రిసార్ట్స్‌పై ఎందుకో ప్రేమ! | Love on the resorts! | Sakshi
Sakshi News home page

రిసార్ట్స్‌పై ఎందుకో ప్రేమ!

Published Fri, May 5 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

రిసార్ట్స్‌పై ఎందుకో ప్రేమ!

రిసార్ట్స్‌పై ఎందుకో ప్రేమ!

ప్రేమసమాజం భూములు ధారాదత్తం
అప్పనంగా దోచిపెట్టిన ప్రభుత్వం
ఏడాదికి రూ2.62 లక్షలకే 33 ఏళ్లకు లీజు
రూ.500 కోట్ల విలువైన భూమి
తాబేదార్లకు కట్టబెట్టిన వైనం


ప్రభుత్వ.. ప్రైవేటు భూములనే కాదు..చివరకు స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన భూములను సైతం వదలడం లేదు. గెద్దల్లా తన్నుకుపోతున్నారు. తాజాగా  విశాఖలోని ఓ సేవా సంస్థకు చెందిన కోట్ల విలువైన భూములను తమ తాబేదార్లకు అప్పనంగా దోచిపెడుతూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖపట్నం : విశాఖలో ఏడు దశాబ్దాలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ప్రేమ సమాజానికి 1959లో రావు అండ్‌ కంపెనీ అ«ధినేత చెరువు ప్రసాదరావు సుమారు 50 ఎకరాల భూమిని అందజేశారు. రుషికొండలోని సర్వే నెం.16, 23, 24ల్లో ఈ భూమికి పట్టా రాయించి మరీ ఇచ్చారు. 1971లో జిల్లా సర్వే అధికారి ద్వారా సర్వే చేయిస్తే నికరంగా 47.33ఎకరాలు అక్కడ ఉన్నట్టు  తేలింది. దేవాదాయశాఖ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా 2003– 04లో అప్పటి ప్రేమ సమాజం కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించి సాయి ప్రియా రిసార్ట్స్‌కు 33 ఏళ్లకు 33.70 ఎకరాలు లీజు ఇచ్చారు.   

ఆ తరువాత  దేవాదాయశాఖ ఆకస్మికంగా  తెరపైకి వచ్చి ఈ భూములన్నీ తమ శాఖకు చెందినవని, ఏ విధంగా లీజుకు ఇస్తారంటూ  ప్రేమసమాజానికి అప్పట్లో   నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రేమసమాజానికి చెందిన ఈ ఆస్తులపై దేవాదాయశాఖ పెత్తనం చేయడం మొదలు పెట్టింది. ఈ వ్యవహారంపై సంస్థ ప్రతినిధులు కొంతమంది కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ భూమిపై సర్వ హక్కులు ప్రేమ సమాజానికే ఉన్నాయంటూ హైకోర్టు సైతం పర్మినెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. అయినప్పటికీ ఈ భూములు దేవాదాయశాఖకే చెందుతాయని అప్పటి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ ఈవీ పుష్పవర్ధన్‌ నోటీసు బోర్డులు పెట్టించారు.

రెండు శాఖల పోరాటం
హైకోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో ఈ భూముల్లో గోశాల, లెప్రసీ కేర్‌ సెంటర్, ఆర్గానిక్‌ ఫార్మింగ్, వృద్ధాశ్రమం, సెంటర్‌ ఫర్‌ ఒకేషనల్‌ సర్వీస్, హిందూ కల్చరల్‌ స్కూల్‌ నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ప్రేమసమాజం ప్రతినిధులు యత్నించారు. అయితే రిసార్ట్స్‌ యాజమాన్యం భూమి పూజ జరగకుండా అడ్డుకుంది. అప్పటి నుంచి ఈ భూముల కోసం ఇటు ప్రేమ సమాజం..అటు దేవాదాయ శాఖ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాయి.అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిడి మేరకు ఈ భూములను సాయిప్రియా రిసార్ట్స్‌కే ఇచ్చేందుకు దేవాదాయశాఖ కమిషనర్‌ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ఈ భూములను 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో ఎం. నెం.161ను జారీ చేసింది.

2003–04లోనే లీజుకు తీసుకున్నందున గడిచిన 13 ఏళ్లను లీజు కాలపరిమితిగానే పరిగణిస్తూ మిగిలిన 20 ఏళ్లకు ఏడాదికి రూ.2.62 లక్షల చొప్పున రూ.19.06 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి రూ.40 వేలకు పైగా పలుకుతోంది.అంటే 33.70 ఎకరాల భూమి ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదు వందల కోట్లకు పైగానే విలువుంటుందని అంచనా. విచిత్రమేమిటంటే 2003లో కూడా  చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ భూములను అప్పటి ప్రేమసమాజం కార్యదర్శిని ప్రలోభపెట్టి సాయిప్రియా రిసార్ట్స్‌ లీజుకు తీసుకుంది. తిరిగి మళ్లీ నేడు చంద్రబాబు అధికారంలోనే ఈ భూములను అధికారికంగా ఈ రిసార్ట్స్‌కు కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement