నిబంధనలకు విరుద్ధంగా శ్రీమఠం ప్రాకారంలో ఏర్పాటు చేసిన పూజా బండార్
శ్రీమఠం..శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన పవిత్ర ప్రదేశం. స్వామి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజూ భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు..శ్రీమఠంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వారిపై చర్యలు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
మంత్రాలయం (కర్నూలు): దేవదాయ శాఖ 2015 జూన్ 24వ తేదీన జారీ చేసిన జీవో 222 ప్రకారం.. మఠం, ఆలయ ప్రాకారాల్లో ఎలాంటి వ్యాపార సముదాయాలు ఉండరాదు. అలాగే ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. అయితే శ్రీమఠం ప్రాకారంలో నిబంధనలకు విరుద్ధంగా బండారు దుకాణం కొనసాగుతోంది. నెలకు రూ.5 లక్షల ప్రకారం దీనిని బాడుగకు తీసుకున్నారు. రోజూ దుకాణంలో ఎంత లేదన్నా రూ.50 వేల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. ఉత్సవాల సమయంలో రూ.3 లక్షల వరకు ఉంటోంది. మఠం ప్రాంగణంలో బండార్ ఉండటంతో భక్తులు గుడ్డిగా మోసపోతున్నారు. సదరు దుకాణం శ్రీమఠానిదేనని కొనుగోళ్లు జరుపుతున్నారు.
నిర్వాహకులు ఎవరంటే..
కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి చెందిన ఉడిపి రంగ, పరమేష్‌లు 25 ఏళ్ల క్రితం మంత్రాలయం వచ్చారు. ఒకరు మఠం ఎదుట టెంకాయల వ్యాపారం పెట్టుకోగా..ఇంకొకరు గుడి పూజారి వ్యాసరాజాచార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో కూలిగా చేరారు. మూడేళ్ల తర్వాత శాంతినికేతన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో చిన్న రీల్ క్యాసెట్ సెంటర్ పెట్టుకున్నారు. రెండేళ్లకు మరో రెండు క్యాసెట్ సెంటర్లు చేసుకున్నారు. లాభాలు పొంది 2005లో రూ.50 లక్షలు వెచ్చించి ఉడిపి హోటల్, లాడ్జీని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి శ్రీమఠంలో పీఠాధిపతుల సన్నిహితులతో పరిచయాలు పెంచుకున్నారు. 2009లో వరద తర్వాత అప్పటి పీఠాధిపతి పూర్వాశ్రమ కుమారుడు సుయమీంద్రాచార్‌తో ఉన్న పరిచయాలతో శ్రీమఠం ప్రాకారంలో పూజా బండార్ ఏర్పాటు చేశారు.ఎనిమిదేళ్లుగా పూజా బండార్ కొనసాగుతోంది. బయట మార్కెట్లో రూ.10 విలువజేసే వస్తువును ఇక్కడ రూ.60కు విక్రయించడం పరిపాటిగా మారింది.
తిలాపాపం తలా పిడికెడు..
జీవో 222 పకడ్బందీగా అమలు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులకు శ్రీమఠంలోని బండార్ దుకాణం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దుకాణ నిర్వాహకులు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు..భక్తుల దోపిడీలో అధికారులకు వాటాలు వెళ్లడం విస్మయాన్ని కల్గిస్తోంది. మఠంలో ఏ చిన్న పని కావాలన్నా ఎండోమెంట్ అధికారులు నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటూ మఠం పెద్దలు సూచిస్తారు. మరి ఇంతగా భక్తులను దోస్తున్న దుకాణానికి అనుమతులు ఎలా వచ్చాయో అంతుబట్టడం లేదు. ప్రతేడాది దుకాణానికి కచ్చితంగా బహిరంగ వేలం నిర్వహించాలి. అయితే ఆమ్యామ్యాలతో గుట్టుగా టెండర్ ముగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment