old age couples
-
ఓల్డేజ్.. ఓల్టేజ్..
చిన్న కుర్రాడిలాగా ఏంటీ ఆ డ్యాన్సులు? అంటూ ఎవరైనా ఆక్షేపించినా వెనకడుగు వేయనక్కర్లేదు. ఎందుకంటే డ్యాన్సులు చేస్తే వృద్ధుల్లో కుర్రతనం ఇనుమడిస్తుందని, వృద్ధాప్య ప్రభావం కనుమరుగవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంపై యుద్ధంలో మిగిలిన అన్నిరకాల శారీరక వ్యాయామాల కన్నా డ్యాన్స్ ది బెస్ట్ అని తేల్చడం విశేషం. సిటీలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో తమ నేమ్ బోర్డులో ఫిట్నెస్ అనే పదాన్ని చేర్చుకుంటున్న నేపథ్యంలో పెద్దవాళ్లు సైతం డ్యాన్సర్లుగా మారేందుకు ఇలాంటి సర్వే ఫలితాలు తోడ్పడనున్నాయి. వృద్ధాప్యాన్ని జయించడంలో శారీరక శ్రమను మించిన ప్రత్యామ్నాం లేదు. దీనిని ఇప్పుడిప్పుడే ఆధునికులు గుర్తిస్తున్నారు. జిమ్‌లు, యోగాసనాలు.. వగైరా ఎన్నో వ్యాయామ శైలులు.. ఒక్కో వ్యాయామం ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనం. అదే క్రమంలో నృత్యం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.స్టడీ ఇదీ.. ఫలితం ఇదీ.. అన్ని వ్యాయామాలూ ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా నృత్యం వల్ల వృద్ధాప్య సమస్యలకు చాలా మంచిదని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా పరిశోధన నిర్ధారించింది. వయసు పరంగా మీదపడే శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోడంలో ఎండ్యురెన్స్ట్రైనింగ్, డ్యాన్సింగ్ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని పరిశీలించినప్పుడు డ్యాన్స్ మరింత లాభదాయకమని తేలిందని పరిశోధనకు సారథ్యం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్‌కు చెందిన డాక్టర్ కేథరిన్ అంటున్నారు. సగటున 68 ఏళ్ల వయసున్న వందలాది మందికి 18 నెలల పాటు నృత్య శిక్షణ, ఎండ్యురెన్స్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీరిలో నృత్యాన్ని ఎంచుకున్నవారి బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ ప్రాంతంలో మరింత ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించింది. వృద్ధాప్య ప్రభావాన్ని పెంచి తత్సంబంధిత అల్జీమర్స్ తరహా వ్యాధుల్ని దరిచేర్చడంలో కీలకం ఈ ప్రాంతమే. ఈ పరిశోధన ఫలితాలను అనుసరించి బ్రెయిన్‌పై యాంటీ ఏజింగ్ ప్రభావాలను చూపే సరికొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను జిమ్మిన్ (జామ్మింగ్, జిమ్నాస్టిక్) అనే పేరుతో శబ్దాలను (మెలొడీస్, రిథిమ్) పుట్టించే ఒక కొత్త పద్ధతిని వీరు రూపొందించారు.నృత్యం ఆరోగ్యకరం.. ప్రతి ఒక్కరూ ఎంత కాలం వీలైతే అంత కాలం స్వతంత్రంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటారు. శారీరక శ్రమ దీనికి ఉపకరిస్తుంది. దీనిలో నృత్యం భాగమైతే శరీరానికి, మైండ్‌కి కొత్త సవాళ్లను, చురుకుదనాన్ని అందించడం అనివార్యం అని నగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ బాబీ అంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుందనేది తమ వద్ద శిక్షణకు వస్తున్నవారి విషయంలో రుజువైందన్నారు.ఇవీ తెలుసుకోండి.. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే సంతోషకారక హార్మోన్లు విడుదల అవుతాయి అని ఆ్రస్టేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యుయుటి) కూడా నిర్ధారించింది. 👉అంతర్గత ఆరోగ్య సమస్యలున్నవారికి నృత్యాలు సరిపడవు. కాబట్టి నృత్యాన్ని ఎంచుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం అవసరం. 👉 సోలో డ్యాన్సింగ్ సులభమైనది, పెద్దలకు బాగా నప్పుతుంది. అదే విధంగా ఓరియంటల్ డ్యాన్స్, బాలె డ్యాన్స్, ఇండియన్ డ్యాన్స్, ట్యాప్ డ్యాన్స్.. వంటివి చేయవచ్చు. 👉మోకాలు, హిప్, కాలి మడమ నొప్పులు.. వంటివి ఉన్నవారి కోసం సీటెడ్ డ్యాన్స్ కూడా ఉంది. 👉బాల్ రూమ్ డ్యాన్స్‌నే సీనియర్స్ బాగా ఇష్టపడతారు.. ఎందుకంటే ఇవి కపుల్ డ్యాన్స్ క్లాసెస్ కావడంతో పెద్దలకు చాలా ఉపయుక్తం. – ఈ డ్యాన్సుల్లో ఇతరులతో సోషలైజింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాధాన్యత కలిగిన వారిమే అనే అభిప్రాయంతో హుషారు వస్తుంది. 👉పెద్దల్లో ట్యాంగో, క్విక్ స్టెప్, వియన్నీస్ వాల్ట్జ వంటివి జ్ఞాపకశక్తి వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. 👉 చా– చా– చా, రుంబా, సాంబా, ప్యాసో.. వంటి విదేశీ నృత్యాలు చూడడానికి కాస్త సులభంగా అనిపించినా చేసేందుకు కొంత సంక్లిష్టంగా ఉంటాయి. అలాగే వీటికి మరింత శారరీక సామర్థ్యం అవసరం కాబట్టి వీటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. 👉లైన్ డ్యాన్సింగ్ పెద్ద వయసులో ఉన్నవారికి అత్యంత ఆదరణ పొందుతోన్న నృత్యశైలి. అమెరికాలో ఇది బాగా పాపులర్. ఈ నృత్యంలో డ్యాన్సర్లు ఒకరితో ఒకరు టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
కడుపునిండా తినండి బాబూ!
రెస్టారెంట్, ఫుడ్ కోర్టులలో కడుపునిండా భోంచేయాలంటే .. కనీసం రూ.200 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ వెరైటీ రుచులతో పుల్‌మీల్స్ ప్లేట్ తీసుకుంటే... హోటల్ ఉన్న ప్రాంతం, దానికి ఉన్న పాపులారిటిని బట్టి ప్లేటు రేటు ఉంటుంది. కొన్ని సార్లు పేరున్న రెస్టారెంట్లలో తిన్నప్పటికీ, భోజనం అంతరుచిగా ఉండదు. ఇలాంటి హోటల్స్ ఉన్న ఈ రోజుల్లో తిన్నంత అన్నం, ఐదారు రకాల కూరలతో కడుపునిండా పెడుతున్నారు. ఎంతో రుచికరమైన భోజనం పెడుతూ నామమాత్రము ధర రూ.50 ఫుల్‌మీల్స్ అందిస్తున్నారు ఓ జంట. ఇంత తక్కువకు భోజనం పెడుతున్నారంటే ఏదో చారిటీ సంస్థో అనుకుంటే పొరపడినట్లే. ఒంట్లో జవసత్వాలు నీరసించినప్పటికీ కొన్నేళ్లుగా ఎంతో ప్రేమగా వండి వారుస్తూ వేలమంది మన్ననలు పొందుతున్నారు ఈ అజ్జా అజ్టీలు. కర్ణాటకలోని మణిపాల్‌కు చెందిన వృద్ధ దంపతులే అజ్జా అజ్టీలు. రాజగోపాల్ నగర్ రోడ్‌లోని హోటల్ గణేష్ ప్రసాద్ (అజ్జా అజ్జీ మానే)ను 1951 నుంచి ఈ దంపతులు నడుపుతున్నారు. శాకాహార భోజనాన్ని అరిటాకు వేసి వడ్డించడాన్ని గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పాటిస్తున్నారు. అరిటాకు వేసి అన్నం, పప్పు, వేపుడు కూరలు, పచ్చడి, సలాడ్, రసం, పెరుగు పెడతారు. ఇవన్నీ బయట హోటల్లో తినాలంటే కనీసం రెండువందల రూపాయలైనా చెల్లించాలి. కానీ వీరు కేవలం యాభైరూపాయలకే భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు. ఇక్కడ పెట్టే భోజనం రుచిగా, శుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి ఇష్టంగా తింటున్నారు. ఇంట్లో వండిన వంట, తక్కువ రేటు, ప్రేమగా వడ్డిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా అంతా అజ్జాఅజ్జీ మానే అని పిలుచుకుంటుంటారు. వయసులో పెద్ద వాళ్లు కావడంతో కస్టమర్లకు ఆ దంపతులు తల్లిదండ్రులుగా, బామ్మ తాతయ్యలు వండిపెట్టినట్లుగా భావించి ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వారు అనుకున్న దానిని కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల గురించి ఇటీవల రక్షిత్ రాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అజ్జాఅజ్జీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు. వీరి సేవాగుణం గురించి తెలిసిన నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
వృద్ధాప్యంలో లివ్ఇన్రిలేషన్స్..
సహజీవనం అనేది ఆధునికుల మాట. పెళ్లిని ఇష్టపడని నవ యువత ఎంచుకున్న కొత్త బాట. అయితే దీన్ని అంతకు మించిన విస్తృత ప్రయోజనకారిగా, తమకు సంబంధించిన అత్యుత్తమ సేవా మార్గంగా మార్చుకుంది నగరానికి చెందిన తోడు నీడ సంస్థ. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సీనియర్ సిటిజన్స్‌ని జంటగా మారుస్తున్న ఈ స్వఛ్చంద సంస్థ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా నిర్వాహకురాలు రాజేశ్వరి (70) విశేషాలను ఇలా పంచుకున్నారు సాక్షి, సిటీబ్యూరో: మా ప్రయాణానికి పదేళ్లు. ఎటువంటి అంగబలం, అర్ధబలం లేని సంస్థ మాది. తొలిసారి మా సంస్థ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసేలా చేసింది సాక్షి. ఆ తర్వాత అన్ని మీడియా సంస్థల మద్దతు వల్ల ముందుకు వెళ్లగలిగాం. ఈ క్రమంలో సమాజానికి, కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థగా దీన్ని ముద్రవేసే ప్రయత్నం చేశారు. వృద్ధాప్యంలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ తప్పు అని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. మొదట్లో ఈ తరహా పెద్దల పెళ్లిళ్లకు పిల్లలే బాగా వ్యతిరేకించేవారు. అయితే ఇప్పుడిప్పుడు వారే తల్లిదండ్రులను తీసుకొస్తున్నారు. ఇది చాలా శుభపరిమాణం. 20న వార్షికోత్సవం తోడు నీడ సంస్థ ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా వార్షికోత్సవాలను ఈ నెల 20న నిర్వహిస్తున్నామని రాజేశ్వరి తెలిపారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియా హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ వేడుకల్లో భాగంగా కొత్త సభ్యుల పరిచయ వేదిక, ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటందన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన సమస్యలుపై అవగాహన కల్పించనున్నామన్నారు. పాత/కొత్త సభ్యులు అందరూ ధృవీకరణ పత్రాలతో మాత్రమే హాజరవ్వాలని కోరారు. వివరాలకు 8106367014 నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. లివ్ ఇన్ ఎందుకంటే... వృద్ధాప్యంలో పెళ్లిళ్లపై ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఉండే సందేహాల్లో ఆస్తులు, పిల్లలకు దూరమవుతారు అనేవి ప్రధానమైనవి. ఈ సందేహాలను పోగొట్టడానికే మేం లివ్ ఇన్ రిలేషన్స్‌ను ప్రోత్సహిస్తున్నాం. తొలుత మేం సహజీవనాన్ని ప్రతిపాదిస్తాం... కాదంటే వారిష్ట ప్రకారం పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఎంచుకున్న మార్గం ఏదైనా సరే ఒంటరి వృద్ధులకు తోడు ఏర్పడాలనేదే మా ఆశయం. పెళ్లి/లివిన్ ఏదైనా సరే ఇప్పటికి 200పైగా వృద్ధులను ఒకటి చేశాం. హైదరాబాద్‌లోనే 15 జంటలకు పైగా ఉన్నారు. లివిన్ రిలేషన్ షిప్‌ని సేవా మార్గంలో ప్రారంభించిన ఏకైక ఎన్‌జిఒ మాది. ప్రచారం కావాలి...ప్రయోజనం కలగాలి... ఈ పెద్దల పెళ్లిళ్లకు సంబంధించి మరింత ప్రచారం చేయాల్సి ఉంది. ఇంకా సామాజిక మూఢనమ్మకం పూర్తిగా పోవడం లేదు.అందుకే మారుమూల జిల్లాల్లో కూడా వీటిని విస్తరించాలని ఆశిస్తున్నాం. దీని కోసం లయన్స్ క్లబ్‌లు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ సహకారం తీసుకుని ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. తోడు తప్పని‘సిరి’... ఏ వయసులోనైనా మనిషికి తోడు అవసరం. వృద్ధాప్యంలో మరింత తప్పనిసరి. మొత్తం దేశ జనాభాలో 12శాతం వృద్ధులుంటే అందులో 40శాతం ఒంటరిగా ఉంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లేవు. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్‌లో ఎవరికి వారే యమునా తీరే. భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితిలో పిల్లలకి వృద్ధుల బాధ్యతలు మోసే తీరికా ఓపికా ఉండడం లేదు. ఈ పరిస్థితి ఓల్డేజ్ హోమ్లవైపు ఒంటరి వృద్ధుల్ని నడిపిస్తోంది, అయితే ఓల్డేజ్ హోమ్‌లో ఉన్నప్పటికీ మన అనే మనిషి లేకపోవడం అనే వెలితి ఎప్పటికీ తీరేది కాదు. ఇంకోవైపు పిల్లలు విదేశాల్లోనో మరో చోట ఉంటున్నప్పుడు ఒంటరి తనం మరింత దుర్భరం... ఒంటరి వృద్ధుడి ఆత్మహత్య, వృద్ధులపై దాడులు, దోపిడీలు... ఇలాంటివి మనం పేపర్లలో తరచు చదువుతున్నాం. పెద్దల కోసం...మరింత సాయం... తోడు అంటే భార్య భర్తలు మాత్రమే కాదు ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు కూడా కలిసి జీవించవచ్చు. అలాగే తమ వయసు వారితో కలిసి మెలిసి సరదాగా గడపాలనుకునేవారి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో బృందంగా ఏర్పడి చేసే ఆనంద యాత్ర ఒకటి. మంచి మంచి ప్రాంతాలకు పర్యటించే అవకాశం దీనిలో ఉంటుంది. అంతేకాకుండా టూర్లలో ఒకరినొకరు పరిశీలించుకుని నచ్చిన వ్యక్తిని సహచరి/సహచరునిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకు ఉన్నట్టే పెద్దల కోసం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కాలక్షేపం అయ్యేలా డే కేర్ సెంటర్స్ పెట్టాం. అలాగే పెళ్లి గురించి పెద్దగా ఆసక్తి లేనివారు కొంత మందితో కలిసి నివసించడాన్ని ప్రోత్సహిస్తూ కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్ ఫర్ అడల్ట్స్‌ను ఏర్పాటు చేశాం. -
ప్రభుత్వం పింఛన్ ఇవ్వదు.. మీరే ఆదుకోండి..!
