ఓటరు గుర్తింపు కార్డుల జారీకి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి రెడ్డి మీ సేవా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటరు గుర్తింపు కార్డుల జారీకి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వి రెడ్డి మీ సేవా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, పోలింగ్ సిబ్బంది వివరాలు తదితర అంశాలపై తహసీల్దార్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో జేసీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ..పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ఓటర్లకు గుర్తింపు కార్డుల జారీకి మీ సేవా కేంద్రాలు ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్ల నమోదు, జాబితాపై వచ్చిన అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను జేసీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వారం రోజుల తర్వాత ఓటర్లకు కలర్ ఎపిక్ కార్డులు జారీ చేయనున్నట్లు జేసీ ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 35 వేల మంది సిబ్బంది అవసర ం ఉంటుందని, పూర్తిస్థాయి వివ రాలు వెంటనే అందజేయాలని తహసీల్దార్లను జేసీ ఆదేశించారు.కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, డీఐఓ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.