ఉత్సవమూర్తికి హారతులు పడుతున్న పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మంత్రాలయంలో అశేష భక్తజనుల మధ్య కొనసాగుతున్న రాఘవుడి రథోత్సవం
మంత్రాలయం (కర్నూలు): జగద్గురు మంత్రాలయం రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్తరారాధన పురష్కరించుకుని మహా రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పల్లకోత్సవం అనంతరం భృంగివాహనంపై సంస్కృత విద్యాపీఠం వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. విద్యాపీఠం ప్రిన్సిపాల్ వాదిరాజాచార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ప్రహ్లాదరాయలకు వేదపఠనంతో విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం చేరుకుని రాఘవేంద్రుల మూలబృందావనంతో కొలువు చేశారు. ఉత్సవమూర్తికి పీఠాధిపతి విశిష్ట పూజలు చేసి.. వసంతోత్సవానికి శ్రీకారం చుట్టారు. అర్చకులు, అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా వసంతోత్సవం చేసుకున్నారు.
రథోత్సవం..రమణీయం
స్వామివారు ఊరేగింపుగా 12 గంటలకు శ్రీమఠం ముంగిట మహారథం వద్దకు చేరుకున్నారు. పీఠాధిపతి రథ చక్రాలకు నారీకేళ సమర్పణలు కానిచ్చి.. ఉత్సవమూర్తికి హారతులు పట్టారు. మహారథంపై ఉత్సవమూర్తిని కొలువుంచారు. 12.15 గంటలకు రాఘవుడి మహారథయాత్ర మొదలైంది. అశేష భక్తజనం రాఘవుడి నామస్మరణ అందుకోగా.. కళాకారుల డప్పుదరువులు, హరిదాసుల నృత్యప్రదర్శనలు, మహిళల సంకీర్తనాలాపనలు, బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టగా..యాత్ర శ్రీమఠం ముఖద్వారం సమీపించింది. ఆ సమయంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక హెలికాప్టర్ నుంచి మహారథంపై పూలవర్షం కురిపించారు. ఐదు పర్యాయాలు పుష్పాలతో అభిషేకం చేశారు. మహారథోత్సవం శ్రీమఠం ముఖద్వారం నుంచి రాఘవేంద్ర సర్కిల్ చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు శ్రీమఠం వరకు రమణీయంగా కొనసాగింది.
భారీ బందోబస్తు :
ఆరాధనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సీఐలు రాము, దైవప్రసాద్, ఎస్‌ఐలు శ్రీనివాసనాయక్, రాజారెడ్డితో పాటు ఐదుగురు, ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు 13 మంది, మహిళా కానిస్టేబుళ్లు ఎనిమిది మంది, కానిస్టేబుళ్లు 71, స్పెషల్‌పార్టీ 15 మంది, హోంగార్డ్స్ ఎనిమిది మంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్, ఫైర్ సిబ్బంది బందోబస్తులో పాలుపంచుకున్నారు.
ఆకట్టుకున్న సంప్రదాయ నృత్య ప్రదర్శనలు
రథయాత్రలో కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక డోలు వాయిద్యాలకు బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాలు.. కర్ణాటక డప్పు కళాకారుల కోలాటాలు, పొంజాటలు అలరించాయి. గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి మహిళల భజనలు వీనుల విందు చేశాయి. వేడుకలు తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 70 వేల మంది హాజరైనట్లు అంచనా. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏవో రొద్ద ప్రభాకర్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 గిరిధర్, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, పీఆర్వో బిందుస్వామి, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
వేడుకలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
మహారథోత్సవంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఎంటీఆర్ హోటల్ దారిలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి మఠం చేరుకుని ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రస్వామి బృందావనంలో ప్రత్యేక పూజ చేసి.. వసంతోత్సవంలో తరించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ భీమిరెడ్డి, మాజీ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment