Divine Department
-
బదిలీలకు గ్రీన్ సిగ్నల్!
జోగుళాంబ శక్తిపీఠం: దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులకు ఇక స్థాన చలనం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎం.ఎస్ నెం07 విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 51ఆలయాల్లో ఇది అమలుకానుంది. గత 12 ఏళ్లుగా ఉద్యోగులు కొందరు ఒకే ఆలయంలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. మరోవైపు ఒకే ఆలయంలో పనిచేయడం వల్ల కొందరు ఉద్యోగులు అభివృద్ధికి కారకులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 51 ఆలయాల్లో మొత్తం ఉద్యోగులు 620 మంది ఉన్నారు. ఇందులో అర్చక స్వాములు 171 మంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్, వాచ్మెన్లు ఇలా వివిధ క్యాటగిరీలలో 449మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అర్చకులు మినహా ఇతర క్యాటగిరీలో ఉన్న ఉద్యోగులకు ఈ జీవో ప్రకారం బదిలీలు జరగనున్నాయి. కాగా నేటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా దాదాపు 273 మంది మాత్రమే వేతనాలు అందుకుంటున్నారు. ఇది వర్తించని వారికి కూడా బదిలీలు ఉంటాయా? లేదా అనేది ప్రశ్నార్థంగా మారింది. స్థానిక నేతల అండదండలతో... ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగులు సైతం అనేక విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అక్కడి భక్తులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన దేవాదాయ వాఖ వారిని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయినా వీరు రాజకీయ నేతల ఒత్తిడితో మళ్లీ ఉన్న చోటుకే వదిలీ చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 20శాతం మందికి తప్పనిసరి జీవో 7 ప్రకారం తొలివిడతగా 20శాతం మంది బదిలీలు కానున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని అలంçపూర్, మన్యంకొండ, కురుమూర్తి, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, జమ్ములమ్మ, బీచుపల్లి, నాయినోనిపల్లి , కకాకర్లపాడు, చిన్నరాజమూరు, గంగాపురం, ఉర్కొండపేట, మఖ్తల్, మల్దకల్, సింగవట్నం, బుద్దారం గండి, పాలెం, సిరిసనగండ్ల, చింతరేవుల, పాగుంట తదితర ఆలయాలతో ఇతర చిన్న ఆలయాల్లో కూడా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. సంతోషంలో ఉద్యోగులు భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నవారు, అలాగే ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో పనిచేస్తూ స్థానిక నేతల ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్న ఉద్యోగులు జీవో విడుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ అనిల్‌కుమార్ ఆలయాల ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతాయుతంగా పని చేస్తారు బదిలీలతోనే ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేస్తారు. ఏ శాఖలో అయినా బదిలీలు సర్వసాధారణం. ఎప్పుడూ ఒకేచోట లాంగ్‌స్టాండింగ్‌లో ఉద్యోగి పనిచేయడం సరికాదు. ఆలయాల వ్యవస్థ గాడిలో పడి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. – కృష్ణ, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ బదిలీలను స్వాగతిస్తున్నాం ఆలయాల్లో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనేవి కేవలం ఆరోపణలు మాత్రమే. పండుగలు, పబ్బాలు, భార్యాపిల్లలను వదిలి ఆలయాల్లోనే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు స్థానిక చోటామోటా లీడర్ల గొంతెమ్మ కోర్కెలను కాదనప్పుడు ఉద్యోగులపై ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం సహజమే. మేం బదిలీలను స్వాగతిస్తున్నాం. కొత్త స్థానాల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తాం. – జయపాల్ రెడ్డి, జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
అక్రమాల ‘బండారం’
శ్రీమఠం..శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన పవిత్ర ప్రదేశం. స్వామి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజూ భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు..శ్రీమఠంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వారిపై చర్యలు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మంత్రాలయం (కర్నూలు): దేవదాయ శాఖ 2015 జూన్ 24వ తేదీన జారీ చేసిన జీవో 222 ప్రకారం.. మఠం, ఆలయ ప్రాకారాల్లో ఎలాంటి వ్యాపార సముదాయాలు ఉండరాదు. అలాగే ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. అయితే శ్రీమఠం ప్రాకారంలో నిబంధనలకు విరుద్ధంగా బండారు దుకాణం కొనసాగుతోంది. నెలకు రూ.5 లక్షల ప్రకారం దీనిని బాడుగకు తీసుకున్నారు. రోజూ దుకాణంలో ఎంత లేదన్నా రూ.50 వేల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. ఉత్సవాల సమయంలో రూ.3 లక్షల వరకు ఉంటోంది. మఠం ప్రాంగణంలో బండార్ ఉండటంతో భక్తులు గుడ్డిగా మోసపోతున్నారు. సదరు దుకాణం శ్రీమఠానిదేనని కొనుగోళ్లు జరుపుతున్నారు. నిర్వాహకులు ఎవరంటే.. కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి చెందిన ఉడిపి రంగ, పరమేష్‌లు 25 ఏళ్ల క్రితం మంత్రాలయం వచ్చారు. ఒకరు మఠం ఎదుట టెంకాయల వ్యాపారం పెట్టుకోగా..ఇంకొకరు గుడి పూజారి వ్యాసరాజాచార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో కూలిగా చేరారు. మూడేళ్ల తర్వాత శాంతినికేతన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో చిన్న రీల్ క్యాసెట్ సెంటర్ పెట్టుకున్నారు. రెండేళ్లకు మరో రెండు క్యాసెట్ సెంటర్లు చేసుకున్నారు. లాభాలు పొంది 2005లో రూ.50 లక్షలు వెచ్చించి ఉడిపి హోటల్, లాడ్జీని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి శ్రీమఠంలో పీఠాధిపతుల సన్నిహితులతో పరిచయాలు పెంచుకున్నారు. 2009లో వరద తర్వాత అప్పటి పీఠాధిపతి పూర్వాశ్రమ కుమారుడు సుయమీంద్రాచార్‌తో ఉన్న పరిచయాలతో శ్రీమఠం ప్రాకారంలో పూజా బండార్ ఏర్పాటు చేశారు.ఎనిమిదేళ్లుగా పూజా బండార్ కొనసాగుతోంది. బయట మార్కెట్లో రూ.10 విలువజేసే వస్తువును ఇక్కడ రూ.60కు విక్రయించడం పరిపాటిగా మారింది. తిలాపాపం తలా పిడికెడు.. జీవో 222 పకడ్బందీగా అమలు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులకు శ్రీమఠంలోని బండార్ దుకాణం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దుకాణ నిర్వాహకులు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు..భక్తుల దోపిడీలో అధికారులకు వాటాలు వెళ్లడం విస్మయాన్ని కల్గిస్తోంది. మఠంలో ఏ చిన్న పని కావాలన్నా ఎండోమెంట్ అధికారులు నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటూ మఠం పెద్దలు సూచిస్తారు. మరి ఇంతగా భక్తులను దోస్తున్న దుకాణానికి అనుమతులు ఎలా వచ్చాయో అంతుబట్టడం లేదు. ప్రతేడాది దుకాణానికి కచ్చితంగా బహిరంగ వేలం నిర్వహించాలి. అయితే ఆమ్యామ్యాలతో గుట్టుగా టెండర్ ముగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
రోడ్డున పడేశారు!
