
కంప్యూటర్‌లో వివరాలు పరిశీలిస్తున్న సబ్‌జైళ్ల అధికారి ఈరన్న
నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలో జైళ్లను కోర్టులతో అనుసంధానం చేస్తున్నామని, ఇక నుంచి ఖైదీల హాజరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జీలే తీసుకుంటారని జిల్లా సబ్‌జైళ్ల అధికారి బి.ఈరన్న అన్నారు. ఈమేరకు అన్ని జైళ్లల్లో టీవీలు, ఆన్‌లైన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కోర్టుల్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరసన్నపేట సబ్‌జైల్‌ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతానికి పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట సబ్‌జైళ్లలో ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీలను జడ్జి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఎస్కార్టుల సాయంతో ఖైదీలను కోర్టుకు తీసుకువెళ్తున్నామని, ఇక మీదట ఎస్కార్టు అవసరం ఉండదన్నారు.
టెక్కలిలో నూతనంగా సబ్‌జైల్ నిర్మాణానికి రూ. 8 కోట్లుతో ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. సబ్‌జైల్ ఆవరణలో పెట్రోల్ బంకు కూడా నిర్వహిస్తామన్నారు. ఈమేరకు 2.10 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ కేటాయించిందన్నారు. సోంపేటలో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న సబ్‌జైల్ భవన సాముదాయ స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగించామని, ఇందుకు గాను వేరోచేట స్థలం కేటాయించనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. పాలకొండ జైల్‌లో కిచెన్ అభివృద్ధికి, నరసన్నపేటలో డబుల్ గేట్ నిర్మాణం, కిచెన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. జైళ్ల సిబ్బంది హాజరును బయోమెట్రిక్ ద్వారానే తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట నరసన్నపేట సబ్‌జైల్ సూపరింటెండెంట్ రామకృష్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment