సాక్షి, ఒంగోలు : ‘అందరి ఆకాంక్ష, అభిమతం ఒక్కటే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే.. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ఉద్యమం మహోద్యమమై కోట్లాది మందిని భాగస్వాముల్ని చేసుకొని ముందుకు సాగుతోంది. ఇకనైనా విభజన నిర్ణయాన్ని మానుకోవాలి. లేదంటే జనాగ్రహంలో మాడిపోతారు’ అంటూ సమైక్యవాదులు నినదించారు. సాక్షి చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చావేదిక ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో శనివారం జరిగింది. వివిధ రంగాల వ్యక్తులు, ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ కళాశాలల విద్యార్థులు చర్చావేదికలో పాల్గొని రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించారు. ఒకే కుటుంబంలా ఉన్న రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేస్తే.. నేడు అనైతికంగా ముక్కలు చేసి సీమాంధ్రను సర్వనాశనం చేయాలని చూడటంపై మేధావులు మండిపడ్డారు. ఇక యువత అయితే రాజకీయ నేతలపై ప్రశ్నల పరంపర సంధించారు. ‘సీమాంధ్ర నేతలారా ఖబడ్దార్..చరిత్ర హీనులుగా మారకండి. ఇక్కడ అధిష్టానం అంటే ప్రజలే..మా ఆగ్రహానికి గురైతే మీకు రాజకీయ సన్యాసం తప్పదు’ అని హెచ్చరించారు. అందరినీ ఆలోచింపజేసేలా యువత అనర్గళంగా ప్రసంగించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిమతాన్ని గౌరవించని ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని విద్యార్థులు జోస్యం చెప్పారు. నాలుగు గంటల పాటు గదిలో కూర్చొని అన్నీ ఆలోచించామంటూ తెలంగాణ ప్రకటన చేసే హక్కు అసలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎక్కడుందని ప్రశ్నించారు. ‘నూతన రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్లు సరిపోతాయని రాజకీయ నేత ఒకరు చెబుతున్నారు.
ఆ నిధులెక్కడివి..ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినవే కదా..అలా కాకుండా రాజకీయ నేతల ఆస్తులతో నూతన రాజధాని నిర్మిస్తారా..’ అని ఇంజినీరింగ్ విద్యార్థిని ఎం.భార్గవి ప్రశ్నించారు. నూతన రాజధాని నిర్మాణానికి కేసీఆర్ ఎంతిస్తాడో ప్రకటించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలో మాట్లాడిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై..సోనియా గాంధీ స్వార్థపూరిత చర్యలపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ కోసం రాష్ట్ర విభ జన చేసింది తప్ప..తెలంగాణ ప్రజల కోసం కాదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన హైదరాబాద్‌తో అన్నీ ముడిపడి ఉన్నాయని చెప్పారు.
సీమాంధ్రలో గ్యాస్ నిక్షేపాలుంటే..వాటి కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని, పేరొందిన విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రుల భవిష్యత్తు ఏమవుతుందని కొందరు ప్రశ్నించారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు నాడు క్విట్ ఇండియా ఉద్యమం చేశారని..ప్రస్తుతం పాలకుల విధానాలను తిప్పికొట్టేందుకు మరో క్విట్ ఇండియా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్‌లోని తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి మాత్రమే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటున్నారని నీటి పారుదల శాఖ ఉద్యోగి మండిపడ్డారు. ఉద్యమానికి దూరంగా ఉంటున్న కొన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని లేదంటే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
సమైక్యమే సమ్మతం
Published Sun, Aug 25 2013 3:53 AM | Last Updated on Mon, Aug 20 2018 8:10 PM
Advertisement
Advertisement