ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌లో మార్పులు
మే 1 నుంచి 22 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ప్రాం తాలు లేని 83 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ఆల స్యం కావడంతో షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు పేర్కొ న్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మే 1న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నారు.
మే 22 వరకు అభ్యంతరాలను స్వీకరించి మే 31లోగా వాటిని పరిష్కరించనున్నారు. జూన్ 15న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నా రు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ల జాబితాలో తప్పుల దిద్దుబాటు, ఇతర అభ్యంతరాల కోసం మే 1 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 2017 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.