సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం సృష్టించాల్సిందే. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడటం వల్లే ఈ పరిస్థితి. 50 రోజులుగా సీమాంధ్రలో అందరూ రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే నాలుగు నెలల పదవి కోసం ప్రజాప్రతినిధులు పాకులాడటంపై శుక్రవారం విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో వక్తలు నిప్పులు కురిపించారు.
సభ జరిగిన మరుసటి రోజే..
సమైక్యవాదినని చెప్పుకొంటూ రాజకీయాలను వదలకుండా పదవులను పట్టుకుని వేలాడుతుంటే ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు నగర ప్రజలు మరోసారి రుచి చూపించారు. 2009లో తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించగానే ఎంపీ రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి వచ్చి విజయవాడలో నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం ప్రకటన చేసేవరకు ఉద్యమించారు. ఈ ఏడాది మళ్లీ తెలంగాణ ప్రకటన వచ్చింది. ఈసారి లగడపాటి రాజీనామా ప్రకటన చేసినా ఉద్యమించలేదు.
తర్వాత పార్లమెంట్‌కు వెళ్లడం, ఇక్కడ ఉద్యమానికి నేతృత్వం వహించకపోవడం అందరిలో అనుమానాలకు దారితీసింది. మరోవైపు ల్యాంకో కోసం రాయితీలు, బొగ్గు గనులు వంటి ప్యాకేజీలు తీసుకున్నారని, అందుకే రాజగోపాల్ నాటకం ఆడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సమైక్యవాది అయిన రాజగోపాల్‌ను కూడా వదలడం లేదు. రాష్ట్రం విడిపోతే నష్టపోతామని అందరూ మొరపెట్టుకుంటున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు ఉండకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారు. తాము వ్యూహం ప్రకారం తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నామని రాజగోపాల్ చెబుతున్న మాటలను ఎవరూ విశ్వసించడం లేదు.
మూడుసార్లు భంగపాటు..
ఉద్యమం మొదలైన తర్వాత మూడుసార్లు లగడపాటి రాజగోపాల్‌కు సమైక్యవాదుల నుంచి భంగపాటు ఎదురైంది. గతంలో జేసీ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికులు ఎంపీని అడ్డుకుంటే, నాగార్జునా యూనివర్సిటీ విద్యార్థులు రాజీనామా చేయకుండా తమ వద్దకు రావద్దని అడ్డుకున్నారు. తాజాగా శనివారం ఆటోనగర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (ఏటీఏ) ఆధ్వర్యంలో ఆటోనగర్‌లో గత 39 రోజులుగా జరుగుతున్న రిలేనిరాహార దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన ఎంపీ లగడపాటికి అంతకుమించిన అవమానమే ఎదురైంది. రాజీనామా ఆమోదించుకోకుండా ఎందుకు వచ్చారంటూ అందరూ మూకుమ్మడిగా నిలదీశారు.
మీ వద్ద బ్రహ్మాస్త్రం ఉందని చెబుతున్నారు కదా అదేమైందంటూ విరుచుకుపడ్డారు. అసలు లగడపాటి మాట్లాడటానికే వీలులేదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో లగడపాటి కూడా తన వాదన వినిపించాకే వెళ్తానని మొండికేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో లగడపాటి అనుచరులు, పోలీసులు సమైక్యవాదులపై దాడి, లాఠీచార్జికి దిగడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒకదశలో ఎంపీపై దాడికి కూడా వారు సిద్ధపడ్డారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు, రాళ్లు అన్నీ గాలిలోకి లేచాయి. దీంతో పోలీసుల రక్షణ మధ్య ఎంపీని సురక్షితంగా అక్కడినుంచి పంపించారు.
రాజకీయం చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు
ఈ ఘటనను ఎవరికివారు రాజకీయం చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారుతోంది. తమ స్వప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే విధంగా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగారు. ఎంపీ రాజగోపాల్‌కు అధిష్టానం బొగ్గు గనులు, ల్యాంకోకు రాయితీలు ప్రకటించినందుకే ఎంపీ ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులే తమ కార్యకర్తలతో, రౌడీలతో దాడికి దిగారని ఆరోపణలకు దిగారు. వీరి వ్యవహారంపై సమైక్యాంధ్ర జేఏసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఛీఛీ.. పోపో..!
Published Sun, Sep 22 2013 1:21 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
Advertisement
Advertisement