అడగండి చెబుతా.. ఈసీ సమాధానాలు
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
మాది గుంటూరు. నేను పూణెలో పనిచేస్తున్నాను. నాకు గుంటూరులో ఓటు ఉంది. ఆన్‌లైన్ ద్వారా నా ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉందాం?
- ఖాసిం, పూణె
మీరు పూణెలో పని చేస్తూ గుంటూరులో ఓటు కలిగిఉండటం నిబంధనలకు విరుద్ధం. మీ ఓటు గుంటూరులో రద్దవుతుంది. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆన్‌లైన్ ఓటింగ్ పద్దతి ప్రస్తుతం మనకు లేదు.
ప్రభుత్వోద్యోగులోలని వికలాంగులు, గర్భిణులు, చిన్న పిల్లల తల్లులకు ఎన్నికల డ్యూటీ వేస్తే వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి మినహాయింపు ఇవ్వచ్చుకదా?
- కె.రాకేష్ కుమార్, వరంగల్
వికలాంగులు, గర్భిణులు, పసిపిల్లల తల్లులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంది. వారికి ఎన్నికల డ్యూటీ వేయడం లేదు.
మా తల్లిదండ్రులకు ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నా జాబితాలో వారి పేర్లు లేవు. ఇలాగే చాలామంది పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. వారు ఓటు వేయాలంటే ఏం చేయాలి?
- త్యాగి అరుట్ల, ఎల్లెందు
ఇప్పుడు ఏమీ చేయలేం. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల సమయం అయిపోయింది. ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకుని లేకపోతే దరఖాస్తు చేసుకొమ్మని మేం చాలా సార్లు చెప్పాం. మీరు గడువులోపు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల ఈ సారికి ఓటు వేయలేరు.
నివాసం ఉండే చోటే ఓటు హక్కు ఉంటుందంటున్నారు కదా? అలాంటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్, ఢిల్లీల్లో నివాసం ఉంటూ వారి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కల్గి ఉన్నారు. మాకో న్యాయం? వారికో న్యాయమా..?
- భానుచందర్ రెడ్డి, భువనగిరి
ప్రజాప్రతినిధులుగా వారి బాధ్యతలు నెరవేర్చేందుకు వారు రాజ దాని నగరాల్లో ఉంటున్నారు. వీరికి ఓటు మాత్రం సొంత నియోజకవర్గంలో ఉంచుకునే వెసులు బాటు ‘ప్రజాప్రానిథ్య చట్టం’ కల్పిస్తోంది. రాష్ట్రపతి, స్పీకర్ లాంటి ‘డిజిగ్నేటెడ్’ పోస్టుల్లో ఉన్నవారికి కూడా చట్టంలో ఈ వెసులుబాటు ఉంది.
నేను జైళ్ల శాఖలో ఉద్యోగిని. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు ఉంది. అయితే నేను వేరే చోట పనిచేస్తున్నాను. అత్యవసర సేవలందించే ‘యూనిఫాం’ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్గించవచ్చు కదా?
- రమేష్, రాజమండ్రి
మీరు ఉద్యోగం చేసే ఊరిలోనే మీరు ఓటరుగా నమోదు చేసుకొని ఉండాల్సింది. యూనిఫాం డ్యూటీలు చేసే వారైనా ‘షిప్ట్’ పద్దతిలో పనివేళలను సవరించుకుని ఓటు వేయాలి. మిగతా ఉద్యోగులకు ఎన్నికల సంఘం పోలింగ్‌రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది.
ఓటర్ జాబితాలో పేరు ఉంది కానీ, నాకు ఇంతవరకూ ఓటర్ గుర్తింపు కార్డు రాలేదు. నేను ఓటు వేయడం ఎలా?
- జి.ముకుందలక్ష్మి, పద్మారావునగర్, హైదరాబాద్
పోలింగ్‌కు ముందే మేం మీకు ఓటర్ స్లిప్ ఇస్తాం. దాంతో మీరు ఓటు వేయవచ్చు. ఒక వేళ స్లిప్ అందకపోతే ఇతరత్రా గుర్తింపు కార్డులు(ఆధార్,రేషన్) చూపి మీరు ఓటు వేయవచ్చు.
నా ఓటర్ గుర్తింపు కార్డులో ‘పురుషుడు’ బదులు ‘స్త్రీ’ అని తప్పుగా వచ్చింది. ఈ తప్పును సరిచేసుకోవడం ఎలా? ఓటు వేయడానికి ఇబ్బంది అవుతుందా?
- దండు ఓబయ్య, బద్వేల్, కడప జిల్లా
ఆధార్, రేషన్ కార్డు లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపి ఓటు వేయవచ్చు. ఓటర్ కార్డులో తప్పుల సవరణకు ఇప్పుడు సమయం మించిపోయింది. ఎన్నికలు అయ్యాక దరఖాస్తు చేసుకుని ఓటర్ గుర్తింపు కార్డులో సవరణ చేయించుకోవచ్చు.
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి
- ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్,
లేదా election@sakshi.com కు మెయిల్ చెయ్యండి.