
మరో లింకు!
ఈసారి ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం
⇒ బోగస్ ఓటర్లకు చెక్ పెట్టడమే లక్ష్యం
⇒ ప్రయోగాత్మకంగా అమలుకు జిల్లా ఎంపిక
⇒ తొలుత ఎనిమిది నియోజకవర్గాల్లో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బోగస్ ఓటర్లకు ఇక కళ్లెం పడనుంది. ఒకే వ్యక్తికి పలుచోట్ల ఉన్న ఓట్లను ఏరివేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త చిట్కాను కనుగొంది. అన్నింటా ఆధార్‌ను ఉపయోగిస్తున్నట్టే.. ఇకపై ఓటరు గుర్తింపు కార్డుకూ ఆధార్‌ను అనుసంధానం చేయనుంది. అంతేకాకుండా ఆధార్ నంబర్‌ను ఓటర్ల జాబితాలోనూ పొందుపరచనుంది. ఈ ప్రక్రియతో ఒక వ్యక్తి కేవలం ఒక ఓటరు కార్డు మాత్ర మే పొందే వీలుంటుంది. అంతేకాకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఓటర్ల సంఖ్యపైనా స్పష్టత రానుంది.
ఎనిమిది నియోజకవర్గాల్లో..
ఓటరు గుర్తింపు కార్డు వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానం(సీడింగ్) చేసేం దుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రి య పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశలవారీగా మిగతా నియోజకవర్గాలకు దీన్ని విస్తరించాలని భావిస్తోం ది. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
ఎనిమిది నియోజకవర్గాల్లో ఎపిక్, ఆధార్ కార్డుల సీడింగ్‌ను మొదలుపెట్టాలని ఈసీ సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఈఆర్వో)ను ఆదేశించింది. ఇందులో మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరి లింగంపల్లి నియోజకవర్గాలున్నాయి. ఈ సెగ్మెంట్ల ఈఆర్వోలకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించిన సీడింగ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసింది.
డూప్లికేషన్‌కు చెల్లు..
తాజాగా చేపట్టిన ఈ ప్రక్రియతో ఒకరికి ఒక్కచోట మాత్రమే ఓటేసే వీలుం టుంది. సీడింగ్ ప్రక్రియలో ఓటరు ఆధార్ సంఖ్యను ఎన్నికల గుర్తింపు కార్డు(ఎపిక్)తో అనుసంధానం చేస్తారు. దీంతో గతంలో మాదిరిగా రెండుమూడు చోట్ల ఓటరుగా నమోదు చేయించుకుం టే.. వాటిలో ఒకటి మినహా మిగతా ఓట్ల న్నీ సాఫ్ట్‌వేర్ తొలగిస్తుంది. దీంతో ఇప్పటివరకున్న డూప్లికేట్ ఓట్లన్నీ తొలగిపోనున్నాయి.
జిల్లాలో సీడింగ్ ప్రక్రియ చేపట్టే ఎనిమిది నియోజకవార్గాలన్నీ అర్బన్ ప్రాంతాలే. పట్టణ ప్రాంతాల్లో వలసల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటరు నమోదులో పలువురు రెండేసి చోట్ల ఓట్లు నమోదు చేసుకునే వీలుంది. తాజాగా సీడింగ్ ప్రక్రియతో అలాంటి డూప్లికేట్ ఓట్లన్నీ డిలీట్ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.