Integration
-
వొడాఫోన్ ఐడియా నష్టం 5,005 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్– ఐడియాకు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.5,006 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. వడ్డీ వ్యయాలు అధికంగా ఉండటం, నెట్వర్క్ ఇంటిగ్రేషన్ వ్యయాలు కూడా ఎక్కువగా ఉండటం, మొబైల్ టవర్ వ్యాపారం నుంచి నిష్క్రమించిన వ్యయాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ రెండు కంపెనీలకు కలసి రూ.1,285 కోట్ల నష్టాలొచ్చాయి. గత ఏడాది ఆగస్టు 31న ఐడియా, వొడాఫోన్ల విలీనం పూర్తయినందువల్ల ఫలితాలను పోల్చడానికి లేదు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర నష్టాలు మరింతగా పెరిగాయి. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లు... ఈ క్యూ3లో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లకు పెరిగిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఈ క్యూ2లో సాధించిన మొత్తం ఆదాయం రూ.7,879 కోట్లతో పోల్చితే 52 శాతం వృద్ధి సాధించామని కంపెనీ సీఈఓ బాలేశ్ శర్మ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.6,552 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.2,824 కోట్లుగా ఉన్నాయని, మొబైల్ టవర్ల వ్యాపారం నుంచి బైటకు వచ్చామని, దీనికి గాను వెండర్లకు రూ.725 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉందని తెలిపారు. ఇండస్ టవర్స్‌లో 11.15 శాతం వాటాను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ వాటా విలువ రూ.4,960 కోట్లుగా ఉండొచ్చ న్నారు. అలాగే 1.58 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నామని, ఈ విక్రయాల ద్వారా సమకూరిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగిస్తామని తెలిపారు. రూ.89కు ఏఆర్పీయూ.. ఈ క్యూ3లో ఎబిటా రూ.1,137 కోట్లుగా నమోదైందని, ఈ క్యూ2లో 6 శాతంగా ఉన్న మార్జిన్ ఈ క్యూ3లో 9.7 శాతానికి పెరిగిందని బాలేశ్ శర్మ పేర్కొన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 1.5 శాతం పెరిగి రూ.89కు చేరిందని తెలిపారు. ఒక్కో వినియోగదారుడు వినియోగించే డేటా 5.6 జీబీనుంచి 6.2 జీబీకి పెరిగిందన్నారు. 75 కోట్ల మందికి 4జీ సర్వీసులందేలా 11,123 సైట్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ క్యూ3లో కొత్తగా 95 లక్షల 4జీ యూజర్లు జతయ్యారని, దీంతో మొత్తం 4జీ కస్టమర్ల సంఖ్య 7.53 కోట్లకు చేరిందని వివరించారు. 4జీ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టామని బాలేశ్ శర్మ చెప్పారు. అలాగే 4జీ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనేది లక్ష్య మన్నారు. మూలధన సమీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రణాళికకనుగుణంగా సమీకరించిన నిధులతో వ్యూహాత్మక లక్ష్యాలను సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాజా ఏడాది కనిష్టానికి షేరు.. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేర్ 1.6 శాతం నష్టపోయి రూ.29.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.28.80ను తాకింది. -
కోర్టులతో జైళ్ల అనుసంధానం
నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలో జైళ్లను కోర్టులతో అనుసంధానం చేస్తున్నామని, ఇక నుంచి ఖైదీల హాజరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జీలే తీసుకుంటారని జిల్లా సబ్‌జైళ్ల అధికారి బి.ఈరన్న అన్నారు. ఈమేరకు అన్ని జైళ్లల్లో టీవీలు, ఆన్‌లైన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కోర్టుల్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరసన్నపేట సబ్‌జైల్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతానికి పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట సబ్‌జైళ్లలో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీలను జడ్జి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఎస్కార్టుల సాయంతో ఖైదీలను కోర్టుకు తీసుకువెళ్తున్నామని, ఇక మీదట ఎస్కార్టు అవసరం ఉండదన్నారు. టెక్కలిలో నూతనంగా సబ్‌జైల్ నిర్మాణానికి రూ. 8 కోట్లుతో ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సబ్‌జైల్ ఆవరణలో పెట్రోల్ బంకు కూడా నిర్వహిస్తామన్నారు. ఈమేరకు 2.10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. సోంపేటలో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న సబ్‌జైల్ భవన సాముదాయ స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగించామని, ఇందుకు గాను వేరోచేట స్థలం కేటాయించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. పాలకొండ జైల్లో కిచెన్ అభివృద్ధికి, నరసన్నపేటలో డబుల్ గేట్ నిర్మాణం, కిచెన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. జైళ్ల సిబ్బంది హాజరును బయోమెట్రిక్ ద్వారానే తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట నరసన్నపేట సబ్‌జైల్ సూపరింటెండెంట్ రామకృష్ణ ఉన్నారు. -
అనుసంధానం అవశ్యం
కాజీపేట: అన్ని ప్రభుత్వ పథకాలు.. సేవలకు.. ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఈ ఆధార్ లేకుంటే అన్నింటికీ ఇబ్బందే.. మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని లేకుంటే కనెక్షన్ తొలగిస్తామంటూ వినియోగదారులకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఇప్పటికే సందేశాలు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు వాడుతున్న మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైందో లేదో తెలుసుకోవాల్సి ఉంది. మీ ఆధార్‌కార్డుతో రిజిస్టరై ఉన్న మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారం పరిశీలించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. మీ మొబైల్ నుంచే.. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి యూఐడీఏఐ వెబ్సైట్ జ్టి్ట htt pr//uidai.gov.i n https-//uidai.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో తెలుగు భాషను ఎంచుకున్న తర్వాత స్క్రీన్‌పై ‘ఈ–మెయిల్, మొబైల్ నంబర్‌ను పరిశీలించుట’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఓ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ మాత్రమే అయితే.. ఈ–మెయిల్ / మొబైల్ నంబర్ పేజీలో మీ ఆధార్ సంఖ్యతో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన మొబైల్ నంబర్‌ను మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి కింద కనిపించే గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు పొందుపరిచిన వివరాలు, సరైనవైతే.. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ కోడ్ వస్తుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడిచేతి వైపు కనిపించే ఓటీపీ ఫీల్డ్‌లో ఎంటర్ చేయాలి. అలా చేసిన వెంటనే కంగ్రాట్యులేషన్స్ ది మొబైల్ నంబర్ మ్యాచెస్ విత్ అవర్ రికార్డ్స్ పేరుతో సిస్టంపై మెసేజ్ వస్తుంది. మెయిల్ ఐడీని మాత్రమే వెరిఫై చేసుకోవాలంటే.. వెరిఫై ఈ–మెయిల్ / మొబైల్ నంబర్ పేజీలో మీ ఆధార్ నెంబర్‌తో పాటు ఆధార్ నమోదు సమయంలో మీరిచ్చిన ఈ–మెయిల్ ఐడీని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కోడ్‌ను కూడా ఎంటర్ చేసి కింద కనిపించే గెట్ వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ)పై క్లిక్ చేయాలి. మీరు సబ్మిట్ చేసిన వివరాలు సరైనవైతే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ కోడ్ అందుతుంది. ఆ ఓటీపీని అదే పేజీలో కుడి చేతి వైపు కనిపించే ఎంటర్ ఓటీపీ ఫీల్డ్‌లో నమోదు చేస్తే కంగ్రాట్యులేషన్ ది ఈ–మెయిల్ ఐడీ మ్యాచ్ విత్ ఆవర్ రికార్డ్స్ పేరుతో సిస్టంకు మెసేజ్ వస్తుంది. -
ఆధార్‌తో 7 కోట్ల పాన్ నంబర్లు అనుసంధానం
గత నెలలో కోటికి పైగా అనుసంధానం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 7.36 కోట్ల మంది పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. గత నెలలోనే ఏకంగా ఒక కోటి మంది పైగా అనుసంధానం చేసుకున్నట్లు ఆదాయ పన్ను విభాగం అధికారి వివరించారు. ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొత్తం 30 కోట్ల పైచిలుకు పాన్ హోల్డర్లు ఉండగా, దాదాపు 115 కోట్ల మంది ప్రజానీకానికి ఆధార్ నంబర్లు కేటాయించడం జరిగింది. -
కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌లో తపాలా సేవలు
విశాఖ పోస్టల్ రీజియన్‌లో తొలిసారిగా అమలాపురం నుంచి శ్రీకారం ప్రారంభించిన రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత అమలాపురం టౌన్ (అమలాపురం) : తపాలా సేవలపరంగా 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల తమ శాఖ ఇక నుంచి వాణిజ్య బ్యాంకులతో సమాంతరంగా, దీటుగా సేవలు అందించేందుకు కొత్తగా కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లోకి అడుగు పెట్టిందని విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత అన్నారు. ఈ సరికొత్త సేవలను తమ రీజియన్ పరిధిలోని అమలాపురం పోస్టల్ డివిజన్ నుంచే ప్రథమంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. అమలాపురంలోని డివిజన్ పోస్టల్ కార్యాలయం (హెడ్ పోస్టు ఆఫీసు)లో ఏర్పాటుచేసిన కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ విధానాన్ని ఆమె సోమవారం ఉదయం ప్రారంభించారు. అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ జి.షణ్ముఖేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోర్ సిస్టమ్స్ వల్ల తపాలా సేవలు మరింత వేగంగా... పారదర్శకంగా అందనున్నాయన్నారు. ఈ విధానంతో దేశమంతా తపాలా సేవలు ఆన్లైన్ అనుసంధానంతో ఒకే ప్లాట్ ఫారంపైకి వచ్చినట్లయిందని చెప్పారు. వినియోగదారులు పోస్టల్ సేవలు పొందేందుకు తమ వద్ద ఉండే మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థతో పొందవచ్చని తెలిపారు. వాణిజ్య బ్యాంక్‌లు ఎన్ని రకాలు సేవలు అందిస్తున్నాయో అలాంటి సేవలన్నీ తమ శాఖ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుందన్నారు. తమ రీజయిన్ పరిధిలో 1,500 వాణిజ్య బ్యాంక్‌లు ఉంటే తమ తమ శాఖ కార్యాలయాలు ఆరు వేల ఉన్నాయని గుర్తు చేశారు. పోస్టల్ అంటే ఓ నెట్ వర్కింగ్...ఐటీ ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ వినూత్న, విస్తృత సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైతం ప్రచారం చేసేందుకు తమ సిబ్బంది ఫొటోలు, వీడియోలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా సాధ్యం కాదని...వారు కూడా ప్రజల్లోకి వెళ్లాలి...నోటి మాటలతో అర్థమయ్యే రీతిలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కోర్ సిస్టమ్స్ సేవలను రీజియన్ పరిధిలోని తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో జూలై నెలాఖరుకు విస్తరింప చేస్తామని... వచ్చే సెప్టెంబర్ నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపడతామని శ్రీలత వివరించారు. త్వరలోనే రెండు పాస్ పోర్టు సేవా కేంద్రాలు తమ పోస్టల్ శాఖ కోర్ సిస్టమ్స్ సేవలనే కాకుండా త్వరలోనే పోస్ట్ ఆఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఆ సేవలు అందించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని శ్రీలత వెల్లడించారు. తొలి ప్రయత్నంగా రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలలో ఈ సేవా కేంద్రాలు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ శాఖ, విదేశాంగ శాఖ ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చాని తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే పోస్టు ఆఫీసుల్లోనే పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే వెసులబాటు వస్తుందన్నారు. అమలాపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్సీహెచ్వీ రాజేష్, హెడ్ పోస్టు మాస్టర్ వై.ప్రసాద్, పోస్టల్ ఇన్స్పెక్టర్లు వి.హరిబాబు, బీవీఎల్ విశ్వేశ్వరరావు, ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు. రీజియన్‌లో తొలిసారిగా అమలాపురంలో కోర్ సిస్టమ్స్ ప్రారంభానికి ముందు శ్రీలత కేక్ కట్ చేయటంతో సిబ్బంది వేడుక చేసుకున్నారు. -
సర్వే 'బంధనం'!
కొత్త కార్డుల మంజూరు స్మార్ట్‌పల్స్ సర్వేతో లింకు కీలకంగా మారనున్న ‘అనుసంధానం’ నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే మంజూరు ‘జన్మభూమి– మా ఊరు’లో పంపిణీ ఉండకపోవచ్చు జిల్లాలో 60 వేల మంది ఎదురుచూపు అనంతపురం అర్బన్ : అంతా భయపడినట్లే జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం ప్రజా సాధికార (స్మార్ట్ పల్స్) సర్వేతో లింక్ పెడుతోంది. సర్వే వివరాలను, దరఖాస్తులను అనుసంధానం చేయనుంది. సర్వే నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే రేషన్‌కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సర్వే ఇంకా పూర్తి కానందున జనవరిలో జరిగే ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమంలో కొత్త కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 60 వేల మంది పేదలు ఎదురుచూస్తున్నారు. వీరి దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు. ఆరు అంచెల్లో దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నట్లు గుర్తిస్తేనే కార్డు మంజూరు చేస్తారని సమాచారం. ఈ విధానంలో ఎక్కువ దరఖాస్తులపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. వాస్తవానికి సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారంతో రేషన్ కార్డులకు అర్హత కోల్పోతామని ఇప్పటికే పేదల్లో ఆందోళన ఉంది. సర్వే అనుసంధానం కీలకం ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారం కార్డుల మంజూరులో కీలకంగా మారుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఇదే జరిగితే పలువురికి రేషన్ కార్డులు మంజూరు కావు. రేషన్ కార్డు కావాలంటే ద్విచక్రవాహనం ఉండకూడదు. నెలసరి ఆదాయం రూ.11 వేలకు మించకూడదు. విద్యుత్ చార్జీ నెలసరి రూ.500 లోపు ఉండాలి. సొంత ఇల్లు 144 చదరపు అడుగులు మించి ఉండకూడదు. తాత్కాలిక/ ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు. వీటికి తోడు జన్మభూమి కమిటీ సిఫారసు ఉండాలి. ప్రస్తుతం పలువురు స్వయం ఉపాధి కోసం అప్పు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు, కార్లు వంటివి తెచ్చుకుని బాడుగలకు తిప్పుతున్నారు. వాహనాలు ఉన్నాయనే కారణంతో వీరు కార్డు పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. జన్మభూమిలో ఉండకపోవచ్చు ప్రజాసాధికార సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత వివరాలను అనుసంధానం చేస్తారు. అటు తరువాత దరఖాస్తుదారుల వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాల్సి ఉంటుంది. సర్వేనే పూర్తి కానందున జనవరిలో జరగనున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో రేషన్ కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఓటర్ల పేర్లు తొలగించడం లేదు
-
రైతులకు ఏం కావాలన్నా ఆధార్ తప్పనిసరి: సీఎం
సాక్షి, రాజమండ్రి: రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుకోవాలన్నా ఆధార్, ఈ-పాస్‌లతో వారి వివరాలను అనుసంధానించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన వ్యవసాయరంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు ఏవి కావాలన్నా ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనన్నారు. ఈ మేరకు వచ్చే నెల ఒకటి నుంచి రైతులు, లబ్ధిదారుల సమాచారాన్ని అధికారులు సేకరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎరువుల దుకాణాలను ఈ- పాస్, ఆధార్‌తో అనుసంధానించాలని సూచించారు. దీనిద్వారా ఏ రైతు ఎంత యూరియా వాడుతున్నారు, ఏఏ నేలలకు ఎంత యూరియా వాడవచ్చో తెలుస్తుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వరినాట్ల విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపునకు నిర్ణయం: మంత్రి ప్రత్తిపాటి రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక ఆనం కళాకేంద్రంలోని పుష్కర మీడియా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారంనాటి సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పాదకాల పెంపుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు మాట్లాడారు. -
ఛీఛీ.. పోపో..!
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం సృష్టించాల్సిందే. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడటం వల్లే ఈ పరిస్థితి. 50 రోజులుగా సీమాంధ్రలో అందరూ రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే నాలుగు నెలల పదవి కోసం ప్రజాప్రతినిధులు పాకులాడటంపై శుక్రవారం విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో వక్తలు నిప్పులు కురిపించారు. సభ జరిగిన మరుసటి రోజే.. సమైక్యవాదినని చెప్పుకొంటూ రాజకీయాలను వదలకుండా పదవులను పట్టుకుని వేలాడుతుంటే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు నగర ప్రజలు మరోసారి రుచి చూపించారు. 2009లో తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించగానే ఎంపీ రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి వచ్చి విజయవాడలో నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం ప్రకటన చేసేవరకు ఉద్యమించారు. ఈ ఏడాది మళ్లీ తెలంగాణ ప్రకటన వచ్చింది. ఈసారి లగడపాటి రాజీనామా ప్రకటన చేసినా ఉద్యమించలేదు. తర్వాత పార్లమెంట్‌కు వెళ్లడం, ఇక్కడ ఉద్యమానికి నేతృత్వం వహించకపోవడం అందరిలో అనుమానాలకు దారితీసింది. మరోవైపు ల్యాంకో కోసం రాయితీలు, బొగ్గు గనులు వంటి ప్యాకేజీలు తీసుకున్నారని, అందుకే రాజగోపాల్ నాటకం ఆడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సమైక్యవాది అయిన రాజగోపాల్‌ను కూడా వదలడం లేదు. రాష్ట్రం విడిపోతే నష్టపోతామని అందరూ మొరపెట్టుకుంటున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు ఉండకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారు. తాము వ్యూహం ప్రకారం తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నామని రాజగోపాల్ చెబుతున్న మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. మూడుసార్లు భంగపాటు.. ఉద్యమం మొదలైన తర్వాత మూడుసార్లు లగడపాటి రాజగోపాల్‌కు సమైక్యవాదుల నుంచి భంగపాటు ఎదురైంది. గతంలో జేసీ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికులు ఎంపీని అడ్డుకుంటే, నాగార్జునా యూనివర్సిటీ విద్యార్థులు రాజీనామా చేయకుండా తమ వద్దకు రావద్దని అడ్డుకున్నారు. తాజాగా శనివారం ఆటోనగర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (ఏటీఏ) ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో గత 39 రోజులుగా జరుగుతున్న రిలేనిరాహార దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన ఎంపీ లగడపాటికి అంతకుమించిన అవమానమే ఎదురైంది. రాజీనామా ఆమోదించుకోకుండా ఎందుకు వచ్చారంటూ అందరూ మూకుమ్మడిగా నిలదీశారు. మీ వద్ద బ్రహ్మాస్త్రం ఉందని చెబుతున్నారు కదా అదేమైందంటూ విరుచుకుపడ్డారు. అసలు లగడపాటి మాట్లాడటానికే వీలులేదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో లగడపాటి కూడా తన వాదన వినిపించాకే వెళ్తానని మొండికేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో లగడపాటి అనుచరులు, పోలీసులు సమైక్యవాదులపై దాడి, లాఠీచార్జికి దిగడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒకదశలో ఎంపీపై దాడికి కూడా వారు సిద్ధపడ్డారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు, రాళ్లు అన్నీ గాలిలోకి లేచాయి. దీంతో పోలీసుల రక్షణ మధ్య ఎంపీని సురక్షితంగా అక్కడినుంచి పంపించారు. రాజకీయం చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు ఈ ఘటనను ఎవరికివారు రాజకీయం చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారుతోంది. తమ స్వప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే విధంగా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. ఎంపీ రాజగోపాల్‌కు అధిష్టానం బొగ్గు గనులు, ల్యాంకోకు రాయితీలు ప్రకటించినందుకే ఎంపీ ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులే తమ కార్యకర్తలతో, రౌడీలతో దాడికి దిగారని ఆరోపణలకు దిగారు. వీరి వ్యవహారంపై సమైక్యాంధ్ర జేఏసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
