ఈసీకి బీజేపీ, టీడీపీ ప్రతినిధుల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించి జనవరి-2015లో ప్రచురించిన ఓటర్ల జాబితానే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వినియోగించాలని బీజేపీ, టీడీపీ ప్రతినిధి బృందం కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నదీం జైదీకి విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించింది. అనంతరం బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడారు. ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా టీఆర్‌ఎస్ చేస్తున్న అవకతవకలను కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించాం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసం తయారు చేసిన జాబితానే స్థానిక సంస్థల ఎన్నికలకు వినియోగించాలి. కానీ ‘గ్రేటర్’లో 6,90,000 ఓట్లు తీసేశారు.
19 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారు. వరంగల్లు ఉప ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాలనే జీహెచ్‌ఎంసీకి వినియోగించాలి. జనవరి-2015లో ప్రచురించిన తుది జాబితా, సెప్టెంబరు వరకు ఉన్న మార్పులు, చేర్పులతో కలిపి ఉన్న జాబితాను వినియోగించాలని కోరాం. పటాన్‌చెరువు నియోజకవర్గం ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు రెండున్నరేళ్లు శిక్ష విధించినందున ఆయన ఎమ్మెల్యే పదవికి అర్హత కోల్పోతారు. అందువల్ల ఆయనను త్వరగా అనర్హుడిని చేసి నారాయణఖేడ్‌తో పాటు దీనికి ఎన్నికలు నిర్వహించాలని కోరాం’ అని పేర్కొన్నారు.
కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టారు: ఆర్.కృష్ణయ్య
సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టారని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశాం. బీసీ ఓటర్ల లెక్కల్లో అవకతవకలకు పాల్పడ్డారు. ఏ డివిజన్‌లో ఎక్కువగా బీసీలు ఉంటే ఆ డివిజన్‌లో బీసీ రిజర్వేషన్ కేటాయించాలి. అందువల్ల తమకు అనుకూలం గా ఉండేలా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కోరాం’ అని వివరించారు. ఈ ప్రతినిధి బృందంలో టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద్, గోపీనాథ్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
జనవరి-2015 జాబితాతోనే ఎన్నికలు
Published Tue, Dec 15 2015 4:16 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement