న్యూఢిల్లీ: ప్రపంచంలో భారత్‌లోనే బానిసలు ఎక్కువగా ఉన్నారంటూ ఓ ఆస్ట్రేలియా సంస్థ గణాంకాలను ప్రకటించడంతో.. కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్న వారికి పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ బతుకుదెరువు చూపించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద ముందుగా 10 జిల్లాల్లో వెట్టి కార్మికులకు పునరావాసం కల్పిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. ఈ జిల్లాల్లో వెట్టి కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, చిత్తూరుతోపాటు తమిళనాడులోని వెల్లూరు, కాంచీపురం, ఒడిశాలోని బొలంగీర్, బర్గఢ్ తదితర జిల్లాలు ఉన్నాయి.
ఇక్కడ వెట్టి కార్మికులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తామని ఇందుకోసం స్వయం సహాయక మహిళా సంఘాల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం భాగస్వామిగా వ్యవహరిస్తుందని జైరాం చెప్పారు. గుర్తించిన కార్మికులకు పునరావాసం కల్పించి ప్రత్యామ్నాయ ఉపాధి దిశగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
‘వెట్టి’ గుర్తింపునకు సర్వే
Published Sat, Oct 19 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement