15 లక్షల బోగస్ ఓటర్లు
నగరంలో నిర్దేశిత జనాభాకన్నా మించిన ఓటర్లు
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఈవో భన్వర్‌లాల్ భేటీ
ఆధార్ సీడింగ్, బోగస్ ఏరివేతకు సహకరిస్తామన్న సీఎం
ఓటు హక్కును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచన
20 రోజుల్లోగా వందశాతం సీడింగ్ పూర్తిచేస్తామని వెల్లడి
హైదరాబాద్ కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66 శాతం ఓటర్లు ఉండాల్సి ఉంటే, హైదరాబాద్‌లో ఓటర్ల శాతం అంతకు మించిపోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 15 లక్షల మంది బోగస్ ఓటర్లున్నట్లు అంచనా వేశామన్నారు. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయటం తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేస్తామని, బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఈసీ తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముందుగా హైదరాబాద్ నగరంలో, ఆ తర్వాత రాష్ట్రమంతటా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 15-20 రోజుల్లోనే వంద శాతం ఆధార్ సీడింగ్ చేస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున, మొదట ఇక్కడే సీడింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కోరారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితాలు రూపొందాలన్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉండేలా చూడాలని సీఎం చెప్పారు.
నగరంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. లేకుంటే వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటే.. అందులో 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయని, బోగస్ ఓటర్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆధార్ సీడింగ్‌కు సహకరించాలని అభ్యర్థించారు. ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి ఒకటీ, రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అప్పటికీ స్పందించకపోతే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారి పాల్గొన్నారు.