సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకాలను అంగట్లో కూరగాయల బేరంగా మార్చేసిన వ్యవహారం గుట్టురట్టయింది. నియామకాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఆధారాలతో సహా బట్టబయలైంది. ఉద్యోగుల నియామకాలపై ప్రభుత్వ నిషేధం ఉన్నా దాదాపు 1,500 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించినట్లు తెలిసింది. కానీ ఆ వ్యవహారం బయటకొస్తే అవినీతి తేనెతుట్టెను కుదిపినట్టవుతుందని తొక్కిపెట్టి లోలోపలే సర్దే ప్రయత్నం జరుగుతోంది. దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. ఉద్యోగుల వివరాలు క్రోడీకరిస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నియమించిన వారికి వేతన సవరణ జరిపితే న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉండటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అలా అని వారిపై చర్యలు తీసుకుంటే సమస్యవుతుందని ఆందోళన చెందుతున్న అధికారులు గుట్టుగా వారిని రెగ్యులరైజ్ చేసి.. దేవాదాయ శాఖ పరువు బజారున పడకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.
ఇదీ వ్యవహారం
దేవాదాయ శాఖలో ఉద్యోగాల నియామకాలను సర్వీస్ రూల్స్ ప్రకారం జరపాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు సర్కారు ఖజానా నుంచి, ఆలయ పాలక మండళ్లు నియమించిన వారికి ఆలయ ఆదాయం నుంచే జీతాలందుతాయి. దేవాదాయ శాఖ చట్టం 30–87 సెక్షన్ 57 ప్రకారం.. ఆలయం మొత్తం ఆదాయంలో జీతభత్యాలు 30 శాతం మించటానికి వీల్లేదు. ఆ ప్రకారమే ఉద్యోగులను నియమించుకోవాలి. కానీ.. ఓ ఉన్నతాధికారి మాత్రం కింది స్థాయి అధికారులతో మిలాఖత్ అయి పోస్టుకు ఇంత ధర అని ఫిక్స్ చేసి అమ్మేసుకున్నాడు. దేవరయాంజాల్ ఆలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశాడు. 2006లో ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అక్రమంగా నియమించినట్లు తేలడంతో వారిని తొలగించి కొత్త నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకంపై నిషేధం అమలులోకి వచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వ అనుమతితో కొన్ని పోస్టులు భర్తీ చేయటం మినహా నియామకాలు చేపట్టలేదు.
‘వేతన సవరణ’తో వెలుగులోకి..
వేతన సవరణ చేయాలంటూ దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల ఉద్యమం జరిగింది. రెండేళ్ల పోరాటం తర్వాత ఇటేవలే సీఎం ఆ డిమాండ్‌ను అంగీకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో (ఖజానా నుంచి కాదు) వారికి కూడా వేతనాలు చెల్లించేందుకు అంగీకరించారు. ఆ కసరత్తులో భాగంగా ఆలయ అర్చకులు, ఉద్యోగుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఒక్కొక్కరి వివరాలు పొందుపరిచే క్రమంలో 2006 తర్వాత నియమితులైన వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారి సంఖ్యను లెక్కిస్తూపోగా అది 1,500 వరకు ఉన్నట్లు తేలిందని విశ్వసనీయ సమాచారం. దేవాలయాల పాలక మండళ్లు, అధికారులు కూడబలుక్కుని ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా అడ్డదారిలో వీరిని నియమించినట్లు అధికారులు గుర్తించారు. దేవాలయ ఆదాయం నుంచే వారికి వేతనాలు చెల్లిస్తుండటంతో ప్రభుత్వం గుర్తించలేకపోయింది.
30 శాతం దాటిన జీతభత్యాల పద్దు
దేవాలయం ఆదాయంలో జీతభత్యాల ఖర్చు 30 శాతం మించకూడదనే నిబంధన అపహాస్యం పాలైంది. సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో ఆ పద్దు 60 శాతంగా ఉంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలోనూ అదేరీతిలో ఉంది. ఇలా అనేక దేవాలయాల్లో అక్రమ ఉద్యోగులతో జీతభత్యాల ఖర్చు భారీగా పెరిగింది. వీటిపై సర్కారు దృష్టి సారించకపోవటంతో ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు. ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. పద్దు పెరగడం.. ఆలయ నిర్వహణ ఖర్చులుపోను జీతాలకు డబ్బుల్లేకపోవడంతోనే వేతన సవరణ డిమాండ్ రావటం విశేషం.
నియమకాలు ఎలా జరపాలి..?
పెద్ద దేవాలయాల్లో నియామకాలు జరపాలంటే అధికారులు ఖాళీల సంఖ్య, ఏ స్థాయి సిబ్బంది అవసరమో వివరిస్తూ ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజికి సమాచారం ఇవ్వాలి. పోస్టుల సంఖ్య ఆధారంగా దామాషా పద్ధతిన సీనియారిటీ ఉన్న అభ్యర్థుల వివరాలను ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ పంపుతుంది. వారికి అర్హత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయాలి. ఇక చిన్న దేవాలయాల్లో అయితే.. ఎన్ని పోస్టులు అవసరమో సంబంధిత అథారిటీ నిర్ధారించాలి. వాటి భర్తీకి ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వక అనుమతి పొందాలి. 6సీ స్థాయి దేవాలయమైతే అసిస్టెంట్ కమిషనర్, 6బీ స్థాయి దేవాలయమైతే డిప్యూటీ కమిషనర్, 6ఏ స్థాయి దేవాలయమైతే కమిషనర్ నుంచి లిఖితపూర్వక అనుమతి పొంది నియామక ప్రక్రియ నిర్వహించాలి. తర్వాత రాటిఫికేషన్ చేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment