
మంత్రాలయం/ఆలూరు: తాము పార్టీ మారుతున్నట్లు గురువారం కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలు సత్యదూరమని వైఎస్సార్‌సీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లు మైండ్‌గేమ్ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా ప్రసారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై తనకెంతో అభిమానం ఉందని, పార్టీ మారే ఆలోచనలు ఏకోశానా లేవని స్పష్టం చేశారు. టీవీ చానళ్లు అసత్య ప్రసారాలు మానుకొని నిజానిజాలు చూపిస్తే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమ తోక పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
జగనన్న వెంటే నడుస్తా: గుమ్మనూరు
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తాను ఉంటానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలను ఖండించారు. ఆయన సాక్షి విలేకరితో ఫోన్‌లో మాట్లాడుతూ.. మీడియాలో ఊహాగానాలు, అసత్య ప్రసారాలను చేయడం తనకెంతో బాధ కల్గించిందన్నారు. మూడేళ్లుగా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు, అవమానాల్ని ఎదుర్కొంటూ వస్తున్నానన్నారు. తన ఎదుగుదలకు వైఎస్సార్‌సీపీ బీజం వేసిందని, కన్నతల్లిలాంటి పార్టీని విడవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన ఎదుగులను చూసి ఓర్వలేకనే కొందరు అసత్య ప్రచారాలను చేయిస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు.