సర్వే 'బంధనం'!
- కొత్త కార్డుల మంజూరు స్మార్ట్‌పల్స్ సర్వేతో లింకు
- కీలకంగా మారనున్న ‘అనుసంధానం’
- నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే మంజూరు
- ‘జన్మభూమి– మా ఊరు’లో పంపిణీ ఉండకపోవచ్చు
- జిల్లాలో 60 వేల మంది ఎదురుచూపు
అనంతపురం అర్బన్ :
అంతా భయపడినట్లే జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం ప్రజా సాధికార (స్మార్ట్ పల్స్) సర్వేతో లింక్ పెడుతోంది. సర్వే వివరాలను, దరఖాస్తులను అనుసంధానం చేయనుంది. సర్వే నిబంధనల మేరకు అర్హతలు ఉంటేనే రేషన్‌కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సర్వే ఇంకా పూర్తి కానందున జనవరిలో జరిగే ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమంలో కొత్త కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 60 వేల మంది పేదలు ఎదురుచూస్తున్నారు. వీరి దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నారు. ఆరు అంచెల్లో దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నట్లు గుర్తిస్తేనే కార్డు మంజూరు చేస్తారని సమాచారం. ఈ విధానంలో ఎక్కువ దరఖాస్తులపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. వాస్తవానికి సర్వే ద్వారా సేకరిస్తున్న సమాచారంతో రేషన్ కార్డులకు అర్హత కోల్పోతామని ఇప్పటికే పేదల్లో ఆందోళన ఉంది.
సర్వే అనుసంధానం కీలకం
ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారం కార్డుల మంజూరులో కీలకంగా మారుతుందని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఇదే జరిగితే పలువురికి రేషన్ కార్డులు మంజూరు కావు. రేషన్ కార్డు కావాలంటే ద్విచక్రవాహనం ఉండకూడదు. నెలసరి ఆదాయం రూ.11 వేలకు మించకూడదు. విద్యుత్ చార్జీ నెలసరి రూ.500 లోపు ఉండాలి. సొంత ఇల్లు 144 చదరపు అడుగులు మించి ఉండకూడదు. తాత్కాలిక/ ప్రైవేటు ఉద్యోగిగా ఉండకూడదు. వీటికి తోడు జన్మభూమి కమిటీ సిఫారసు ఉండాలి. ప్రస్తుతం పలువురు స్వయం ఉపాధి కోసం అప్పు చేసి ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు, కార్లు వంటివి తెచ్చుకుని బాడుగలకు తిప్పుతున్నారు. వాహనాలు ఉన్నాయనే కారణంతో వీరు కార్డు పొందే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది.
జన్మభూమిలో ఉండకపోవచ్చు
ప్రజాసాధికార సర్వే ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత వివరాలను అనుసంధానం చేస్తారు. అటు తరువాత దరఖాస్తుదారుల వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించాల్సి ఉంటుంది. సర్వేనే పూర్తి కానందున జనవరిలో జరగనున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో రేషన్ కార్డుల పంపిణీ ఉండకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.