Raghavendra swamy temple
-
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదానోత్సవం
కర్నూలు/మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మఠం ఆవరణలో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట వ్యక్తులుగా పేరు గాంచిన ప్రముఖులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులు ఎన్.చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ముంబై, విద్వాన్ రామ విఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ్ డి.కరడ్, పూణే గార్లకు రాష్ట్ర గవర్నర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారని, భక్త ప్రహ్లాద అవతారంగా భావిస్తారని పేర్కొన్నారు. తుంగ భద్రా తీరంలో వెలిసిన మంత్రాలయం ప్రముఖ పుణ్య క్షేత్రం అని ప్రశంసించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వ్యాస తీర్థ స్కీం, అన్నదాన స్కీం, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్రాణదాన స్కీం, గోరక్షణ కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సర్వ జన శాంతి పీఠం అని గవర్నర్ కొనియాడారు. శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందిన ప్రముఖులను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం అందచేశారు. సన్మాన గ్రహీతలు చేస్తున్న సేవలను అభినందించారు. అవార్డులు అందుకున్న ప్రముఖులు ప్రసంగిస్తూ, శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వీర వెంకట శ్రీశానంద, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్వాశ్రమ తండ్రి ఎస్.గిరియాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అది వైఎస్సార్సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట -
వైభవం.. రాఘవేంద్రుల ఆరాధనోత్సవం
మంత్రాలయం రూరల్/తిరుమల: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని గురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండువగా సాగాయి. స్వామి వారు బృందావన ప్రవేశం చేసిన శుభ దినాన వేదభూమి పులకించింది. నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రులు భక్తులకు కనువిందు చేశారు. ఆనవాయితీలో భాగంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత శ్రీ రాఘవేంద్రస్వామి వారికి వెంకన్న పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా పట్టువస్త్రాలను గ్రామ దేవత మంచాలమ్మ సన్ని«ధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలోత్సవ మండపంలో పట్టువస్త్రాలను ఉంచి ఊంజల సేవ చేపట్టారు. వాటిని శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అలంకరించి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి టీటీడీ అదనపు ఈవో «ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతకు శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫలమంత్రాక్షితలను ఇచ్చి ఆశీర్వదించారు. కాగా, ఈ నెల 21న ప్రారంభమైన స్వామి వారి ఆరాధన మహోత్సవాలు 27తో ముగియనున్నాయి. -
సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?
బెంగళూరు : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి సమాజానికి మంచి చేస్తూ ఆదర్శప్రాయురాలుగా ఎంతో పేరు సంపాదించారు. ఎన్నో అనాథ ఆశ్రమాలు నెలకొల్పి ఎంతోమంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా మంచి రచయిత అయిన సుధా మూర్తి ఎన్నో మంచి నవలల కూడా రచించారు. (చదవండి : పుట్టిన రోజున పిల్లలకు కానుక) అలాంటి సుధా మూర్తి బెంగళూరు జయానగర్‌లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద కూరగాయలు అమ్మారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ' ఫోటోలో కనిపించేది ముమ్మాటికి సుధా మూర్తియే. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాసుడికి దండలు తయారు చేయడం.. మరో మూడు రోజులు రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద కూరగాయలను అమ్మడంతో పాటు భక్తులకు అందించే ప్రసాదానికి తనవంతుగా కూరగాయలు కట్ చేస్తుంది. వ్యాపారంలో తమకు వస్తున్న సంపద కారణంగా అహంకారం అనేది రాకూడదనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆమెకు ఇవే మా వందనాలు' అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసిన కొన్ని ప్రచురణ సంస్థలు సుధా మూర్తి గురించి తప్పుడు కథనాలు ప్రచురించాయి. (చదవండి : డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్) కల్పితం : సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి గుడి బయట కూరగాయలు అమ్ముతున్న ఫోటోలను చాలా సంస్థలు తమ కథనాల్లో తప్పుగా ప్రచురించాయి. సుధా మూర్తి కూరగాయలు అమ్మడం లేదని.. గుడి బయట సేవా కార్యక్రమాల పేరిట ఒక స్టోర్ నడుపుతున్నారని.. ఇలా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకుంటున్నారని ఆరోపించాయి. కొన్ని సంవత్సరాలుగా స్టోర్ వద్దకు వచ్చి కూరగాయలతో పాటు ఇతర రకాల సేవలు కూడా అందిస్తున్నారు. వాస్తవం : వాస్తవానికి సుధా మూర్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. స్వచ్చంద సేవ పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తున్న ఆమె భక్తులకు భోజనం సిద్ధం చేయడం, పండ్లు కడగడం, ప్రసాదానికి కూరగాయలు కోయడం వంటి కార్యక్రమాలతో సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలోనే ఆమె కూరగాయల ముందు కూర్చొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే ఆమె రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు మాత్రం తమ అనుమతితో స్టోర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా అంతకుముందు బెంగళూరు మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధా మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నప్పుడు తన సేవా కార్యక్రమాల్ని స్వయంగా వెల్లడించారు. 'ప్రతి ఏడాదిలో మూడు రోజులు దేవుడికి స్వచ్చంద సేవ చేయాలని అనుకున్నా. ఉదయం నాలుగు గంటలకే లేచి.. బెంగళూరులోని రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్చంద సేవ చేస్తుంటా. సెక్యూరిటీ గార్డు సాయంతో వంటగదితో పాటు అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అందించే ప్రసాదాల కోసం నా వంతు సాయం అందిస్తా. తర్వాత కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థాలను చెత్త డబ్బాలో వేసి స్వయంగా తీసుకెళ్లి పడేసి వస్తా. ఇదంతా స్వచ్చంద సేవ మాత్రమే.. ఏ ప్రతిఫలం ఆశించను. 'అంటూ ఆమె తెలిపారు. -
రాఘవేంద్రా.. ఇదేమిటి?
సాక్షి, మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి సశరీరంగా బృందావనస్తులైన పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం. రాఘవేంద్రులు కొలువై మహిమలతో వివిధ ఖండాల్లోనూ భక్తుల మదిని దోచారు. అంతటి ప్రశస్థి కలిగిన క్షేత్రంలో గతమెన్నడూ లేని విధంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భక్తుల సొమ్మును దిగమింగుతున్నారన్న ఆరోపణలు మొదలు.. పీఠాధిపతి తీరుపై సైతం విమర్శలు వచ్చాయి. గతంలో టీడీపీ ఇన్చార్జిగా ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డి లెటర్ ప్యాడ్‌పై పీఠాధిపతిగా సుబుదేంద్రతీర్థులు అనర్హుడంటూ సీఎం చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. అదే సమయంలో మఠంలో ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఈఈ సురేష్ కోనాపూర్, మరో ఇంజినీర్ బద్రి, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని స్థానిక భక్తుడు వి.నారాయణ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుల నేపథ్యంలో దేవదాయశాఖ కమిషనర్ భ్రమరాంబ విచారణ చేపట్టారు. ఫిర్యాదు దారులను పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ప్రస్తుతం విచారణ రిపోర్టు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దే ఉండిపోయింది. పీఠాధిపతిపై కేసు నమోదుకు ఫిర్యాదు.. అసలే ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టారని ఆరోపణలు శ్రీమఠానికి కొంత మచ్చ తెచ్చాయి. ఈ గాయం నుంచి తేరుకోక ముందే శ్రీమఠంపై మరో పిడుగుపడింది. ఈసారి ఏకంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు రావడం విశేషం. ఈనెల 19న రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం నిర్వహించారు. రథయాత్ర ప్రారంభానికి ముందు రథంపై నుంచి పీఠాధిపతి రూ.100 కరెన్సీ నోట్లు విసిరారు. ఆ సమయంలో భక్తులు ఒక్కసారి నోట్ల కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుంటుంబ సభ్యులతోపాటు, కొందరు భక్తులు తూలిపడిపోయారు. తొక్కిసలాట చోటుచేసుకుంది. విచక్షణ మరిచి నోట్లు విసిరిన పీఠాధిపతిపై చట్ట పరంగా కేసు నమోదు చేయాలని గురువారం మంత్రాలయానికి చెందిన భక్తుడు వి.నారాయణ స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అంతటా చర్చ.. యాదృచ్ఛికమో.. లేక మెప్పులో భాగమో తెలీదుగానీ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు కరెన్సీ విసరడం చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఇరు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారమే రేపింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని భక్తులు పేర్కొంటున్నారు. శ్రీమఠం చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో పీఠాధిపతిపైనే కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో దావానలంలా పాకింది. -
బృందలోలుడికి బ్రహ్మరథం
మంత్రాలయం (కర్నూలు): జగద్గురు మంత్రాలయం రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్తరారాధన పురష్కరించుకుని మహా రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పల్లకోత్సవం అనంతరం భృంగివాహనంపై సంస్కృత విద్యాపీఠం వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. విద్యాపీఠం ప్రిన్సిపాల్ వాదిరాజాచార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ప్రహ్లాదరాయలకు వేదపఠనంతో విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం చేరుకుని రాఘవేంద్రుల మూలబృందావనంతో కొలువు చేశారు. ఉత్సవమూర్తికి పీఠాధిపతి విశిష్ట పూజలు చేసి.. వసంతోత్సవానికి శ్రీకారం చుట్టారు. అర్చకులు, అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా వసంతోత్సవం చేసుకున్నారు. రథోత్సవం..రమణీయం స్వామివారు ఊరేగింపుగా 12 గంటలకు శ్రీమఠం ముంగిట మహారథం వద్దకు చేరుకున్నారు. పీఠాధిపతి రథ చక్రాలకు నారీకేళ సమర్పణలు కానిచ్చి.. ఉత్సవమూర్తికి హారతులు పట్టారు. మహారథంపై ఉత్సవమూర్తిని కొలువుంచారు. 12.15 గంటలకు రాఘవుడి మహారథయాత్ర మొదలైంది. అశేష భక్తజనం రాఘవుడి నామస్మరణ అందుకోగా.. కళాకారుల డప్పుదరువులు, హరిదాసుల నృత్యప్రదర్శనలు, మహిళల సంకీర్తనాలాపనలు, బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టగా..యాత్ర శ్రీమఠం ముఖద్వారం సమీపించింది. ఆ సమయంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక హెలికాప్టర్ నుంచి మహారథంపై పూలవర్షం కురిపించారు. ఐదు పర్యాయాలు పుష్పాలతో అభిషేకం చేశారు. మహారథోత్సవం శ్రీమఠం ముఖద్వారం నుంచి రాఘవేంద్ర సర్కిల్ చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు శ్రీమఠం వరకు రమణీయంగా కొనసాగింది. భారీ బందోబస్తు : ఆరాధనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సీఐలు రాము, దైవప్రసాద్, ఎస్ఐలు శ్రీనివాసనాయక్, రాజారెడ్డితో పాటు ఐదుగురు, ఏఎస్ఐలు, హెచ్‌సీలు 13 మంది, మహిళా కానిస్టేబుళ్లు ఎనిమిది మంది, కానిస్టేబుళ్లు 71, స్పెషల్‌పార్టీ 15 మంది, హోంగార్డ్స్ ఎనిమిది మంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్, ఫైర్ సిబ్బంది బందోబస్తులో పాలుపంచుకున్నారు. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్య ప్రదర్శనలు రథయాత్రలో కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక డోలు వాయిద్యాలకు బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాలు.. కర్ణాటక డప్పు కళాకారుల కోలాటాలు, పొంజాటలు అలరించాయి. గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి మహిళల భజనలు వీనుల విందు చేశాయి. వేడుకలు తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 70 వేల మంది హాజరైనట్లు అంచనా. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏవో రొద్ద ప్రభాకర్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 గిరిధర్, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, పీఆర్వో బిందుస్వామి, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. వేడుకలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మహారథోత్సవంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఎంటీఆర్ హోటల్ దారిలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి మఠం చేరుకుని ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రస్వామి బృందావనంలో ప్రత్యేక పూజ చేసి.. వసంతోత్సవంలో తరించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భీమిరెడ్డి, మాజీ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి ఉన్నారు. -
అక్రమాల ‘బండారం’
శ్రీమఠం..శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన పవిత్ర ప్రదేశం. స్వామి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజూ భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు..శ్రీమఠంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వారిపై చర్యలు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మంత్రాలయం (కర్నూలు): దేవదాయ శాఖ 2015 జూన్ 24వ తేదీన జారీ చేసిన జీవో 222 ప్రకారం.. మఠం, ఆలయ ప్రాకారాల్లో ఎలాంటి వ్యాపార సముదాయాలు ఉండరాదు. అలాగే ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. అయితే శ్రీమఠం ప్రాకారంలో నిబంధనలకు విరుద్ధంగా బండారు దుకాణం కొనసాగుతోంది. నెలకు రూ.5 లక్షల ప్రకారం దీనిని బాడుగకు తీసుకున్నారు. రోజూ దుకాణంలో ఎంత లేదన్నా రూ.50 వేల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. ఉత్సవాల సమయంలో రూ.3 లక్షల వరకు ఉంటోంది. మఠం ప్రాంగణంలో బండార్ ఉండటంతో భక్తులు గుడ్డిగా మోసపోతున్నారు. సదరు దుకాణం శ్రీమఠానిదేనని కొనుగోళ్లు జరుపుతున్నారు. నిర్వాహకులు ఎవరంటే.. కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి చెందిన ఉడిపి రంగ, పరమేష్‌లు 25 ఏళ్ల క్రితం మంత్రాలయం వచ్చారు. ఒకరు మఠం ఎదుట టెంకాయల వ్యాపారం పెట్టుకోగా..ఇంకొకరు గుడి పూజారి వ్యాసరాజాచార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో కూలిగా చేరారు. మూడేళ్ల తర్వాత శాంతినికేతన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో చిన్న రీల్ క్యాసెట్ సెంటర్ పెట్టుకున్నారు. రెండేళ్లకు మరో రెండు క్యాసెట్ సెంటర్లు చేసుకున్నారు. లాభాలు పొంది 2005లో రూ.50 లక్షలు వెచ్చించి ఉడిపి హోటల్, లాడ్జీని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి శ్రీమఠంలో పీఠాధిపతుల సన్నిహితులతో పరిచయాలు పెంచుకున్నారు. 2009లో వరద తర్వాత అప్పటి పీఠాధిపతి పూర్వాశ్రమ కుమారుడు సుయమీంద్రాచార్‌తో ఉన్న పరిచయాలతో శ్రీమఠం ప్రాకారంలో పూజా బండార్ ఏర్పాటు చేశారు.ఎనిమిదేళ్లుగా పూజా బండార్ కొనసాగుతోంది. బయట మార్కెట్లో రూ.10 విలువజేసే వస్తువును ఇక్కడ రూ.60కు విక్రయించడం పరిపాటిగా మారింది. తిలాపాపం తలా పిడికెడు.. జీవో 222 పకడ్బందీగా అమలు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులకు శ్రీమఠంలోని బండార్ దుకాణం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దుకాణ నిర్వాహకులు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు..భక్తుల దోపిడీలో అధికారులకు వాటాలు వెళ్లడం విస్మయాన్ని కల్గిస్తోంది. మఠంలో ఏ చిన్న పని కావాలన్నా ఎండోమెంట్ అధికారులు నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటూ మఠం పెద్దలు సూచిస్తారు. మరి ఇంతగా భక్తులను దోస్తున్న దుకాణానికి అనుమతులు ఎలా వచ్చాయో అంతుబట్టడం లేదు. ప్రతేడాది దుకాణానికి కచ్చితంగా బహిరంగ వేలం నిర్వహించాలి. అయితే ఆమ్యామ్యాలతో గుట్టుగా టెండర్ ముగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
విషాదం: కుటుంబమంతా ఆత్మహత్య
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంలోని ముగ్గురు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక విజయేంద్ర వసతి భవనంలో పుదుచ్చేరికి చెందిన దంపతులు తమ పదేళ్ల కూతురికి విషం ఇచ్చి అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వామివారి హుండిలో పాము
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది. భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలోకి పాము ప్రవేశించింది. ఆ విషయం గమనించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పాము అక్కడే ఉన్న దేవుని హుండీలోకి వెళ్లింది. దీంతో స్వామి వారి ఆలయంలోకి వీఐపీ దర్శనాలతోపాటు హుండిలో భక్తులు వేసే కానుకలను నిలిపివేశారు. పామును బయటకు రప్పించేందుకు ఆలయ భద్రత సిబ్బంది చర్యలు చేపట్టారు. -
శ్రీ సుయతీంద్ర తీర్థులు కన్నుమూత
మంత్రాలయం : ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థులు కన్నుముశారు. కొంత కాలంగా మూత్రపిండాలు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన గత 15 రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. సుయతీంద్ర తీర్ధులకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ సుయతీంద్ర తీర్థులు మంత్రాలయం రాఘవేంద్ర మఠానికి 39వ పీఠాధిపతి. కర్ణాటకలోని గదగ్ జిల్లా పేటే ఆలూరులో అనంతాచార్య-యమునాబాయి దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు సుశీలేంద్రాచార్. బీఏ, బీఈడీ పూర్తి చేసిన ఆయన... బెంగళూరులోని భారతీయ సంస్కృతి విద్యాపీఠంలో విశేష సేవలందించారు. 2006లో సుశమీంద్ర తీర్థుల ఆధ్వర్యంలో సన్యాసం స్వీకరించి రాఘవేంద్రస్వామి మఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. 2009లో మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అటు... సుయతీంద్ర తీర్థుల మరణవార్తతో మంత్రాలయం మౌన రోదనలో మునిగిపోయింది. గ్రామ ప్రజలు, భక్తులు అశ్రు నివాళి అర్పిస్తున్నారు. -
వృద్ధ దంపతుల సజీవదహనం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ఎప్పటిలానే తెల్లారింది. కానీ.. వారి జీవితాలు మాత్రం ముగిసిపోయాయి. నిన్నటి వరకు ఆ చుట్టుపక్క వారికి తలలో నాలుకలా మెలిగిన ఆ దంపతులు ఇకలేరు. కడుపు నింపే చిత్తు కాగితాలే చితిపేర్చాయి. వెలుగునిస్తుందనుకున్న దీపమే కొరివిగా మారింది. శనివారం నగరంలోని ఖండేరివీధి మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. బోయ తిమ్మన్న(70), బోయ తిక్కమ్మ(60) చెత్త పేపర్లు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ ఆ ప్రాంతంలో అందరికీ సుపరిచితులే. బంధువులు కాకపోయినా.. అందరి యోగక్షేమాలు తెలుసుకునే మనస్తత్వం వీరి సొంతం. ఎన్నేళ్ల క్రితం కర్నూలును ఆవాసంగా మార్చుకున్నారో కానీ.. రాఘవేంద్రస్వామి ఆలయం ఎదుట రోడ్డు పక్కగా వేసుకున్న గుడిసె కాస్త నీడనిస్తోంది. వానొచ్చినా.. ఎండ కాచినా కాలు కదపనిదే కడుపునిండని జీవనం కావడంతో శుక్రవారం దంపతులిద్దరూ బతుకు ప్రయాణం కలిసే సాగించారు. ఎక్కడెక్కడో తిరిగారు.. చెత్తకుప్పల్లో పాత పేపర్లను ఏరుకుని చీకటిపడుతుండగా గూటికి చేరుకున్నారు. కాగితాలను మరుసటి రోజు గుజిరీలో విక్రయించేందుకు గుడిసెలో ఓ పక్కన పెట్టి కునుకుతీశారు. కరెంటుకు నోచుకోని వీరి గుడిసెలో ఓ దీపం వెలుగునిస్తోంది. ఆ దీపమే ఆ దంపతులను బుగ్గి చేసింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు వ్యాపించిన మంటలు చిత్తు కాగితాలు సహా ఇరువురినీ దహించివేశాయి. గాఢ నిద్రలోనే ఆ దంపతులు కన్నుమూశారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే సరికి అంతా ‘ముగిసిపోయింది’. ఆప్యాయంగా పలకరించే ఈ అవ్వాతాతలు మాంసపు ముద్దలయ్యారు. ఏమీ కాకపోయినా.. చిరునవ్వుతో పలకరించే ఆ దంపతులు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఉదయాన్నే ఇటువైపు వచ్చిన వారంతా.. కుటుంబ సభ్యులు కాకపోయినా కన్నీరుకార్చారు. ఏమి జరిగిందోనని ఆరా తీసి.. బరువెక్కిన హృదయాలతో ముందుకు కదిలారు. మృతుడు తిమ్మన్న సోదరుడు పెద్ద తిప్పన్న కుమారుడు రామాంజనేయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.