ఒంగోలు గద్దలగుంటలో దేవాదాయశాఖ స్థలంలో ఉన్న నివాసాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమను అధికారులు రోడ్డున పడేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టే పొడిగింపు కేసు తేలక ముందే ఇళ్లను కూల్చేశారని వాపోయారు. ఒంగోలు కల్చరల్: స్థానిక గద్దలగుంట సర్వే నం. 679/2, 702/1లోని 1.59 ఎకరాల్లోని ఆక్రమణలను మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు తొలగించడంతో బాధితులు రోడ్డున పడ్డారు. గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌కు సంబంధించిన ఈ స్థలాన్ని హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయశాఖాధికారులు ప్రకటించారు. కానీ బాధితుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. తమ స్వాధీనంల ఉన్న స్థలాన్ని ఖాళీ చేసేందుకు మరికొంత గడువును కోరుతూ హైకోర్టులో వేసిన రిట్‌పిటిషన్ (డబ్లూపీఎంపీ–84751/2017) కొద్దిరోజుల్లో విచారణకు రానున్న తరుణంలో దేవాదాయశాఖాధికారులు ఇలా చేశారని ఈదుపల్లి సురేష్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఎక్కడదీ స్థలం? తిమ్మసముద్రానికి చెందిన దాత గోరంట్ల వెంకన్నకు స్థానిక గద్దలగుంటలోని సదరు సర్వే నంబర్లలో 1.59 ఎకరాలున్నాయి. పూర్వం ఆ ప్రాంతంలో పొలాలు సాగు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఈదుపల్లి కుటుంబీకులు గోరంట్ల వెంకన్న వద్ద ఆ పొలాలను కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ పొలాలను మీకే అప్పగిస్తామంటూ గోరంట్ల వెంకన్న తమ పూర్వీకులకు హామీ ఇచ్చినట్లు ఈదుపల్లి సురేష్, ఈదుపల్లి రమేష్, ఈదుపల్లి గిరి వెల్లడించారు. ఆ తర్వాత ఆ పొలాలు గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌కు బదలాయించారు. కాగా 1.59 ఎకరాల్లో ఈదుపల్లి కుటుంబీకులు చాలా కాలం పాటు కూరగాయలు సాగు చేసుకుంటూ వచ్చారు. 1994 వరకు ఈ స్థలానికి సంబంధించి పన్ను కూడా చెల్లించారు. అయితే ఆ తర్వాత మున్సిపల్ అధికారులు పన్ను కట్టించుకోవడం మానివేసినట్లు బాధితులు వెల్లడించారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు దేవాదాయశాఖాధికారులు పలుమార్లు ప్రయత్నాలు చేశారు. కొన్ని సందర్భాల్లో తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. అయితే రెండు దశాబ్దాలుగా దేవాదాయశాఖాధికారుల నుంచి ఏ విధమైన ఒత్తిడి లేకపోవడంతో బాధితులు ఆ స్థలంలో చిన్న ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నట్టుండి ఈ ఏడాది మార్చిలో ఆక్రమణదారులను ఖాళీ చేయించడం కోసం దేవాదాయశాఖాధికారులు రంగంలోకి దిగారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో అక్టోబర్ 30వ తేదీ వరకు వారిని ఖాళీ చేయించవద్దంటూ ఉన్నత న్యాయస్థానం స్టే ఉత్తర్వులు జారీ చేసిందని ఈదుపల్లి సురేష్ పేర్కొన్నారు. స్టే గడువును మరికొంత కాలం పొడిగించాలని కోరుతూ తాము కోర్టులో మళ్లీ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశామని, అది విచారణకు రానున్న దశలో జేసీబీలతో తమ గృహాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు కుటుంబాలకు చెందిన 34 మంది ఇప్పుడు నిరాశ్రయులుగా మారారు. గతంలో ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను కేటాయించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, శాసనమండలి సభ్యుడు కరణం బలరాం తదితరులను కలిసి కోరినా స్పందించలేదని బాధితులు వాపోయారు. ఆరోపణల్లో వాస్తవం లేదు: యార్లగడ్డ నాగేశ్వరరావు, గోరంట్ల వెంకన్న ట్రస్ట్ ఈఓ గోరంట్ల వెంకన్న ట్రస్ట్ భూములను ఆక్రమించుకున్న వారిని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకే ఖాళీ చేయించాం. స్థలాన్ని ఖాళీ చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి ఆక్రమణదారులకు రెండుసార్లు రిజిస్టర్డ్ పోస్టులో ఉత్తర్వులు పంపినప్పటికీ వాటిని తీసుకోవడానికి వారు నిరాకరించడంతో అవి తిరిగి వచ్చాయి. స్టే ఉత్తర్వుల పొడిగింపుపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఆక్రమణల తొలగింపు ఒంగోలు కల్చరల్: స్థానిక గద్దలగుంటలోని సర్వే నంబర్లు 697 /2, 702 /1 లోని ఆక్రమణలను దేవాదాయ శాఖ అధికారులు పోలీస్, రెవెన్యూ విభాగాల సహకారంతో మంగళవారం తొలగించారు. పై సర్వే నంబర్లలోని 1.59 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ స్థలంలో ఉన్న కట్టడాలను, గృహాలను తొలగించి ఆక్రమణదారులను ఖాళీ చేయించారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా అధికారులు, ఆక్రమణదారుల నడుమ వాగ్వాదం జరిగింది. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ పలువురు విలపించారు. గతంలోనే ఆక్రమణల తొలగింపును దేవాదాయ శాఖ అధికారులు చేపట్టగా ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్టోబరు 30లోగా ఆక్రమణదారులు ఖాళీ చేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా వారు ఖాళీ చేయకపోవడంతో దేవాదాయ శాఖ అధికారులు పూనుకుని ఆక్రమణలను జేసీబీతో తొలగించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థలాన్ని చదును చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులు చర్యలు తీసుకున్నారు. గోరంట్ల వెంకన్న ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ నాగేశ్వరరావు, ఒంగోలు రాజరాజేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బోడపాటి శ్రీనివాసరావు, అద్దంకి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి, పలువురు కార్యనిర్వహణా«ధికారులు, సిబ్బంది ఆక్రమణల తొలగింపులో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూదేవాదాయ శాఖకు చెందిన స్థలాలను, భూములను ఎవరైనా ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. -
దేవాదాయ శాఖలో‘అక్రమ ఉద్యోగాలు’
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకాలను అంగట్లో కూరగాయల బేరంగా మార్చేసిన వ్యవహారం గుట్టురట్టయింది. నియామకాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆధారాలతో సహా బట్టబయలైంది. ఉద్యోగుల నియామకాలపై ప్రభుత్వ నిషేధం ఉన్నా దాదాపు 1,500 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించినట్లు తెలిసింది. కానీ ఆ వ్యవహారం బయటకొస్తే అవినీతి తేనెతుట్టెను కుదిపినట్టవుతుందని తొక్కిపెట్టి లోలోపలే సర్దే ప్రయత్నం జరుగుతోంది. దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. ఉద్యోగుల వివరాలు క్రోడీకరిస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నియమించిన వారికి వేతన సవరణ జరిపితే న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉండటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అలా అని వారిపై చర్యలు తీసుకుంటే సమస్యవుతుందని ఆందోళన చెందుతున్న అధికారులు గుట్టుగా వారిని రెగ్యులరైజ్ చేసి.. దేవాదాయ శాఖ పరువు బజారున పడకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇదీ వ్యవహారం దేవాదాయ శాఖలో ఉద్యోగాల నియామకాలను సర్వీస్ రూల్స్ ప్రకారం జరపాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు సర్కారు ఖజానా నుంచి, ఆలయ పాలక మండళ్లు నియమించిన వారికి ఆలయ ఆదాయం నుంచే జీతాలందుతాయి. దేవాదాయ శాఖ చట్టం 30–87 సెక్షన్ 57 ప్రకారం.. ఆలయం మొత్తం ఆదాయంలో జీతభత్యాలు 30 శాతం మించటానికి వీల్లేదు. ఆ ప్రకారమే ఉద్యోగులను నియమించుకోవాలి. కానీ.. ఓ ఉన్నతాధికారి మాత్రం కింది స్థాయి అధికారులతో మిలాఖత్ అయి పోస్టుకు ఇంత ధర అని ఫిక్స్ చేసి అమ్మేసుకున్నాడు. దేవరయాంజాల్ ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశాడు. 2006లో ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అక్రమంగా నియమించినట్లు తేలడంతో వారిని తొలగించి కొత్త నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకంపై నిషేధం అమలులోకి వచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వ అనుమతితో కొన్ని పోస్టులు భర్తీ చేయటం మినహా నియామకాలు చేపట్టలేదు. ‘వేతన సవరణ’తో వెలుగులోకి.. వేతన సవరణ చేయాలంటూ దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యమం జరిగింది. రెండేళ్ల పోరాటం తర్వాత ఇటేవలే సీఎం ఆ డిమాండ్‌ను అంగీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో (ఖజానా నుంచి కాదు) వారికి కూడా వేతనాలు చెల్లించేందుకు అంగీకరించారు. ఆ కసరత్తులో భాగంగా ఆలయ అర్చకులు, ఉద్యోగుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఒక్కొక్కరి వివరాలు పొందుపరిచే క్రమంలో 2006 తర్వాత నియమితులైన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారి సంఖ్యను లెక్కిస్తూపోగా అది 1,500 వరకు ఉన్నట్లు తేలిందని విశ్వసనీయ సమాచారం. దేవాలయాల పాలక మండళ్లు, అధికారులు కూడబలుక్కుని ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అడ్డదారిలో వీరిని నియమించినట్లు అధికారులు గుర్తించారు. దేవాలయ ఆదాయం నుంచే వారికి వేతనాలు చెల్లిస్తుండటంతో ప్రభుత్వం గుర్తించలేకపోయింది. 30 శాతం దాటిన జీతభత్యాల పద్దు దేవాలయం ఆదాయంలో జీతభత్యాల ఖర్చు 30 శాతం మించకూడదనే నిబంధన అపహాస్యం పాలైంది. సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో ఆ పద్దు 60 శాతంగా ఉంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలోనూ అదేరీతిలో ఉంది. ఇలా అనేక దేవాలయాల్లో అక్రమ ఉద్యోగులతో జీతభత్యాల ఖర్చు భారీగా పెరిగింది. వీటిపై సర్కారు దృష్టి సారించకపోవటంతో ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. పద్దు పెరగడం.. ఆలయ నిర్వహణ ఖర్చులుపోను జీతాలకు డబ్బుల్లేకపోవడంతోనే వేతన సవరణ డిమాండ్ రావటం విశేషం. నియమకాలు ఎలా జరపాలి..? పెద్ద దేవాలయాల్లో నియామకాలు జరపాలంటే అధికారులు ఖాళీల సంఖ్య, ఏ స్థాయి సిబ్బంది అవసరమో వివరిస్తూ ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజికి సమాచారం ఇవ్వాలి. పోస్టుల సంఖ్య ఆధారంగా దామాషా పద్ధతిన సీనియారిటీ ఉన్న అభ్యర్థుల వివరాలను ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ పంపుతుంది. వారికి అర్హత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయాలి. ఇక చిన్న దేవాలయాల్లో అయితే.. ఎన్ని పోస్టులు అవసరమో సంబంధిత అథారిటీ నిర్ధారించాలి. వాటి భర్తీకి ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వక అనుమతి పొందాలి. 6సీ స్థాయి దేవాలయమైతే అసిస్టెంట్ కమిషనర్, 6బీ స్థాయి దేవాలయమైతే డిప్యూటీ కమిషనర్, 6ఏ స్థాయి దేవాలయమైతే కమిషనర్ నుంచి లిఖితపూర్వక అనుమతి పొంది నియామక ప్రక్రియ నిర్వహించాలి. తర్వాత రాటిఫికేషన్ చేయించుకోవాలి. -
రిసార్ట్స్‌పై ఎందుకో ప్రేమ!
►ప్రేమసమాజం భూములు ధారాదత్తం ►అప్పనంగా దోచిపెట్టిన ప్రభుత్వం ►ఏడాదికి రూ2.62 లక్షలకే 33 ఏళ్లకు లీజు ►రూ.500 కోట్ల విలువైన భూమి ►తాబేదార్లకు కట్టబెట్టిన వైనం ప్రభుత్వ.. ప్రైవేటు భూములనే కాదు..చివరకు స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన భూములను సైతం వదలడం లేదు. గెద్దల్లా తన్నుకుపోతున్నారు. తాజాగా విశాఖలోని ఓ సేవా సంస్థకు చెందిన కోట్ల విలువైన భూములను తమ తాబేదార్లకు అప్పనంగా దోచిపెడుతూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం : విశాఖలో ఏడు దశాబ్దాలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ప్రేమ సమాజానికి 1959లో రావు అండ్ కంపెనీ అ«ధినేత చెరువు ప్రసాదరావు సుమారు 50 ఎకరాల భూమిని అందజేశారు. రుషికొండలోని సర్వే నెం.16, 23, 24ల్లో ఈ భూమికి పట్టా రాయించి మరీ ఇచ్చారు. 1971లో జిల్లా సర్వే అధికారి ద్వారా సర్వే చేయిస్తే నికరంగా 47.33ఎకరాలు అక్కడ ఉన్నట్టు తేలింది. దేవాదాయశాఖ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా 2003– 04లో అప్పటి ప్రేమ సమాజం కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించి సాయి ప్రియా రిసార్ట్స్‌కు 33 ఏళ్లకు 33.70 ఎకరాలు లీజు ఇచ్చారు. ఆ తరువాత దేవాదాయశాఖ ఆకస్మికంగా తెరపైకి వచ్చి ఈ భూములన్నీ తమ శాఖకు చెందినవని, ఏ విధంగా లీజుకు ఇస్తారంటూ ప్రేమసమాజానికి అప్పట్లో నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రేమసమాజానికి చెందిన ఈ ఆస్తులపై దేవాదాయశాఖ పెత్తనం చేయడం మొదలు పెట్టింది. ఈ వ్యవహారంపై సంస్థ ప్రతినిధులు కొంతమంది కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ భూమిపై సర్వ హక్కులు ప్రేమ సమాజానికే ఉన్నాయంటూ హైకోర్టు సైతం పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ భూములు దేవాదాయశాఖకే చెందుతాయని అప్పటి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఈవీ పుష్పవర్ధన్ నోటీసు బోర్డులు పెట్టించారు. రెండు శాఖల పోరాటం హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ భూముల్లో గోశాల, లెప్రసీ కేర్ సెంటర్, ఆర్గానిక్ ఫార్మింగ్, వృద్ధాశ్రమం, సెంటర్ ఫర్ ఒకేషనల్ సర్వీస్, హిందూ కల్చరల్ స్కూల్ నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ప్రేమసమాజం ప్రతినిధులు యత్నించారు. అయితే రిసార్ట్స్ యాజమాన్యం భూమి పూజ జరగకుండా అడ్డుకుంది. అప్పటి నుంచి ఈ భూముల కోసం ఇటు ప్రేమ సమాజం..అటు దేవాదాయ శాఖ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాయి.అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిడి మేరకు ఈ భూములను సాయిప్రియా రిసార్ట్స్‌కే ఇచ్చేందుకు దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ఈ భూములను 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో ఎం. నెం.161ను జారీ చేసింది. 2003–04లోనే లీజుకు తీసుకున్నందున గడిచిన 13 ఏళ్లను లీజు కాలపరిమితిగానే పరిగణిస్తూ మిగిలిన 20 ఏళ్లకు ఏడాదికి రూ.2.62 లక్షల చొప్పున రూ.19.06 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి రూ.40 వేలకు పైగా పలుకుతోంది.అంటే 33.70 ఎకరాల భూమి ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదు వందల కోట్లకు పైగానే విలువుంటుందని అంచనా. విచిత్రమేమిటంటే 2003లో కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ భూములను అప్పటి ప్రేమసమాజం కార్యదర్శిని ప్రలోభపెట్టి సాయిప్రియా రిసార్ట్స్ లీజుకు తీసుకుంది. తిరిగి మళ్లీ నేడు చంద్రబాబు అధికారంలోనే ఈ భూములను అధికారికంగా ఈ రిసార్ట్స్‌కు కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.