అలంపూర్ జోగుళాంబ ఆలయం
జోగుళాంబ శక్తిపీఠం: దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులకు ఇక స్థాన చలనం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎం.ఎస్ నెం07 విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 51ఆలయాల్లో ఇది అమలుకానుంది. గత 12 ఏళ్లుగా ఉద్యోగులు కొందరు ఒకే ఆలయంలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. మరోవైపు ఒకే ఆలయంలో పనిచేయడం వల్ల కొందరు ఉద్యోగులు అభివృద్ధికి కారకులయ్యారు.
ఉమ్మడి జిల్లాలోని 51 ఆలయాల్లో మొత్తం ఉద్యోగులు 620 మంది ఉన్నారు. ఇందులో అర్చక స్వాములు 171 మంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్‌లు, సీనియర్ అసిస్టెంట్‌లు, రికార్డు అసిస్టెంట్‌లు, అటెండర్, వాచ్‌మెన్‌లు ఇలా వివిధ క్యాటగిరీలలో 449మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అర్చకులు మినహా ఇతర క్యాటగిరీలో ఉన్న ఉద్యోగులకు ఈ జీవో ప్రకారం బదిలీలు జరగనున్నాయి. కాగా నేటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా దాదాపు 273 మంది మాత్రమే వేతనాలు అందుకుంటున్నారు. ఇది వర్తించని వారికి కూడా బదిలీలు ఉంటాయా? లేదా అనేది ప్రశ్నార్థంగా మారింది.
స్థానిక నేతల అండదండలతో...
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగులు సైతం అనేక విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అక్కడి భక్తులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన దేవాదాయ వాఖ వారిని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయినా వీరు రాజకీయ నేతల ఒత్తిడితో మళ్లీ ఉన్న చోటుకే వదిలీ చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
20శాతం మందికి తప్పనిసరి
జీవో 7 ప్రకారం తొలివిడతగా 20శాతం మంది బదిలీలు కానున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని అలంçపూర్, మన్యంకొండ, కురుమూర్తి, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, జమ్ములమ్మ, బీచుపల్లి, నాయినోనిపల్లి , కకాకర్లపాడు, చిన్నరాజమూరు, గంగాపురం, ఉర్కొండపేట, మఖ్తల్, మల్దకల్, సింగవట్నం, బుద్దారం గండి, పాలెం, సిరిసనగండ్ల, చింతరేవుల, పాగుంట తదితర ఆలయాలతో ఇతర చిన్న ఆలయాల్లో కూడా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.
సంతోషంలో ఉద్యోగులు
భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నవారు, అలాగే ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో పనిచేస్తూ స్థానిక నేతల ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్న ఉద్యోగులు జీవో విడుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ అనిల్‌కుమార్ ఆలయాల ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
బాధ్యతాయుతంగా పని చేస్తారు
బదిలీలతోనే ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేస్తారు. ఏ శాఖలో అయినా బదిలీలు సర్వసాధారణం. ఎప్పుడూ ఒకేచోట లాంగ్‌స్టాండింగ్‌లో ఉద్యోగి పనిచేయడం సరికాదు. ఆలయాల వ్యవస్థ గాడిలో పడి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. – కృష్ణ, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ
బదిలీలను స్వాగతిస్తున్నాం
ఆలయాల్లో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనేవి కేవలం ఆరోపణలు మాత్రమే. పండుగలు, పబ్బాలు, భార్యాపిల్లలను వదిలి ఆలయాల్లోనే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు స్థానిక చోటామోటా లీడర్ల గొంతెమ్మ కోర్కెలను కాదనప్పుడు ఉద్యోగులపై ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం సహజమే. మేం బదిలీలను స్వాగతిస్తున్నాం. కొత్త స్థానాల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తాం. – జయపాల్ రెడ్డి, జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment