mla balanagireddy
-
బృందలోలుడికి బ్రహ్మరథం
మంత్రాలయం (కర్నూలు): జగద్గురు మంత్రాలయం రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్తరారాధన పురష్కరించుకుని మహా రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవాలకు అంకురార్పణ పలికారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పల్లకోత్సవం అనంతరం భృంగివాహనంపై సంస్కృత విద్యాపీఠం వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. విద్యాపీఠం ప్రిన్సిపాల్ వాదిరాజాచార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. ప్రహ్లాదరాయలకు వేదపఠనంతో విశేష పూజలు చేశారు. అక్కడి నుంచి శ్రీమఠం చేరుకుని రాఘవేంద్రుల మూలబృందావనంతో కొలువు చేశారు. ఉత్సవమూర్తికి పీఠాధిపతి విశిష్ట పూజలు చేసి.. వసంతోత్సవానికి శ్రీకారం చుట్టారు. అర్చకులు, అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందంగా వసంతోత్సవం చేసుకున్నారు. రథోత్సవం..రమణీయం స్వామివారు ఊరేగింపుగా 12 గంటలకు శ్రీమఠం ముంగిట మహారథం వద్దకు చేరుకున్నారు. పీఠాధిపతి రథ చక్రాలకు నారీకేళ సమర్పణలు కానిచ్చి.. ఉత్సవమూర్తికి హారతులు పట్టారు. మహారథంపై ఉత్సవమూర్తిని కొలువుంచారు. 12.15 గంటలకు రాఘవుడి మహారథయాత్ర మొదలైంది. అశేష భక్తజనం రాఘవుడి నామస్మరణ అందుకోగా.. కళాకారుల డప్పుదరువులు, హరిదాసుల నృత్యప్రదర్శనలు, మహిళల సంకీర్తనాలాపనలు, బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాల మధ్య రథయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టగా..యాత్ర శ్రీమఠం ముఖద్వారం సమీపించింది. ఆ సమయంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక హెలికాప్టర్ నుంచి మహారథంపై పూలవర్షం కురిపించారు. ఐదు పర్యాయాలు పుష్పాలతో అభిషేకం చేశారు. మహారథోత్సవం శ్రీమఠం ముఖద్వారం నుంచి రాఘవేంద్ర సర్కిల్ చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి 2.30 గంటలకు శ్రీమఠం వరకు రమణీయంగా కొనసాగింది. భారీ బందోబస్తు : ఆరాధనోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సీఐలు రాము, దైవప్రసాద్, ఎస్ఐలు శ్రీనివాసనాయక్, రాజారెడ్డితో పాటు ఐదుగురు, ఏఎస్ఐలు, హెచ్‌సీలు 13 మంది, మహిళా కానిస్టేబుళ్లు ఎనిమిది మంది, కానిస్టేబుళ్లు 71, స్పెషల్‌పార్టీ 15 మంది, హోంగార్డ్స్ ఎనిమిది మంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్, ఫైర్ సిబ్బంది బందోబస్తులో పాలుపంచుకున్నారు. ఆకట్టుకున్న సంప్రదాయ నృత్య ప్రదర్శనలు రథయాత్రలో కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక డోలు వాయిద్యాలకు బ్రాహ్మణ యువతుల సంప్రదాయ నృత్యాలు.. కర్ణాటక డప్పు కళాకారుల కోలాటాలు, పొంజాటలు అలరించాయి. గురుసార్వభౌమ దాస సాహిత్య మండలి మహిళల భజనలు వీనుల విందు చేశాయి. వేడుకలు తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 70 వేల మంది హాజరైనట్లు అంచనా. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏవో రొద్ద ప్రభాకర్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 గిరిధర్, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, పీఆర్వో బిందుస్వామి, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. వేడుకలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మహారథోత్సవంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఎంటీఆర్ హోటల్ దారిలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి మఠం చేరుకుని ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రస్వామి బృందావనంలో ప్రత్యేక పూజ చేసి.. వసంతోత్సవంలో తరించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ భీమిరెడ్డి, మాజీ సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి ఉన్నారు. -
పులికనుమకు పురుడు పోసింది వైఎస్సే
పెద్దకడబూరు (కర్నూలు): పులికనుమ ప్రాజెక్టుకు మహానీయుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పురుడు పోశారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. తానే వైఎస్.రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడి బసలదొడ్డి చింతల చెరువుకు ప్రత్యేక తూము ఏర్పాటు చేయించానన్నారు. అయితే తిక్కారెడ్డి చింతల చెరువును ప్రారంభించడంపై మండిపడ్డారు. మండలంలోని బసలదొడ్డి గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బోడెన్న (ఈరన్న) కుటుంబ సభ్యులను పరామర్శించి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు తదితర సమస్యలకు ఎంత ఖర్చు అయినా సరే తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్సీ కాలనీలోని చర్చిలో బాలనాగిరెడ్డి ప్రత్యేక పార్థనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల అండతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి అలంకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘురాముడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయేంద్రారెడ్డి, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యల్లప్ప, నాయకులు దేవదానం, పరమేష్, లంకారెడ్డి, శివరాం, మల్లికార్జున, హంపయ్య, డీలర్ అంజినయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదు
మంత్రాలయం/ఆలూరు: తాము పార్టీ మారుతున్నట్లు గురువారం కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలు సత్యదూరమని వైఎస్సార్సీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లు మైండ్‌గేమ్ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా ప్రసారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై తనకెంతో అభిమానం ఉందని, పార్టీ మారే ఆలోచనలు ఏకోశానా లేవని స్పష్టం చేశారు. టీవీ చానళ్లు అసత్య ప్రసారాలు మానుకొని నిజానిజాలు చూపిస్తే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమ తోక పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. జగనన్న వెంటే నడుస్తా: గుమ్మనూరు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తాను ఉంటానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలను ఖండించారు. ఆయన సాక్షి విలేకరితో ఫోన్లో మాట్లాడుతూ.. మీడియాలో ఊహాగానాలు, అసత్య ప్రసారాలను చేయడం తనకెంతో బాధ కల్గించిందన్నారు. మూడేళ్లుగా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు, అవమానాల్ని ఎదుర్కొంటూ వస్తున్నానన్నారు. తన ఎదుగుదలకు వైఎస్సార్సీపీ బీజం వేసిందని, కన్నతల్లిలాంటి పార్టీని విడవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన ఎదుగులను చూసి ఓర్వలేకనే కొందరు అసత్య ప్రచారాలను చేయిస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. -
‘పులి’ గర్జన
- పులికనుమ ప్రాజెక్టు కోసం కదంతొక్కిన కర్షకులు - ప్రాజెక్టు నుంచి 19 కి.మీ. పాదయాత్ర - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రాలయం/పెద్దకడబూరు/కోసిగి: వరుస కరువుతో కడుపు మండిన రైతులు నిప్పు కణికలయ్యారు. కదంతొక్కి కన్నీటి కష్టాలను ఎలుగెత్తి చాటారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారీగా పాదయాత్ర చేశారు. పులికనుమ ప్రాజెక్టు నుంచి ఈ యాత్ర 19 కి.మీ వరకు సాగింది. రైతులకు అండగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రైతు సంఘం నాయకులు నిలిచారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్నినిరసిస్తూ బుధవారం అసోసియేషన్ ఆఫ్ తుంగభద్ర ఎల్లెల్సీ ఆయకట్ దార్స్ (ఏ.టి.ఎల్.ఏ) ఆధ్వర్యంలో కనువిప్పు పాదయాత్ర చేపట్టారు. అట్లా అధ్యక్షుడు పెద్దహరివాణం ఆదినారాయణ రెడ్డి నేతృత్వంలో సాగినయాత్రకు రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఉదయం 10.20 గంటలకు ఆందోళన బృందం పులికనుమ ప్రాజెక్టు ఆనకట్టను చేరుకుంది. దాదాపు వెయ్యి మంది రైతులు ఆనకట్టపై నిల్చుని ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు ఇచ్చారు. వేలాది మంది రైతులతో కలిసి ఆందోళన కారులు కాలినడకన బయలు దేరారు.దాదాపు 2 కి.మీ. ప్రయాణం చేసి కోసిగి మండల కేంద్రం చేరుకున్నారు. ప్రధాన రోడ్డుపై ప్రదర్శనగా చేరుకుని వక్తలు పాదయాత్ర ఉద్దేశంపై ప్రసంగించారు. అక్కడి నుంచి 5 కి.మీ. ప్రయాణించి సజ్జలగుడ్డం, మరో 3 కి.మీ నడిచి జంపాపురం, అక్కడి నుంచి 9 కి.మీ. పాదయాత్రగా తుంగభద్ర నది ఒడ్డున నిర్మిస్తున్న స్టేజ్–1 పంపుహౌస్‌ను చేరుకున్నారు. నత్తనడకన సాగుతున్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్త పరిచారు. పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి వేణుగోపాల్‌రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాలేశ్వరరెడ్డి, ఎస్ఆర్బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎరువ రామచంద్రారెడ్డి, ఉద్యానవన పంటల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి వెంకటస్వామి నాయుడు, గాజులదిన్నెప్రాజెక్టు మాజీ అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, ఎల్లెల్సీ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,రచయిత పాణి, రాయలసీమ సాగునీటి సాధన సమితి సభ్యులు శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు భీమిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఇల్లూరి ఆదినారాయణ, అత్రినయగౌడ్, జెడ్పీటీసీలు మంగమ్మ, లక్ష్మయ్య పాల్గొన్నారు. సీమపై శీతకన్ను : దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. తుంగభద్ర డ్యాంలో 17 ఏళ్ల క్రితం 5.5 టీఎంసీల పూడిక పేరుకుపోగా ప్రస్తుతం 7.0 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర దిగువ కాలువకు 750 టీఎంసీల నీటి వాటా రావాల్సిన ఉండగా పూర్తిగా తగ్గిపోయింది. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతుల కష్టాలు తీర్చేందుకు పులికనుమ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటవీశాఖ అనుమతులు, 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పేరుతో రెండేళ్లు వృథా చేయడం దారుణం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఐదు రాష్ట్రాల అభ్యంతరాలు ఉన్నా అనుమతులు పొందారు. కరవు రైతులు గగ్గోలు పెడుతున్నా పులికనుమను విస్మరించడం శోచనీయం. కపట ప్రేమ : వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే సీమ రైతాంగంపై రాష్ట్ర ప్రభుత్వం కపటప్రేమ చూపుతోంది. పులికనుమ కోసం వైఎస్సార్ రూ.261.7 కోట్లు వెచ్చించారు. రెండేళ్లు గడిచినా 15 శాతం పనులు చేయకపోవడం దారుణం. కోసిగి బహిరంగ సభలో వేలాదిమంది ఎదుట ఈ ఏడాది ఖరీఫ్‌కు నీళ్లిస్తామని టీడీపీ నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి గొప్పలు చెప్పారు. లేనిపోని ఆరోపణలు చేయడం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసింది శూన్యం. రైతుల కోసం అప్పట్లో నేను పార్టీ మారాను. అందుకు కృతజ్ఞతగా వైఎస్ఆర్ పులికనుమ ప్రాజెక్టు మంజూరు చేశారు. రైతులకు ఒక్క పనిచేయకపోయినా పార్టీలు మారారని మాట్లాడటం తగదు. దమ్ముంటే అటవీశాఖ అనుమతులు తీసుకుని వచ్చి రైతుల కష్టాలు తీర్చాలి. చైతన్యంతోనే సాధన : ఆదినారాయణరెడ్డి, అట్లా అధ్యక్షుడు కరువును పారదోలాలంటే సాగునీరే శరణ్యం. ఇందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఏకమై పోరాటాలకు సమాయత్తం కావాలి. ఎల్లెల్సీ వాటా సాధనకోసం, ప్రాజెక్టుల నిర్మాణానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలి. పులికనుమ ప్రాజెక్టు పాదయాత్రకు తరలివచ్చిన రైతులకు పేరుపేరున కృతజ్ఞతలు.