Voluntary service organization
-
ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు
ఈ ఏడాది సెప్టెంబర్ 25న గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కనుమరుగయ్యారు కానీ పాటల రూపంలో అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. ఆయనకు నివాళిగా తమిళనాడులోని కోయంబత్తూరులో ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్.పి.బి. వనం’ పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. అక్టోబర్‌లో ఈ వనం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. గత వారం ఆవిష్కరించారు. చనిపోయే నాటికి బాలు వయసు 74. ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాటను పేరుగా పెట్టడం విశేషం. మొక్కలన్నింటినీ ‘ట్రెబల్ క్లెఫ్’ (సంగీత స్వర చిహ్నం) ఆకారంలో నాటారు. అలాగే సంగీత వాద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కలివి. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాళయంలో 1.8 ఎకరాల ఈ వనంలో లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని ‘సిరు తుళి’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఈ వనం ఆవిష్కరణ వేడుకలో బాలు కుమారుడు ఎస్.పి. చరణ్, సోదరి ఎస్.పి. శైలజ వర్చ్యువల్‌గా పాల్గొన్నారు. -
బాల సదనంలో చిన్నారిపై లైంగిక దాడి
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో స్త్రీ శిశుసంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదనంలో ఓ చిన్నారిపై లైంగిక దాడి, మరో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాల సదనానికి వెళ్లిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు బాధిత చిన్నారులు విషయాన్ని చెప్పడంతో వారు గురువారం కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాల సదనంలో పదేళ్ల వయసున్న చిన్నారులు చదువుకుంటున్నారు. వివిధ స్వచ్ఛంద సేవాసంస్థలకు చెందిన ఎన్జీవోలు పిల్లల ఆలనాపాలనా చూడడంతో పాటు.. ఏ ప్రాంతంలోనైనా అనాథ బాలలు కనిపిస్తే తీసుకొచ్చి ఈ సదనంలో చేర్చుతారు. ఇదే తరహాలో 17వ తేదీన ‘లవ్ టూ సర్వే ఫౌండేషన్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’కు చెందిన ప్రతినిధులు ఇద్దరు అనాథ చిన్నారులను సదనంలో చేర్చేందుకు వచ్చారు. అదే సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ వచ్చి 16వ తేదీ అర్ధరాత్రి ఓ యువకుడు వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని, మరో చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా చెయ్యిని గట్టిగా కొరకడంతో వదిలేసి పారిపోయాడని చెప్పారు. నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదని విలపించారు. దీంతో నివ్వెరపోయిన ఎన్జీవో ప్రతినిధులు ఈ ఘటనపై బాల సదనం నిర్వాహకులను నిలదీయగా వారు ఎన్జీవో ప్రతినిధులపైనే చిర్రుబుర్రులాడారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తి పనే.. విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పద్మావతి బాల సదనానికి వచ్చి అప్పటికే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల జగ్గంపేట, కాకినాడ దమ్ములపేట తదితర ప్రాంతాల్లో చిన్నారులపై జరిగిన అత్యాచార కేసుల పరిశీలన నిమిత్తం వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబులు కూడా బాలసదనం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధిత చిన్నారితో తాము మాట్లాడామని ఇది తెలిసిన వ్యక్తి పనేనని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.నాగమురళి తెలిపారు. -
రిసార్ట్స్‌పై ఎందుకో ప్రేమ!
►ప్రేమసమాజం భూములు ధారాదత్తం ►అప్పనంగా దోచిపెట్టిన ప్రభుత్వం ►ఏడాదికి రూ2.62 లక్షలకే 33 ఏళ్లకు లీజు ►రూ.500 కోట్ల విలువైన భూమి ►తాబేదార్లకు కట్టబెట్టిన వైనం ప్రభుత్వ.. ప్రైవేటు భూములనే కాదు..చివరకు స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన భూములను సైతం వదలడం లేదు. గెద్దల్లా తన్నుకుపోతున్నారు. తాజాగా విశాఖలోని ఓ సేవా సంస్థకు చెందిన కోట్ల విలువైన భూములను తమ తాబేదార్లకు అప్పనంగా దోచిపెడుతూ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం : విశాఖలో ఏడు దశాబ్దాలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ప్రేమ సమాజానికి 1959లో రావు అండ్ కంపెనీ అ«ధినేత చెరువు ప్రసాదరావు సుమారు 50 ఎకరాల భూమిని అందజేశారు. రుషికొండలోని సర్వే నెం.16, 23, 24ల్లో ఈ భూమికి పట్టా రాయించి మరీ ఇచ్చారు. 1971లో జిల్లా సర్వే అధికారి ద్వారా సర్వే చేయిస్తే నికరంగా 47.33ఎకరాలు అక్కడ ఉన్నట్టు తేలింది. దేవాదాయశాఖ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా 2003– 04లో అప్పటి ప్రేమ సమాజం కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించి సాయి ప్రియా రిసార్ట్స్‌కు 33 ఏళ్లకు 33.70 ఎకరాలు లీజు ఇచ్చారు. ఆ తరువాత దేవాదాయశాఖ ఆకస్మికంగా తెరపైకి వచ్చి ఈ భూములన్నీ తమ శాఖకు చెందినవని, ఏ విధంగా లీజుకు ఇస్తారంటూ ప్రేమసమాజానికి అప్పట్లో నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రేమసమాజానికి చెందిన ఈ ఆస్తులపై దేవాదాయశాఖ పెత్తనం చేయడం మొదలు పెట్టింది. ఈ వ్యవహారంపై సంస్థ ప్రతినిధులు కొంతమంది కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ భూమిపై సర్వ హక్కులు ప్రేమ సమాజానికే ఉన్నాయంటూ హైకోర్టు సైతం పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ భూములు దేవాదాయశాఖకే చెందుతాయని అప్పటి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఈవీ పుష్పవర్ధన్ నోటీసు బోర్డులు పెట్టించారు. రెండు శాఖల పోరాటం హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ భూముల్లో గోశాల, లెప్రసీ కేర్ సెంటర్, ఆర్గానిక్ ఫార్మింగ్, వృద్ధాశ్రమం, సెంటర్ ఫర్ ఒకేషనల్ సర్వీస్, హిందూ కల్చరల్ స్కూల్ నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ప్రేమసమాజం ప్రతినిధులు యత్నించారు. అయితే రిసార్ట్స్ యాజమాన్యం భూమి పూజ జరగకుండా అడ్డుకుంది. అప్పటి నుంచి ఈ భూముల కోసం ఇటు ప్రేమ సమాజం..అటు దేవాదాయ శాఖ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాయి.అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిడి మేరకు ఈ భూములను సాయిప్రియా రిసార్ట్స్‌కే ఇచ్చేందుకు దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ఈ భూములను 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో ఎం. నెం.161ను జారీ చేసింది. 2003–04లోనే లీజుకు తీసుకున్నందున గడిచిన 13 ఏళ్లను లీజు కాలపరిమితిగానే పరిగణిస్తూ మిగిలిన 20 ఏళ్లకు ఏడాదికి రూ.2.62 లక్షల చొప్పున రూ.19.06 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి రూ.40 వేలకు పైగా పలుకుతోంది.అంటే 33.70 ఎకరాల భూమి ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఐదు వందల కోట్లకు పైగానే విలువుంటుందని అంచనా. విచిత్రమేమిటంటే 2003లో కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ భూములను అప్పటి ప్రేమసమాజం కార్యదర్శిని ప్రలోభపెట్టి సాయిప్రియా రిసార్ట్స్ లీజుకు తీసుకుంది. తిరిగి మళ్లీ నేడు చంద్రబాబు అధికారంలోనే ఈ భూములను అధికారికంగా ఈ రిసార్ట్స్‌కు కట్టబెడుతూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.