రైతులకు ఏం కావాలన్నా ఆధార్ తప్పనిసరి: సీఎం
సాక్షి, రాజమండ్రి: రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుకోవాలన్నా ఆధార్, ఈ-పాస్‌లతో వారి వివరాలను అనుసంధానించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన వ్యవసాయరంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు ఏవి కావాలన్నా ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనన్నారు. ఈ మేరకు వచ్చే నెల ఒకటి నుంచి రైతులు, లబ్ధిదారుల సమాచారాన్ని అధికారులు సేకరించాలని ఆదేశించారు.
అదేవిధంగా ఎరువుల దుకాణాలను ఈ- పాస్, ఆధార్‌తో అనుసంధానించాలని సూచించారు. దీనిద్వారా ఏ రైతు ఎంత యూరియా వాడుతున్నారు, ఏఏ నేలలకు ఎంత యూరియా వాడవచ్చో తెలుస్తుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వరినాట్ల విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు.
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపునకు నిర్ణయం: మంత్రి ప్రత్తిపాటి
రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక ఆనం కళాకేంద్రంలోని పుష్కర మీడియా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారంనాటి సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పాదకాల పెంపుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు మాట్లాడారు.