rathotsvam
-
బృందలోలుడికి బ్రహ్మరథం
మంత్రాలయం (కర్నూలు): జగద్గురు మంత్రాలయం రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్తరారాధన పురష్కరించుకుని మహా రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పల్లకోత్సవం అనంతరం భృంగివాహనంపై సంస్కృత విద్యాపీఠం వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. విద్యాపీఠం ప్రిన్సిపాల్ వాదిరాజాచార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ప్రహ్లాదరాయలకు వేదపఠనంతో విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం చేరుకుని రాఘవేంద్రుల మూలబృందావనంతో కొలువు చేశారు. ఉత్సవమూర్తికి పీఠాధిపతి విశిష్ట పూజలు చేసి.. వసంతోత్సవానికి శ్రీకారం చుట్టారు. అర్చకులు, అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా వసంతోత్సవం చేసుకున్నారు. రథోత్సవం..రమణీయం స్వామివారు ఊరేగింపుగా 12 గంటలకు శ్రీమఠం ముంగిట మహారథం వద్దకు చేరుకున్నారు. పీఠాధిపతి రథ చక్రాలకు నారీకేళ సమర్పణలు కానిచ్చి.. ఉత్సవమూర్తికి హారతులు పట్టారు. మహారథంపై ఉత్సవమూర్తిని కొలువుంచారు. 12.15 గంటలకు రాఘవుడి మహారథయాత్ర మొదలైంది. అశేష భక్తజనం రాఘవుడి నామస్మరణ అందుకోగా.. కళాకారుల డప్పుదరువులు, హరిదాసుల నృత్యప్రదర్శనలు, మహిళల సంకీర్తనాలాపనలు, బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టగా..యాత్ర శ్రీమఠం ముఖద్వారం సమీపించింది. ఆ సమయంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక హెలికాప్టర్ నుంచి మహారథంపై పూలవర్షం కురిపించారు. ఐదు పర్యాయాలు పుష్పాలతో అభిషేకం చేశారు. మహారథోత్సవం శ్రీమఠం ముఖద్వారం నుంచి రాఘవేంద్ర సర్కిల్ చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు శ్రీమఠం వరకు రమణీయంగా కొనసాగింది. భారీ బందోబస్తు : ఆరాధనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సీఐలు రాము, దైవప్రసాద్, ఎస్ఐలు శ్రీనివాసనాయక్, రాజారెడ్డితో పాటు ఐదుగురు, ఏఎస్ఐలు, హెచ్‌సీలు 13 మంది, మహిళా కానిస్టేబుళ్లు ఎనిమిది మంది, కానిస్టేబుళ్లు 71, స్పెషల్‌పార్టీ 15 మంది, హోంగార్డ్స్ ఎనిమిది మంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్, ఫైర్ సిబ్బంది బందోబస్తులో పాలుపంచుకున్నారు. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్య ప్రదర్శనలు రథయాత్రలో కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక డోలు వాయిద్యాలకు బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాలు.. కర్ణాటక డప్పు కళాకారుల కోలాటాలు, పొంజాటలు అలరించాయి. గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి మహిళల భజనలు వీనుల విందు చేశాయి. వేడుకలు తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 70 వేల మంది హాజరైనట్లు అంచనా. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏవో రొద్ద ప్రభాకర్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 గిరిధర్, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, పీఆర్వో బిందుస్వామి, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. వేడుకలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మహారథోత్సవంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఎంటీఆర్ హోటల్ దారిలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి మఠం చేరుకుని ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రస్వామి బృందావనంలో ప్రత్యేక పూజ చేసి.. వసంతోత్సవంలో తరించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భీమిరెడ్డి, మాజీ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి ఉన్నారు. -
బ్రహ్మరథం పట్టారు
నేత్రపర్వం.. లక్ష్మీ నారసింహుని రథోత్సవం వేలాదిగా తిలకించి, పులకించిన భక్తజనం జనసంద్రంగా మారిన అంతర్వేది వేకువజామునే సాగర స్నానానికి పోటెత్తిన భక్తులు అంతర్వేది(సఖినేటిపల్లి) (రాజోలు) : భక్తవరదుడు అంతర్వేది లక్షీ్మనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం మాడవీధుల్లో నిర్వహించిన రథయాత్ర అపూర్వ ఘట్టంగా నిలిచింది. సోమవారం రాత్రి కనువిందు చేసిన స్వామి కల్యాణం, మంగళవారం గ్రామవీధులను వైకుంఠపథాలుగా మార్చిన రథోత్సవం, ఆ రెండు పర్వాలకు నడుమ భీష్మ ఏకాదశి వేకువజామున సాగరస్నానం, అనంతరం ఆలయంలో స్వామి దర్శనం. ఇన్ని ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. సోమవారం రాత్రి 12.21 గంటలకు కల్యాణోత్సవం ముగిసిన అనంతరం మంగళవారం వేకువజామున భక్తులు కాలినడకన రెండు కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరానికి వెళ్లారు. భీష్మ ఏకాదశి పర్వదినాన సాగరస్నానం చేసేందుకు వచ్చిన భక్తులతో తీరం జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో బారులుతీరి స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం వరకూ ఒకదాని తరువాత మరొకటిగా పుణ్య కార్యక్రమాలు కొనసాగుతుండడంతో భక్తులు పిల్లాపాపలతో సహా ఉండిపోయారు. భీష్మ ఏకాదశినాడు స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వారు తోడవడంతో అంతర్వేది వీధులు కిక్కిరిశాయి. కల్యాణం మరుసటి రోజు ఇంటి ఆడపడుచు గుర్రాలక్కకు చీరె, సారె పెట్టేందుకు రథంపై మెరకవీధిలోని ఆలయం వద్దకు వెళ్లారు. అరటి, గుమ్మడికాయల మొక్కు.. భక్తుల గోవిందనామస్మరణల మధ్య మధ్యాహ్నం 2.42 గంటలకు నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకిలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. తొలుత మొగల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు శ్రీరాజా కలిదిండి కుమార సత్యనారాయణ సింహజగపతి, రాజోలు ఎమ్మెల్యే గొల్ల పల్లి సూర్యారావు, డీఎస్పీ అంకయ్య, ఆర్డీఓ గణేష్‌కుమార్, గోదావరి డెల్టా కమిటీ చైర్మ¯ŒS భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, న్యాయవాదులు బత్తుల రాము, బెల్లంకొండ సూరి బాబు, ఎంపీపీ పి. లక్షీ్మసరస్వతి, ఆలయ ఏసీ చిక్కాల వెంకట్రావు రథానికి పూజ చేశారు. రాజా బహద్దూర్ కొబ్బరికాయ కొట్టి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. మెరకవీధి నుంచి యాత్ర పల్లపువీధి మీదుగా పదహారుకాళ్ల మండపానికి చేరుకుంది. మార్గమధ్యలో గుర్రాలక్కకు స్వామి తరఫున చీరె, సారె ఇచ్చారు. ప్రముఖపారిశ్రామికవేత్త జం పన సత్యనారాయణ రాజు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డీఎస్పీ అంకయ్య ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు నిర్వహించారు. అంతర్వేదిలో నేడు లక్షీ్మనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు గజ వాహనంపై, రాత్రి ఎనిమిది గంటలకు పొన్నవాహనంపై స్వామివారి గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే పొలమూరు సత్రం నిర్వాహకులు అన్నపర్వత మహానివేదన కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహించనున్నారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథ, హరికథ ఏర్పాటు చేశారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న అన్నదర్శనం... భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిధి నాడు విరమణ చేసే అర్చకులు, స్వామి అన్నదర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహానివేదన చేస్తారు. బుధవారం సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ శ్రీస్వామివారి సన్నిధిని శుద్ధిచేస్తారు. ఈ సమయంలో దర్శనాన్ని అర్చకులు నిలిపివేస్తారు. అన్నపర్వత మహానివేదన అనంతరం యథావిధిగా అర్చకులు స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు. భక్తులందరికీ ప్రసాదం పంచుతారు.