కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ఎప్పటిలానే తెల్లారింది. కానీ.. వారి జీవితాలు మాత్రం ముగిసిపోయాయి. నిన్నటి వరకు ఆ చుట్టుపక్క వారికి తలలో నాలుకలా మెలిగిన ఆ దంపతులు ఇకలేరు. కడుపు నింపే చిత్తు కాగితాలే చితిపేర్చాయి. వెలుగునిస్తుందనుకున్న దీపమే కొరివిగా మారింది. శనివారం నగరంలోని ఖండేరివీధి మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. బోయ తిమ్మన్న(70), బోయ తిక్కమ్మ(60) చెత్త పేపర్లు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితులే. బంధువులు కాకపోయినా.. అందరి యోగక్షేమాలు తెలుసుకునే మనస్తత్వం వీరి సొంతం.
ఎన్నేళ్ల క్రితం కర్నూలును ఆవాసంగా మార్చుకున్నారో కానీ.. రాఘవేంద్రస్వామి ఆలయం ఎదుట రోడ్డు పక్కగా వేసుకున్న గుడిసె కాస్త నీడనిస్తోంది. వానొచ్చినా.. ఎండ కాచినా కాలు కదపనిదే కడుపునిండని జీవనం కావడంతో శుక్రవారం దంపతులిద్దరూ బతుకు ప్రయాణం కలిసే సాగించారు. ఎక్కడెక్కడో తిరిగారు.. చెత్తకుప్పల్లో పాత పేపర్లను ఏరుకుని చీకటిపడుతుండగా గూటికి చేరుకున్నారు. కాగితాలను మరుసటి రోజు గుజిరీలో విక్రయించేందుకు గుడిసెలో ఓ పక్కన పెట్టి కునుకుతీశారు. కరెంటుకు నోచుకోని వీరి గుడిసెలో ఓ దీపం వెలుగునిస్తోంది. ఆ దీపమే ఆ దంపతులను బుగ్గి చేసింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు వ్యాపించిన మంటలు చిత్తు కాగితాలు సహా ఇరువురినీ దహించివేశాయి. గాఢ నిద్రలోనే ఆ దంపతులు కన్నుమూశారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి అంతా ‘ముగిసిపోయింది’.
ఆప్యాయంగా పలకరించే ఈ అవ్వాతాతలు మాంసపు ముద్దలయ్యారు. ఏమీ కాకపోయినా.. చిరునవ్వుతో పలకరించే ఆ దంపతులు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఉదయాన్నే ఇటువైపు వచ్చిన వారంతా.. కుటుంబ సభ్యులు కాకపోయినా కన్నీరుకార్చారు. ఏమి జరిగిందోనని ఆరా తీసి.. బరువెక్కిన హృదయాలతో ముందుకు కదిలారు. మృతుడు తిమ్మన్న సోదరుడు పెద్ద తిప్పన్న కుమారుడు రామాంజనేయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వృద్ధ దంపతుల సజీవదహనం
Published Sun, Dec 8 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement