jai ram
-
ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయనను అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్(సీఏఆర్) హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం బాధ్యతల్ని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అప్పగించారు. జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డికి మృతదేహం తరలింపునకు సంబంధించి సలహాలిచ్చినట్లు నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో పాటు మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. శ్రీనివాసులును సోమ వారమే బదిలీ చేసిన విషయం విదితమే. రాకేష్, మల్లారెడ్డి మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు జరిగాయని, జయరామ్ హత్య జరిగిన తర్వాతే ఈ కాల్స్ చేసుకున్నట్లు నందిగామ పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి పూర్తి నివేదిక వచ్చాక మల్లారెడ్డి, శ్రీనివాసులుపై విచారణ చేపట్టనున్నారు. ఆదిభట్లలో కేసుతో పరిచయం... కొంగరకలాన్ సమీపంలోని తన భూమి హద్దు రాళ్లు, కడ్డీలను తొలగించి ఆక్రమించుకునేందుకు ప్రయ త్నించారని రాజేందర్‌రెడ్డి జూన్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిగా జితేందర్ రెడ్డి, రెండో నిందితుడిగా రాకేష్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసు విచారణ సమయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేష్‌రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో తరచూ ఫోన్‌కాల్ చేసే రాకేష్‌రెడ్డి జయరామ్ హత్య తర్వాత కూడా మల్లారెడ్డితో ఫోన్లో టచ్‌లో ఉన్నట్లు తేలింది. జయరామ్ హత్య కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన రాకేష్‌రెడ్డి చెప్పిన వాంగ్మూలం ప్రకారం కూడా మల్లారెడ్డి పేరు వినిపించడంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బదిలీ వేటు వేశారు. 2012లో పోలీసు విభాగంలోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పెద్దపల్లి, ఉట్నూరు, ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లోనూ వివాదాస్పదుడిగా ముద్రపడిన మల్లారెడ్డి బడా కేసులను సెటిల్ చేశారనే ఆరోపణలున్నాయి. పాత కేసులో పరిచయంతోనే ఫోన్ కాల్... రాకేష్‌రెడ్డి పాత కేసులో నిందితుడిగా ఉండటంతో ఏర్పడిన పరిచయంతోనే ఫోన్‌కాల్ చేశాడని ఏసీపీ మల్లారెడ్డి వివరిస్తున్నారు. తన ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నారని, ఒకరికి గాయాలయ్యాయని ఫోన్ చేసి చెప్పాడన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారు చెప్పిన ప్రకారం నడుచుకోమని చెప్పానని మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ తతంగం జరిగింది ఈ నెల 1వ తేదీ కాగా... మంగళవారం వరకు ఆయన మిన్నకుండిపోయారు. ఆయనపై ఆరోపణలు మొదలైన తర్వాత తప్పించుకునేందుకే కొత్త వాదన వినిపిస్తున్నారని ఏపీ పోలీసులు అంటున్నారు. ఆయన చెబుతున్న విషయాలు వాస్తవమైతే శనివారం నుంచి రాకేష్ పేరు మీడియాలో వస్తోందని, జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసీ ఫోన్ కాల్స్ విషయం నందిగామ పోలీసులకు గాని, స్థానిక పోలీసులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును జయరామ్ హత్య కేసులో అనుమానితులుగా చేర్చి విచారించే అవకాశం ఉంది. -
శిఖా ప్రియుడే హంతకుడు
సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును వసూలు చేసే క్రమంలో జయరామ్‌ను రాకేష్ హత్య చేశాడని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఐదు రోజులుగా 10 బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు సహకరించిన రాకేష్ వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు. అతన్ని కూడా మంగళవారం నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం ఆ వివరాలను నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. జయరామ్‌తో పరిచయం.. శిఖాచౌదరి ప్రియుడు హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కుత్బుల్లాపూర్‌లో ఉన్న జయరామ్‌కు చెందిన టెట్రాన్ పాలీమర్స్ కంపెనీలో 2015లో లాకౌట్ సమస్య వచ్చింది. కార్మికులు, యాజమాన్యాల మధ్య తలెత్తిన సమస్యలో శిఖా ప్రియుడు తలదూర్చాడు. ఆ సమయంలో జయరామ్ అతడికి పరిచయమయ్యా డు. ఈ క్రమంలో జయరామ్ 2016లో అవసరం నిమిత్తం శిఖా ప్రియుడి నుంచి పలు దఫాలుగా రూ.4.17 కోట్లు అప్పు తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని శిఖా ప్రియుడు డిమాండ్ చేయడంతో.. రూ. 4.17 కోట్లకు గాను వడ్డీతో కలిపి రూ.6 కోట్లు 2018, అక్టోబర్ నాటికి ఇస్తానని జయరామ్ ఒప్పందం చేసుకున్నాడు. తరువాత గడువు తీరినా తిరిగి డబ్బులు చెల్లించలేదు. అందమైన అమ్మాయి పేరిట వల.. చిగురుపాటి జయరామ్ ఈ ఏడాది జనవరి 29న అమెరికా నుంచి ఫార్మా కంపెనీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. అదే రోజు రాత్రి తన మేనకోడలు శిఖా ఇంటికి వచ్చాడు. ఈ విషయం అపార్ట్ మెంట్ మేనేజర్ ద్వారా తెలుసుకున్న శిఖా ప్రియుడు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు. జయరామ్ బలహీనతల గురించి పక్కాగా తెలుసుకున్న రాకేష్ వీణా పేరుతో సిమ్‌కార్డు తీసుకుని అతనితో వాట్సాప్ చాటింగ్ చేశాడు. డీపీగా ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టాడు. హాయ్.. హల్లో.. నుంచి మొదలుపెట్టి వలపు వలవేసి జయరామ్‌ను గత నెల 30న రోడ్డు నంబర్ 10లోని తన ఇంటికి రప్పించుకున్నాడు. విజయవాడకు మృతదేహం తరలింపు... మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్న శిఖా ప్రియుడికి.. అదేరోజు రాత్రి జయరామ్ విజయవాడ వెళ్లాలనుకున్నాడని తెలుసు. కేసు నుంచి బయటపడటానికి హైదరాబాద్ నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిలకు సలహా కోసం ఫోన్లు చేశాడు. వారి సలహా మేరకు ప్రమాద ఘటనగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. వాచ్‌మన్ సా యంతో మృతదేహాన్ని జయరామ్‌కు చెందిన కారు (ఏపీ16ఈజీ0620)లో వేసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి నందిగామ సమీపంలోని ఐతవరం శివారుకు చేరుకున్నాడు. అక్కడ జాతీయ రహదారి రోడ్డు మార్జిన్‌కు దిగువలో కారును దింపేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. 2018లో శిఖాచౌదరితో పరిచయం.. జయరామ్ 2018లో అమెరికా నుంచి నిందితుడికి ఫోన్ చేసి ‘టెట్రాన్ కంపెనీలో గొడవలున్నాయి. వాటిని కొంచెం పరిష్కరించు.. నీకు నా మేనకోడలు శిఖా ఫోన్ చేస్తుంది అటెండ్ అవ్వు’అన్నాడు. ఆ సమయంలోనే శిఖాతో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఈ కేసు ఇప్పటితో ముగిసిపోలేదు: త్రిపాఠి ‘పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం మేరకే ప్రధాన నిందితుడు రాకేష్‌తోపాటు అతనికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివాస్‌పై 302, 419, 342, 346, 348, 312, 201, 202 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో అనుమానాలున్నాయి. మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. సమగ్రంగా విచారించాక మరిన్ని అరెస్టులుండొచ్చు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే కేసును బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తాం. బంధించి.. చిత్రహింసలకు గురిచేసి.. ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు బంధించాడు. డబ్బులు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. నెలకు రూ.50 లక్షల చొప్పున చెల్లిస్తానని బతిమిలాడినా ఒప్పకోలేదు. చివరకు కోస్టల్ బ్యాంక్‌లో పనిచేసిన మాజీ మేనేజర్ రూ.6 లక్షలు శిఖా ప్రియుడి స్నేహితుడు రాజశేఖర్‌కు దస్పల్లా హోటల్లో అందజేశాడు. రూ.6 కోట్ల అప్పుకుగానూ రూ.6 లక్షలు ఇవ్వడమేంటంటూ జయరామ్‌తో గొడవ పడ్డాడు. అతడిపై ముష్టిఘాతాలకు దిగాడు. ఆ దెబ్బలకు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ సోఫాపై పడిన జయరామ్‌ను ఊపిరాడకుండా చేశాడు. ఆ సమయంలో జయరామ్ కదలకుండా వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నాడు. పిడిగుద్దులు కురిపించడంతో జయరామ్ 31వ తేదీ ఉదయం 11–12 గంటల మధ్య మృతి చెందాడు. -
‘చినబాబు’కు సన్నిహితుడే.. రాకేష్!
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడైన కౌకుంట్ల రాకేష్‌రెడ్డిలో రాజకీయ కోణం కూడా వెలుగుచూస్తోంది. కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన రాకేష్ ఆ పార్టీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న సమయంలోనే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయడం దగ్గరి నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ నాయకుడి(చినబాబు)తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునేంత వరకు రాకేష్ రాకెట్ వేగంతో వెళ్లిపోయాడని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఎంతగా అంటే ఏపీ యువనేతకు సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా లాబీయింగ్‌తో యువనేతకు దగ్గరయిన రాకేష్ ఆయన సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని యువనేతతో అపాయింట్మెంట్లు ఇప్పించే స్థాయికి వెళ్లిపోయారని ట్రస్ట్ భవన్ వర్గాలంటున్నాయి. మరో విశేషమేమిటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెళ్లే వీఐపీలకు అతిథి మర్యాదలు కల్పించడంలో కూడా రాకేష్ దిట్ట అని తెలుస్తోంది. తనకున్న పలుకుబడి ద్వారా ఎల్–2లో ఉన్న పేర్లను కూడా ఎల్–1 జాబితాలో చేర్చి అత్యధిక ప్రాధాన్యమిచ్చే దర్శన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, మంత్రులు వ్యక్తిగతంగా వెళ్లినప్పుడు మాత్రమే వారిని ఎల్–1 జాబితాలో చేర్చే టీటీడీ అధికారులు.. రాకేష్ చెప్పాడంటే ఎల్–1 జాబితాలో చేర్చేవారనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ ముఖ్య నేతతో టచ్‌లో.. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా రాకేష్ సత్సంబంధాలు కొనసాగించాడు. అప్పట్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ దగ్గరి నుంచి ఆ పార్టీకి రాష్ట్రస్థాయిలో ఉన్న ముఖ్య నాయకుడి వరకు దూసుకెళ్లిపోయాడని, టికెట్లు ఇప్పిస్తానని చెప్పి గత ఎన్నికల సందర్భంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు నాయకులను ఆ ముఖ్య నాయకుడి వద్దకు తీసుకెళ్లాడని అంటున్నారు. వీరిని ఏపీకి చెందిన యువనేతకు కూడా కలిపించాడనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుడి ఇంటికి తరచూ రాకేష్ వెళుతుండేవాడని, గత ఎన్నికల్లో టికెట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేశాడని తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రాజకీయ సంబంధాలు పెట్టుకున్న రాకేష్ కొందరు ముఖ్యమైన నాయకులు, మరికొందరు రాజకీయ నాయకుల కుమారులతో సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. రాజకీయ నాయకుల కుమారులు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు రాకేష్‌ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు రాకేష్ ప్రలోభాలకు ఆకర్షితులై అతనితో సంబంధాలు కొనసాగించగా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మరికొందరు నేతలు మాత్రం దూరం పెట్టారని సమాచారం. ఎయిర్‌పోర్టులోనూ వీఐపీ ట్రీట్మెంట్... నాలుగేళ్ల క్రితం రాకేష్‌రెడ్డి కుత్బుల్లాపూర్ నుంచి మకాం మార్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శిఖా చౌదరితో ఉంటున్నాడు. ఇదే విషయంపై అతని తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి 2017లో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నుంచే అతని లైఫ్స్టైల్లో పూర్తి మార్పులొచ్చినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాకేష్ తరచూ గోవా, శ్రీలంక, సింగపూర్ దేశాలకు సన్నిహిత మిత్రులు, టీడీపీ నాయకులతో వెళ్లే సమయాల్లో ప్రోటోకాల్ సిబ్బంది సైతం అతనికి అన్ని సేవలు చేసే వారని, అందుకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని సమాచారం. హత్యానంతరం ఒక నేతతో సంభాషణ చినబాబుకు, ఆయన ప్రత్యేక అధికారికి అన్నీ తానై వ్యవహరించిన రాకేష్‌పై 2016లో కూకట్‌పల్లిలో ఓ హోటల్ యజమానిని డబ్బుకోసం బెదిరించిన కేసుతో పాటు 2017లో తమను పట్టించుకోవటం లేదంటూ ఆయన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. పెద్దబాబు, చిన్నబాబుతో సన్నిహిత సంబంధాలున్న రాకేష్‌రెడ్డికి, తెలంగాణలో పార్టీ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నారై జయరామ్‌ను హత్య చేసిన అనంతరం రాకేష్ పలువురు పోలీస్ అధికారులతో పాటు హైదరాబాద్‌లోని టీడీపీ ముఖ్యనేతతో చాలా సేపు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. క్యాసినో కోసం ఎందాకైనా.. రాకేష్‌రెడ్డికి క్యాసినో అంటే ఎంతో ఇష్టం. దీని కోసం ఎందాకైనా.. ఎప్పుడైనా.. సిద్ధంగా ఉంటాడని ఆయనతో కలసి క్యాసినో పార్టీలో పాల్గొన్న మిత్రులు చెబుతున్నారు. ఎన్ని లక్షలు నష్టపోయినా సరే అందులో మజానే వేరంటూ ఎంజాయ్ చేసేవాడని పేర్కొంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతనికి బీరు మాత్రమే తాగడం అలవాటు. ఆ అలవాటుతోనే నందిగామలో ఓ బార్ నుంచి బీరు బాటిల్ తీసుకువెళ్తూ సీసీ ఫుటేజీకి చిక్కాడు. కాస్ట్లీ లైఫ్‌తో ఎంజాయ్... తొలుత ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న రాకేష్‌రెడ్డి గత నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా ఎదిగిపోయాడని, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని సమాచారం. ఆ కోవలోనే శిఖా చౌదరి సైతం పరిచయమైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుత్బుల్లాపూర్‌కు వచ్చినప్పుడల్లా ఖరీదైన కార్లలో వచ్చి పోలీస్, రాజకీయ నాయకులకు పార్టీలు ఇచ్చి వెళ్లేవాడని తెలిసింది. -
హోమానంద్ కామెడీ
హోమానంద్, పావని జంటగా జైరామ్ కుమార్ దర్శకత్వంలో ఓంతీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. బోలే షావళి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేశారు. ట్రైలర్, బిగ్ సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘మిస్టర్ హోమానంద్’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘హారర్, కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా వాటికి భిన్నంగా ఉంటుంది’’ అన్నారు జైరామ్ కుమార్. ‘‘మా గురువుగారు కేశవ తీర్థగారి వల్లే సినిమారంగంలోకి వచ్చా. మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం. ఇంద్రసేనా రెడ్డి. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. నా నటన చూసి సీనియర్ యాక్టర్లా చేసావని అంటుంటే వెరీ హ్యాపీ’’ అన్నారు హోమానంద్. -
నవ్వుల థ్రిల్లర్
మారుతి, శ్రావణి, అశ్వినీ, ప్రియ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమ్ 6’. జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకంపై విశ్వనాథ్ తన్నీరు, సురేష్. ఎస్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జైరామ్ వర్మ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలూ ఉంటాయి. అంతర్లీనంగా చిన్న సందేశమిచ్చే ప్రయత్నం చేశాం. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఇటీవల షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. మా హీరో మారుతికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న హీరోలా నటించాడు’’ అన్నారు విశ్వనాథ్ తన్నీరు. ‘‘నేను నటనలో శిక్షణ తీసుకోలేదు. దర్శకుడు చెప్పినట్లు చేశా’’ అన్నారు మారుతి. గోవింద, హరిత, వంశీ, ఇంద్రతేజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజి, కెమెరా: మహ్మద్ రియాజ్, సమర్పణ: పార్వతి. -
వైఎస్సార్ కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదు
మంత్రాలయం/ఆలూరు: తాము పార్టీ మారుతున్నట్లు గురువారం కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలు సత్యదూరమని వైఎస్సార్సీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లు మైండ్‌గేమ్ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా ప్రసారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై తనకెంతో అభిమానం ఉందని, పార్టీ మారే ఆలోచనలు ఏకోశానా లేవని స్పష్టం చేశారు. టీవీ చానళ్లు అసత్య ప్రసారాలు మానుకొని నిజానిజాలు చూపిస్తే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమ తోక పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. జగనన్న వెంటే నడుస్తా: గుమ్మనూరు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తాను ఉంటానని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలను ఖండించారు. ఆయన సాక్షి విలేకరితో ఫోన్లో మాట్లాడుతూ.. మీడియాలో ఊహాగానాలు, అసత్య ప్రసారాలను చేయడం తనకెంతో బాధ కల్గించిందన్నారు. మూడేళ్లుగా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు, అవమానాల్ని ఎదుర్కొంటూ వస్తున్నానన్నారు. తన ఎదుగుదలకు వైఎస్సార్సీపీ బీజం వేసిందని, కన్నతల్లిలాంటి పార్టీని విడవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన ఎదుగులను చూసి ఓర్వలేకనే కొందరు అసత్య ప్రచారాలను చేయిస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. -
కదిలిస్తే కన్నీళ్లే..!
సాక్షి ముంబై: అమ్మా... అమ్మా...! బహుశా ఏడుపులో పిలుపు ఇదేనేమో. ఆదివారం జరిగిన దివా-సావంత్వాడి రైలు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మూడు నెలల పసికందు మానస్వి ఏడుపు రోహా ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బోగీల్లో నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన చిన్నారిని మానస్వి నాఫ్తీగా గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు ఆమె తల్లిందండ్రులెవరో కూడా గుర్తించారు. అయితే ఆమె తల్లి సురేఖా మరణించగా తండ్రి జైరామ్ తీవ్ర గాయాలతో సైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఓదార్చే తనవారెవరూ లేక రోహా ఆస్పత్రిలో మానస రోదన అక్కడి వైద్యులు, నర్సులు, చూడడానికి వచ్చినవారిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె తోబుట్టువులు కూడా ఇదే రైలులో ప్రయాణించినప్పటికీ వారిద్దరి జాడ ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలం నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చిన మానస్వికి స్వల్ప గాయాలయ్యాయని గుర్తించిన వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, జనరల్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రి సిబ్బందే మానస్విని కంటికి రెప్పలా చూసుకుంటున్నా తల్లిలేని లోటును మాత్రం తీర్చలేకపోతున్నారు. ఎంత బుజ్జగించినా ఆమెను ఓదార్చడం తమవల్ల కావడంలేదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చినవారు కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వారి బంధువుల జాడ ఇంకా తెలియలేదని, తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. సురక్షితంగా బయటపడ్డ పావస్కర్ కుటుంబం దివా-సావంత్వాడి రైలు ప్రమాదంలో ఠాణేకి చెందిన పావస్కర్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. కిసాన్‌నగర్, నం.2లో నివసించే ప్రమోద్ పావస్కర్, భార్య ప్రాజక్తా, కుమారుడు ప్రజ్యోత్లతో స్వగ్రామమైన రత్నగిరి బయలుదేరాడు. నాలుగో బోగీలో ప్రయాణిస్తున్న వీరు రైలు కుదుపులకు పల్టీలు కొడుతూ బయటపడ్డారు. దీంతో చిన్న చిన్న గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ విషయమై పావస్కర్ మాట్లాడుతూ... పట్టాలు తప్పడంతో రైలు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో పల్టీలు కొడుతూ బయటపడ్డా. నా కళ్లముందే ఎంతోమంది బోగీల్లో ఇరుక్కొని చూస్తుండగానే ప్రాణాలు వదిలారు. దీంతో నా భార్యా, కుమారుడు ఎక్కడ ఉన్నాడోనని ఆందోళనకు గురయ్యాను. అయితే అదృష్టవశాత్తు వారు కూడా నాలాగే రైల్లోనుంచి బయటపడడంతో ప్రాణాలను కాపాడుకున్నార’న్నారు. ఈ పాప ఎవరు..? ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మరో చిన్నారి కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఇంతవరకూ తెలియలేదు. కాలికి గాయం కావడంతో రోహా ఆస్పత్రి నుంచి అలీబాగ్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించామని, ఆమె వివరాలు కూడా పూర్తిగా తెలియలేదని, బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబీకులతోపాటు క్షతగాత్రులను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పరామర్శించారు. బాధితులు చికిత్స పొందుతున్న రోహాలోని ఆస్పత్రిని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్నవారి ఆరోగ్యపరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాయగఢ్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సునీల్ తట్కరే కూడా ఉన్నారు. వీరిద్దరితోపాటు పలువురు అధికారులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. 21కి చేరిన మృతుల సంఖ్య దివా-సావంత్వాడి ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతిచెందినవారి సంఖ్య 21కి చేరింది. ఘటనాస్థలంలో 18 మంది మరణించగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో నలుగురు మహిళలున్నారు. వీరిలో ముంబ్రాకి చెందిన శ్రద్దా అనే బాలిక ఉంది. మృతులకు సంబంధించి ఒకరి వివరాలు మాత్రమే తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుల కుటుంబీకులకు రైల్వే శాఖ ప్రకటించిన రూ. రెండు లక్షల నష్టపరిహారాన్ని అందచేసినట్టు సెంట్రల్ రైల్వే పేర్కొంది. ప్రస్తుతం రాయ్‌గఢ్ జిల్లాలోని నాగోఠాణే, రోహా, అలీబాగ్‌లోని ఆసుపత్రులతోపాటు ముంబైలోని సైన్ తదితర ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారు. ఖర్చులు మావే : ఖర్గే దివా-సావంత్వాడి పాసింజర్ రైలు ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందకీ వైద్య ఖర్చులను రైల్వే శాఖ భరిస్తుందని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జు ఖర్గే ప్రకటించారు. ఘటనాస్థలాన్ని సోమవారం పరిశీలించిన ఆయన అక్కడే ఈ ప్రకటన చేశారు. రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్, సెంట్రల్ రైల్వే జీఎం సునీల్‌కుమార్ సూద్ మంత్రి వెంట ఉన్నారు. వీళ్లంతా ప్రమాదస్థలిని పర్యవేక్షించి రైలు పట్టాలు తప్పడం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఖర్గే రోహా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. -
సోమవారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : జైరాం రమేష్
న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణే ఫైనల్ అని జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ స్ఫష్టం చేశారు. రాయల తెలంగాణపై రాజకీయంగా ఏకాభిప్రాయం లేదని.... అసెంబ్లీ ప్రతిపాదన పంపిస్తే ఆలోచిస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రకు కాకినాడను రాజధాని చేయాలని కేంద్రమంత్రి పల్లంరాజు కోరారని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే విశాఖ, విజయవాడ, అమరావతి, కర్నూలును కొత్త రాజధాని ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతికి సోమవారం తెలంగాణ బిల్లును అక్కడ నుంచి అసెంబ్లీకి పంపుతామని జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం సభ్యులకు ఆంధ్రప్రదేశ్ పై అవగాహన ఉందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాయని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ పరిశీలిస్తున్నామన్నారు. -
‘వెట్టి’ గుర్తింపునకు సర్వే
న్యూఢిల్లీ: ప్రపంచంలో భారత్‌లోనే బానిసలు ఎక్కువగా ఉన్నారంటూ ఓ ఆస్ట్రేలియా సంస్థ గణాంకాలను ప్రకటించడంతో.. కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్న వారికి పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ బతుకుదెరువు చూపించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) కింద ముందుగా 10 జిల్లాల్లో వెట్టి కార్మికులకు పునరావాసం కల్పిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ జిల్లాల్లో వెట్టి కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, చిత్తూరుతోపాటు తమిళనాడులోని వెల్లూరు, కాంచీపురం, ఒడిశాలోని బొలంగీర్, బర్గఢ్ తదితర జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ వెట్టి కార్మికులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తామని ఇందుకోసం స్వయం సహాయక మహిళా సంఘాల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని, ఎన్ఆర్ఎల్ఎం భాగస్వామిగా వ్యవహరిస్తుందని జైరాం చెప్పారు. గుర్తించిన కార్మికులకు పునరావాసం కల్పించి ప్రత్యామ్నాయ ఉపాధి దిశగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.