సాక్షి, రామభద్రపురం: ఈ చిత్రంలోని వృద్ధుల పేర్లు నూకమ్మ, సీతయ్య. రామభద్రపురం మండలం గొల్లవీధికి చెందినవారు. ఒక కుమార్తె. ఆమెకు పెళ్లి చేసి పంపించారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆధారం లేక బతుకుబండి భారంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్ డబ్బులు కూడా రావడం లేదు. వాస్తవానికి నూకయ్యకు 73, సీతమ్మకు 67 ఏళ్లు ఉంటాయి. కానీ ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో వయసు తక్కువ పడింది. దీంతో ప్రస్తుతం ఇటీవల తీసుకొచ్చిన 65 ఏళ్లకే పెన్షన్ ప్రకారం ఇద్దరికి పింఛన్ అందడం లేదు. మహానేత వైఎస్సార్ హయాంలో ఇద్దరికి పింఛన్ వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. వృద్ధులు కావడంతో పని చేసేందుకు శక్తి లేదు. ఆస్తులు లేవు. కూమార్తెకు పెళ్లి చేసినా అల్లుడు తాగుబోతు కావడంతో ఆమె పరిస్థితి అలాగే ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వం అందించే 10 కేజీల బియ్యంతో కాలం గడిపేవారు. కానీ ఇటీవల నూకయ్య ఆరోగ్యం బాగాలేకపోతే రేషన్ కార్డును కుదువ పెట్టేశారు. ఇప్పుడు ఆ బియ్యం కూడా కరువైపోయే. ఈ విషయం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ కె.అప్పారావుకు తెలిసింది. వెంటనే స్పందించి నెలకు 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తున్నాడు. ఇప్పటికైనా దిక్కులేని వారికి దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే 91824 35104, 98854 08274 నంబర్లకు సంప్రదించాల్సిందిగా అప్పారావు కోరుతున్నారు. -
వృద్ధ దంపతుల సజీవదహనం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ఎప్పటిలానే తెల్లారింది. కానీ.. వారి జీవితాలు మాత్రం ముగిసిపోయాయి. నిన్నటి వరకు ఆ చుట్టుపక్క వారికి తలలో నాలుకలా మెలిగిన ఆ దంపతులు ఇకలేరు. కడుపు నింపే చిత్తు కాగితాలే చితిపేర్చాయి. వెలుగునిస్తుందనుకున్న దీపమే కొరివిగా మారింది. శనివారం నగరంలోని ఖండేరివీధి మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. బోయ తిమ్మన్న(70), బోయ తిక్కమ్మ(60) చెత్త పేపర్లు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితులే. బంధువులు కాకపోయినా.. అందరి యోగక్షేమాలు తెలుసుకునే మనస్తత్వం వీరి సొంతం. ఎన్నేళ్ల క్రితం కర్నూలును ఆవాసంగా మార్చుకున్నారో కానీ.. రాఘవేంద్రస్వామి ఆలయం ఎదుట రోడ్డు పక్కగా వేసుకున్న గుడిసె కాస్త నీడనిస్తోంది. వానొచ్చినా.. ఎండ కాచినా కాలు కదపనిదే కడుపునిండని జీవనం కావడంతో శుక్రవారం దంపతులిద్దరూ బతుకు ప్రయాణం కలిసే సాగించారు. ఎక్కడెక్కడో తిరిగారు.. చెత్తకుప్పల్లో పాత పేపర్లను ఏరుకుని చీకటిపడుతుండగా గూటికి చేరుకున్నారు. కాగితాలను మరుసటి రోజు గుజిరీలో విక్రయించేందుకు గుడిసెలో ఓ పక్కన పెట్టి కునుకుతీశారు. కరెంటుకు నోచుకోని వీరి గుడిసెలో ఓ దీపం వెలుగునిస్తోంది. ఆ దీపమే ఆ దంపతులను బుగ్గి చేసింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు వ్యాపించిన మంటలు చిత్తు కాగితాలు సహా ఇరువురినీ దహించివేశాయి. గాఢ నిద్రలోనే ఆ దంపతులు కన్నుమూశారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి అంతా ‘ముగిసిపోయింది’. ఆప్యాయంగా పలకరించే ఈ అవ్వాతాతలు మాంసపు ముద్దలయ్యారు. ఏమీ కాకపోయినా.. చిరునవ్వుతో పలకరించే ఆ దంపతులు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఉదయాన్నే ఇటువైపు వచ్చిన వారంతా.. కుటుంబ సభ్యులు కాకపోయినా కన్నీరుకార్చారు. ఏమి జరిగిందోనని ఆరా తీసి.. బరువెక్కిన హృదయాలతో ముందుకు కదిలారు. మృతుడు తిమ్మన్న సోదరుడు పెద్ద తిప్పన్న కుమారుడు రామాంజనేయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.