నుంచి డిసెంబర్ 16లోగా దరఖాస్తులు అందించాలి. చేయకూడనివి... దరఖాస్తులో తప్పులు దిద్దినా (కొట్టివేతలు), దరఖాస్తు ఫారం చిరిగినా దానిని తిరస్కరిస్తారు. అదేవిధంగా ఏమైనా తప్పుడు సమాచారం పేర్కొంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మరిన్ని వివరాలకు http:// ceo telangana.nic.in వెబ్ సైట్లో చూడొచ్చు. -
అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు మాది గుంటూరు. నేను పూణెలో పనిచేస్తున్నాను. నాకు గుంటూరులో ఓటు ఉంది. ఆన్లైన్ ద్వారా నా ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉందాం? - ఖాసిం, పూణె మీరు పూణెలో పని చేస్తూ గుంటూరులో ఓటు కలిగిఉండటం నిబంధనలకు విరుద్ధం. మీ ఓటు గుంటూరులో రద్దవుతుంది. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆన్లైన్ ఓటింగ్ పద్దతి ప్రస్తుతం మనకు లేదు. ప్రభుత్వోద్యోగులోలని వికలాంగులు, గర్భిణులు, చిన్న పిల్లల తల్లులకు ఎన్నికల డ్యూటీ వేస్తే వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి మినహాయింపు ఇవ్వచ్చుకదా? - కె.రాకేష్ కుమార్, వరంగల్ వికలాంగులు, గర్భిణులు, పసిపిల్లల తల్లులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంది. వారికి ఎన్నికల డ్యూటీ వేయడం లేదు. మా తల్లిదండ్రులకు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నా జాబితాలో వారి పేర్లు లేవు. ఇలాగే చాలామంది పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. వారు ఓటు వేయాలంటే ఏం చేయాలి? - త్యాగి అరుట్ల, ఎల్లెందు ఇప్పుడు ఏమీ చేయలేం. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల సమయం అయిపోయింది. ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకుని లేకపోతే దరఖాస్తు చేసుకొమ్మని మేం చాలా సార్లు చెప్పాం. మీరు గడువులోపు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల ఈ సారికి ఓటు వేయలేరు. నివాసం ఉండే చోటే ఓటు హక్కు ఉంటుందంటున్నారు కదా? అలాంటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్, ఢిల్లీల్లో నివాసం ఉంటూ వారి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కల్గి ఉన్నారు. మాకో న్యాయం? వారికో న్యాయమా..? - భానుచందర్ రెడ్డి, భువనగిరి ప్రజాప్రతినిధులుగా వారి బాధ్యతలు నెరవేర్చేందుకు వారు రాజ దాని నగరాల్లో ఉంటున్నారు. వీరికి ఓటు మాత్రం సొంత నియోజకవర్గంలో ఉంచుకునే వెసులు బాటు ‘ప్రజాప్రానిథ్య చట్టం’ కల్పిస్తోంది. రాష్ట్రపతి, స్పీకర్ లాంటి ‘డిజిగ్నేటెడ్’ పోస్టుల్లో ఉన్నవారికి కూడా చట్టంలో ఈ వెసులుబాటు ఉంది. నేను జైళ్ల శాఖలో ఉద్యోగిని. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు ఉంది. అయితే నేను వేరే చోట పనిచేస్తున్నాను. అత్యవసర సేవలందించే ‘యూనిఫాం’ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్గించవచ్చు కదా? - రమేష్, రాజమండ్రి మీరు ఉద్యోగం చేసే ఊరిలోనే మీరు ఓటరుగా నమోదు చేసుకొని ఉండాల్సింది. యూనిఫాం డ్యూటీలు చేసే వారైనా ‘షిప్ట్’ పద్దతిలో పనివేళలను సవరించుకుని ఓటు వేయాలి. మిగతా ఉద్యోగులకు ఎన్నికల సంఘం పోలింగ్‌రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. ఓటర్ జాబితాలో పేరు ఉంది కానీ, నాకు ఇంతవరకూ ఓటర్ గుర్తింపు కార్డు రాలేదు. నేను ఓటు వేయడం ఎలా? - జి.ముకుందలక్ష్మి, పద్మారావునగర్, హైదరాబాద్ పోలింగ్‌కు ముందే మేం మీకు ఓటర్ స్లిప్ ఇస్తాం. దాంతో మీరు ఓటు వేయవచ్చు. ఒక వేళ స్లిప్ అందకపోతే ఇతరత్రా గుర్తింపు కార్డులు(ఆధార్,రేషన్) చూపి మీరు ఓటు వేయవచ్చు. నా ఓటర్ గుర్తింపు కార్డులో ‘పురుషుడు’ బదులు ‘స్త్రీ’ అని తప్పుగా వచ్చింది. ఈ తప్పును సరిచేసుకోవడం ఎలా? ఓటు వేయడానికి ఇబ్బంది అవుతుందా? - దండు ఓబయ్య, బద్వేల్, కడప జిల్లా ఆధార్, రేషన్ కార్డు లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపి ఓటు వేయవచ్చు. ఓటర్ కార్డులో తప్పుల సవరణకు ఇప్పుడు సమయం మించిపోయింది. ఎన్నికలు అయ్యాక దరఖాస్తు చేసుకుని ఓటర్ గుర్తింపు కార్డులో సవరణ చేయించుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి. -
ఐడీ కార్డు లేకపోతే ఆజాద్ అయినా...
ఓటర్ గైడ్: ఓటర్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డు కాని, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్ లాంటి ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కానీ లేకుండా ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించరు. గుర్తింపు కార్డు లేకుండా వెళ్లిన కేంద్ర మంత్రి ఆజాద్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. జమ్ము పార్లమెంటు స్థానానికి గురువారం(ఏప్రెల్10) జరిగిన పోలింగ్‌లో కేంద్ర మంత్రి గులాబ్ నబీ ఆజాద్ ఓటువేయడానికి వెళ్లారు. అయితే ఆయన తన ఓటరు గుర్తింపు కార్డును తీసుకెళ్లడం మరచి పోయారు. మీరు కేంద్ర మంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా ఓటరుగా వచ్చినప్పుడు గుర్తింపు కార్డు చూపాల్సిందే అని పోలింగ్ అధికారి పట్టుబట్టారు. చివరకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు అజాద్ గుర్తింపుకు పూచీ వహించడంతో చివరకు ఎలాగోలా అజాద్ ఓటు వేయగలిగారు. కాబట్టి ఓటేసేందుకు వెళ్లేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు, అది లేకపోతే ఇతర ఏవైనా గుర్తింపు కార్డులు తీసుకెళ్లడం మరచిపోకండి. -
ఓటరు కార్డుల జారీకి ప్రాధాన్యం ఇవ్వండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు గుర్తింపు కార్డుల జారీకి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వి రెడ్డి మీ సేవా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, పోలింగ్ సిబ్బంది వివరాలు తదితర అంశాలపై తహసీల్దార్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో జేసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ..పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డుల జారీకి మీ సేవా కేంద్రాలు ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్ల నమోదు, జాబితాపై వచ్చిన అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను జేసీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వారం రోజుల తర్వాత ఓటర్లకు కలర్ ఎపిక్ కార్డులు జారీ చేయనున్నట్లు జేసీ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 35 వేల మంది సిబ్బంది అవసర ం ఉంటుందని, పూర్తిస్థాయి వివ రాలు వెంటనే అందజేయాలని తహసీల్దార్లను జేసీ ఆదేశించారు.కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, డీఐఓ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.