న్యూఢిల్లీ: త్వరలోనే ఆధార్ కార్డు ఆధారంగా ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేస్తామని కేంద్రం తెలిపింది. శుక్రవారం లోక్‌సభ ఆధార్‌కు చట్టబద్ధతను కల్పించే బిల్లును ఆమోదించడం తెలిసిందే. వంటగ్యాస్ సబ్సిడీ పొందేందుకు, ఇతర ప్రభుత్వ సంక్షేమకార్యక్రమాలకు మాత్రమే ఆధార్ ఉపయోగపడేదని..ఇప్పుడు తాజాగా రైతులు ఎరువుల రాయితీని పొందేందుకు కూడా దాన్ని అనుసంధానిస్తామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికిపై పూర్తి వివరాలు చెబుతామన్నారు. మరోపక్క.. ‘సెబీ’ బోర్డు భేటీలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ‘ఆధార్ చట్టం వస్తే సబ్సిడీలు లబ్దిదారులకే రాయితీలు చేరతాయి’ అని అన్నారు.