సమైక్యమే సమ్మతం
సాక్షి, ఒంగోలు : ‘అందరి ఆకాంక్ష, అభిమతం ఒక్కటే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే.. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ఉద్యమం మహోద్యమమై కోట్లాది మందిని భాగస్వాముల్ని చేసుకొని ముందుకు సాగుతోంది. ఇకనైనా విభజన నిర్ణయాన్ని మానుకోవాలి. లేదంటే జనాగ్రహంలో మాడిపోతారు’ అంటూ సమైక్యవాదులు నినదించారు. సాక్షి చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చావేదిక ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో శనివారం జరిగింది. వివిధ రంగాల వ్యక్తులు, ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు చర్చావేదికలో పాల్గొని రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించారు. ఒకే కుటుంబంలా ఉన్న రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేస్తే.. నేడు అనైతికంగా ముక్కలు చేసి సీమాంధ్రను సర్వనాశనం చేయాలని చూడటంపై మేధావులు మండిపడ్డారు. ఇక యువత అయితే రాజకీయ నేతలపై ప్రశ్నల పరంపర సంధించారు. ‘సీమాంధ్ర నేతలారా ఖబడ్దార్..చరిత్ర హీనులుగా మారకండి. ఇక్కడ అధిష్టానం అంటే ప్రజలే..మా ఆగ్రహానికి గురైతే మీకు రాజకీయ సన్యాసం తప్పదు’ అని హెచ్చరించారు. అందరినీ ఆలోచింపజేసేలా యువత అనర్గళంగా ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిమతాన్ని గౌరవించని ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని విద్యార్థులు జోస్యం చెప్పారు. నాలుగు గంటల పాటు గదిలో కూర్చొని అన్నీ ఆలోచించామంటూ తెలంగాణ ప్రకటన చేసే హక్కు అసలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎక్కడుందని ప్రశ్నించారు. ‘నూతన రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్లు సరిపోతాయని రాజకీయ నేత ఒకరు చెబుతున్నారు. ఆ నిధులెక్కడివి..ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినవే కదా..అలా కాకుండా రాజకీయ నేతల ఆస్తులతో నూతన రాజధాని నిర్మిస్తారా..’ అని ఇంజినీరింగ్ విద్యార్థిని ఎం.భార్గవి ప్రశ్నించారు. నూతన రాజధాని నిర్మాణానికి కేసీఆర్ ఎంతిస్తాడో ప్రకటించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలో మాట్లాడిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై..సోనియా గాంధీ స్వార్థపూరిత చర్యలపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ కోసం రాష్ట్ర విభ జన చేసింది తప్ప..తెలంగాణ ప్రజల కోసం కాదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన హైదరాబాద్‌తో అన్నీ ముడిపడి ఉన్నాయని చెప్పారు. సీమాంధ్రలో గ్యాస్ నిక్షేపాలుంటే..వాటి కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, పేరొందిన విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రుల భవిష్యత్తు ఏమవుతుందని కొందరు ప్రశ్నించారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు నాడు క్విట్ ఇండియా ఉద్యమం చేశారని..ప్రస్తుతం పాలకుల విధానాలను తిప్పికొట్టేందుకు మరో క్విట్ ఇండియా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్‌లోని తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి మాత్రమే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటున్నారని నీటి పారుదల శాఖ ఉద్యోగి మండిపడ్డారు. ఉద్యమానికి దూరంగా ఉంటున్న కొన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని లేదంటే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.