
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితాను సమగ్రంగా రూపొందించడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతోంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులకు, అలాగే అర్హులై ఉన్నప్పటికీ ఓటర్లుగా నమోదు కాని వారికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఓటర్ల ముసాయిదా బాబితాను జిల్లా కలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. ఈ జాబితాల్లో తమ పేర్లు లేని వారు ఓటర్‌గా నమోదు చేయించుకోవచ్చు.
ఇష్టానుసారం ఓట్ల తొలగింపు కుదరదు
ఎలాంటి తనిఖీలు లేకుండా ఇష్టానుసారం ఓట్ల తొలగింపు కుదరదని, అలా చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలంటే అందుకు సవివరణమైన వాస్తవ కారణాలుండాలని పేర్కొంది. క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించకుండా ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం పరిశీలించిన తరువాతే మృతిచెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని పేర్కొంది. అలాగే ఆయా కుటుంబ సభ్యులు లేదా పక్క నివాసుల నుంచి ఫాం 7 తీసుకోవడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించిన తరువాతే మృతిచెందినవారి పేర్లను తొలగించాలని స్పష్టం చేసింది. దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇద్దరి నుంచి స్టేట్ మెంట్ తీసుకోవాలని కూడా పేర్కొంది. ఎలాంటి తొలగింపులైనా తహశీల్దార్ స్థాయి అధికారే చేయాలని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా వికలాంగులను ఓటరుగా నమోదు చేస్తే వారి వికలాంగ స్థాయి వివరాలను కూడా సేకరించాలని, పోలింగ్ రోజున వారిని పోలింగ్ కేంద్రాలను తీసుకువచ్చేందుకు కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపింది.
అర్హులంతా నమోదు చేసుకోండి: సిసోడియా
ఓటర్ల జాబితా పునస్సవరణ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ పేర్లు నమోదు చేసుకోవడానికి ఫారం 6 దాఖలు చేయాలని, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఫారం 6ఏను దాఖలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment