గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటర్ల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం గురువారం నాటికి 44.4 శాతం పూర్తయిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం 73.51 లక్షల ఓటర్ల కుగాను ఇప్పటి వరకు 32.45 లక్షలు ఓటర్లు ఆధార్‌తో అనుసంధానమయ్యారన్నారు. అలాగే ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఒక్క ఓటు కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వచ్ఛ ఓటర్ల జాబితాకై ఓటర్ల గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు. గురువారం జీహెచ్‌ఎంసీలో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను పోల్చి చూస్తే హైదరాబాద్ నగరంలో ఓటర్ల గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతుందన్నారు.