సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించే రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. పంటకు గిట్టుబాటు ధరలేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, నాసిరకం ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో ఏటేటా నష్టాలే మూటగట్టుకుంటున్నాడు. అప్పులు తీర్చడానికి ఉరితాడే శరణ్యమని భావిస్తున్నాడు. దేశంలో ఏటా దాదాపు 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏటేటా ఈ సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క 2015 సంవత్సరంలో రైతుల ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రైతులకు భరోసా కల్పిస్తారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. రైతుల్ని ఆదుకోకపోతే దేశానికే అరిష్టమని ప్రధానే చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి లబ్ధి చేకూరకుంటే ఆర్థికాభివృద్ధి న్యాయసమ్మతంగా, సముచితంగా ఉన్నట్టు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో రైతులకు ఉపశమనం లభించవచ్చని వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రైతులు ఆశిస్తున్నదేమిటంటే...
- ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న వంటి వాటికి ఈ ఏడాది ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధిని తక్షణమే ఏర్పాటు చేయాలి. కనీస మద్దతు ధరలు ఇవ్వలేని పరిస్థితిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే వీలు కల్పించాలి. ఆమేరకు బడ్జెట్‌లో ప్రస్తావనలు చేయాలి.
- ధరల నిర్ణాయక కమిటీలో రైతులు కాని వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ కమిటీలో రైతుల ప్రాతినిధ్యాన్ని పెంచాలి.
- రాష్ట్రానికీ రాష్ట్రానికీ సాగువ్యయంలో తేడా ఉంటుంది. అందువల్ల దేశం మొత్తానికి ఒకే కనీస మద్దతు అంటే రైతులకు ఇబ్బందే. కాబట్టి మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి. రబీ, ఖరీఫ్ సీజన్లలో వాటిని సమీక్షించే వీలుండాలి. గిట్టుబాటు కానీ పంటకు రాష్ట్ర ప్రభుత్వాలు బోనస్ ప్రకటించే విధానాన్ని అనివార్యం చేయాలి.
- ఏ పంటకు ఎంత ధర ఉంటుందో ముందే ప్రకటించడంతో పాటు ఏయే పంటను ఎంతెంత సాగు చేయవచ్చో ముందే నిర్ణయించాలి. అలా చేయడం వల్ల ఒక సీజన్‌లో టమాటాలను రూ. 60కు, మరో సీజన్‌లో రూ.3కు కొనుక్కోవాల్సిన దుస్థితి ఉండదు.
- నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలి. ఇలాంటి వ్యాపారులకు కఠిన శిక్షలు వేసే వీలుండాలి.
- జాతీయ స్థాయి సాగునీటి ప్రాజెక్టులకే కాకుండా రాష్ట్రాలలోని ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి. కేంద్రం నేరుగా సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే ప్రత్యామ్నాయ వనరులను సూచించాలి.
- ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిధిలోకి వేరుశనగ, పత్తి సహా అన్ని రకాల పంటల్ని తీసుకురావాలి. ప్రస్తుతం రైతులు చెల్లించే ప్రీమియం కన్నా తక్కువగా రైతులకు ఆయా కంపెనీలు ఇస్తున్నాయి. ఈ వ్యవస్థను సంస్కరించాలి.
- మార్కెటింగ్ వ్యవస్థను సరళతరం చేయాలి. డాక్యుమెంట్ల భారాన్ని తగ్గించడంతో పాటు చెల్లింపులను వెంటనే చేయాలి.
- ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే పేరిట తీసుకుంటున్న కొన్ని చర్యలు రైతులకు భారంగా పరిణమించకుండా చూడాలి.
- రైతుల ఉత్పత్తుల రవాణా ఖర్చులను (మార్కెట్లకు తరలించే సమయంలో) ప్రభుత్వమే భరించాలి.
- పాడి పరిశ్రమకు మరింత చేయూత ఇవ్వాలి.
- ప్పుధాన్యాలు, నూనెగింజల దిగుమతిని నివారించాలి.
- పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైతులు తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి పరిష్కారం చూపేందుకు బడ్జెట్‌లో అవసరమైన కేటాయింపులు చేయాలి.
- వ్యవసాయ పరిశోధనలకు కేటాయింపులు పెంచాలి.
- కౌలు రైతులకు బ్యాంకర్లు కచ్చితంగా రుణం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి.
- రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి 55 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి.
- ఏయే పంటలకు ఎంతెంత రుణం (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అనే దానిని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాలి.
- ఈ విషయాలన్నింటిపై కేంద్రం చర్యలు చేపట్టినప్పుడే ప్రధాని మోదీ అనుకున్నట్టు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని, రైతు ఆత్మహత్యలకూ పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment