రోడ్డున పడేశారు! | homes collapsed in gaddalagunta temple place stay case still in highcourt | Sakshi
Sakshi News home page

రోడ్డున పడేశారు!

Published Wed, Nov 29 2017 12:53 PM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

homes collapsed in gaddalagunta temple place stay case still in highcourt - Sakshi

ఇళ్లలోని సామగ్రిని రోడ్డు పక్కన పెడుతున్న కూలీలు , అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళ

ఒంగోలు గద్దలగుంటలో దేవాదాయశాఖ స్థలంలో ఉన్న నివాసాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమను అధికారులు రోడ్డున పడేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టే పొడిగింపు కేసు తేలక ముందే ఇళ్లను కూల్చేశారని వాపోయారు.

ఒంగోలు కల్చరల్‌: స్థానిక గద్దలగుంట సర్వే నం. 679/2, 702/1లోని 1.59 ఎకరాల్లోని ఆక్రమణలను మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు  తొలగించడంతో బాధితులు రోడ్డున పడ్డారు. గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌కు సంబంధించిన ఈ స్థలాన్ని హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు దేవాదాయశాఖాధికారులు ప్రకటించారు. కానీ బాధితుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. తమ స్వాధీనంల ఉన్న స్థలాన్ని ఖాళీ చేసేందుకు మరికొంత గడువును కోరుతూ హైకోర్టులో వేసిన రిట్‌పిటిషన్‌ (డబ్లూపీఎంపీ–84751/2017) కొద్దిరోజుల్లో విచారణకు రానున్న తరుణంలో దేవాదాయశాఖాధికారులు ఇలా చేశారని ఈదుపల్లి సురేష్‌ ‘సాక్షి’కి వెల్లడించారు.

ఎక్కడదీ స్థలం?
తిమ్మసముద్రానికి చెందిన దాత గోరంట్ల వెంకన్నకు స్థానిక గద్దలగుంటలోని సదరు సర్వే నంబర్లలో 1.59 ఎకరాలున్నాయి. పూర్వం ఆ ప్రాంతంలో పొలాలు సాగు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఈదుపల్లి కుటుంబీకులు గోరంట్ల వెంకన్న వద్ద ఆ పొలాలను కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ వచ్చారు. అయితే ఆ  పొలాలను మీకే అప్పగిస్తామంటూ గోరంట్ల వెంకన్న తమ పూర్వీకులకు హామీ ఇచ్చినట్లు ఈదుపల్లి సురేష్, ఈదుపల్లి రమేష్, ఈదుపల్లి గిరి వెల్లడించారు. ఆ తర్వాత ఆ పొలాలు గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌కు బదలాయించారు. కాగా 1.59 ఎకరాల్లో ఈదుపల్లి కుటుంబీకులు చాలా కాలం పాటు కూరగాయలు సాగు చేసుకుంటూ వచ్చారు. 1994 వరకు ఈ స్థలానికి సంబంధించి పన్ను కూడా చెల్లించారు. అయితే ఆ తర్వాత మున్సిపల్‌ అధికారులు పన్ను కట్టించుకోవడం మానివేసినట్లు బాధితులు వెల్లడించారు.

ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు దేవాదాయశాఖాధికారులు పలుమార్లు ప్రయత్నాలు చేశారు. కొన్ని సందర్భాల్లో తీర్పు దేవాదాయశాఖకు అనుకూలంగా వచ్చింది. అయితే రెండు దశాబ్దాలుగా దేవాదాయశాఖాధికారుల నుంచి ఏ విధమైన ఒత్తిడి లేకపోవడంతో బాధితులు ఆ స్థలంలో చిన్న ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నట్టుండి ఈ ఏడాది మార్చిలో ఆక్రమణదారులను ఖాళీ చేయించడం కోసం దేవాదాయశాఖాధికారులు  రంగంలోకి దిగారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో అక్టోబర్‌ 30వ తేదీ వరకు వారిని ఖాళీ చేయించవద్దంటూ ఉన్నత న్యాయస్థానం స్టే ఉత్తర్వులు జారీ చేసిందని ఈదుపల్లి సురేష్‌ పేర్కొన్నారు. స్టే గడువును మరికొంత కాలం పొడిగించాలని కోరుతూ తాము కోర్టులో మళ్లీ రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశామని, అది విచారణకు రానున్న దశలో జేసీబీలతో తమ గృహాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు కుటుంబాలకు చెందిన 34 మంది ఇప్పుడు నిరాశ్రయులుగా మారారు. గతంలో  ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను కేటాయించాలని  ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, శాసనమండలి సభ్యుడు కరణం బలరాం తదితరులను కలిసి కోరినా స్పందించలేదని బాధితులు వాపోయారు.

ఆరోపణల్లో వాస్తవం లేదు: యార్లగడ్డ నాగేశ్వరరావు, గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌ ఈఓ గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌ భూములను ఆక్రమించుకున్న వారిని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకే ఖాళీ చేయించాం. స్థలాన్ని ఖాళీ చేయాలని కోరుతూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆక్రమణదారులకు రెండుసార్లు రిజిస్టర్డ్‌ పోస్టులో ఉత్తర్వులు పంపినప్పటికీ వాటిని తీసుకోవడానికి వారు నిరాకరించడంతో అవి తిరిగి వచ్చాయి. స్టే ఉత్తర్వుల పొడిగింపుపై మాకు ఎలాంటి సమాచారం లేదు.  

ఆక్రమణల తొలగింపు
ఒంగోలు కల్చరల్‌: స్థానిక గద్దలగుంటలోని సర్వే నంబర్లు 697 /2, 702 /1 లోని ఆక్రమణలను దేవాదాయ శాఖ అధికారులు పోలీస్, రెవెన్యూ విభాగాల సహకారంతో మంగళవారం తొలగించారు. పై సర్వే నంబర్లలోని 1.59 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ వెండిదండి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ స్థలంలో ఉన్న కట్టడాలను, గృహాలను తొలగించి ఆక్రమణదారులను ఖాళీ చేయించారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా అధికారులు, ఆక్రమణదారుల నడుమ వాగ్వాదం జరిగింది. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ పలువురు విలపించారు. గతంలోనే ఆక్రమణల తొలగింపును దేవాదాయ శాఖ అధికారులు చేపట్టగా ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్టోబరు 30లోగా ఆక్రమణదారులు ఖాళీ చేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా వారు ఖాళీ చేయకపోవడంతో దేవాదాయ శాఖ అధికారులు పూనుకుని ఆక్రమణలను జేసీబీతో తొలగించి సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

స్థలాన్ని చదును చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులు చర్యలు తీసుకున్నారు. గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ నాగేశ్వరరావు, ఒంగోలు రాజరాజేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బోడపాటి శ్రీనివాసరావు, అద్దంకి దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ప్రసన్నలక్ష్మి, పలువురు కార్యనిర్వహణా«ధికారులు, సిబ్బంది ఆక్రమణల తొలగింపులో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌  వెండిదండి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూదేవాదాయ శాఖకు చెందిన స్థలాలను, భూములను ఎవరైనా ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement