‘చినబాబు’కు సన్నిహితుడే.. రాకేష్‌! | Rakesh reddy relations with the Telugu Desam Party leaders | Sakshi
Sakshi News home page

‘చినబాబు’కు సన్నిహితుడే.. రాకేష్‌!

Published Wed, Feb 6 2019 12:48 AM | Last Updated on Wed, Feb 6 2019 12:48 AM

Rakesh reddy relations with the Telugu Desam Party leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో నిందితుడైన కౌకుంట్ల రాకేష్‌రెడ్డిలో రాజకీయ కోణం కూడా వెలుగుచూస్తోంది. కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన రాకేష్‌ ఆ పార్టీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న సమయంలోనే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయడం దగ్గరి నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ నాయకుడి(చినబాబు)తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునేంత వరకు రాకేష్‌ రాకెట్‌ వేగంతో వెళ్లిపోయాడని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఎంతగా అంటే ఏపీ యువనేతకు సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా లాబీయింగ్‌తో యువనేతకు దగ్గరయిన రాకేష్‌ ఆయన సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని యువనేతతో అపాయింట్‌మెంట్లు ఇప్పించే స్థాయికి వెళ్లిపోయారని ట్రస్ట్‌ భవన్‌ వర్గాలంటున్నాయి. మరో విశేషమేమిటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెళ్లే వీఐపీలకు అతిథి మర్యాదలు కల్పించడంలో కూడా రాకేష్‌ దిట్ట అని తెలుస్తోంది. తనకున్న పలుకుబడి ద్వారా ఎల్‌–2లో ఉన్న పేర్లను కూడా ఎల్‌–1 జాబితాలో చేర్చి అత్యధిక ప్రాధాన్యమిచ్చే దర్శన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, మంత్రులు వ్యక్తిగతంగా వెళ్లినప్పుడు మాత్రమే వారిని ఎల్‌–1 జాబితాలో చేర్చే టీటీడీ అధికారులు.. రాకేష్‌ చెప్పాడంటే ఎల్‌–1 జాబితాలో చేర్చేవారనే ప్రచారం కూడా జరుగుతోంది. 

తెలంగాణ  ముఖ్య నేతతో  టచ్‌లో..
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా రాకేష్‌ సత్సంబంధాలు కొనసాగించాడు. అప్పట్లో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ దగ్గరి నుంచి ఆ పార్టీకి రాష్ట్రస్థాయిలో ఉన్న ముఖ్య నాయకుడి వరకు దూసుకెళ్లిపోయాడని, టికెట్లు ఇప్పిస్తానని చెప్పి గత ఎన్నికల సందర్భంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు నాయకులను ఆ ముఖ్య నాయకుడి వద్దకు తీసుకెళ్లాడని అంటున్నారు. వీరిని ఏపీకి చెందిన యువనేతకు కూడా కలిపించాడనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుడి ఇంటికి తరచూ రాకేష్‌ వెళుతుండేవాడని, గత ఎన్నికల్లో టికెట్ల కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేశాడని తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రాజకీయ సంబంధాలు పెట్టుకున్న రాకేష్‌ కొందరు ముఖ్యమైన నాయకులు, మరికొందరు రాజకీయ నాయకుల కుమారులతో సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. రాజకీయ నాయకుల కుమారులు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు రాకేష్‌ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు రాకేష్‌ ప్రలోభాలకు ఆకర్షితులై అతనితో సంబంధాలు కొనసాగించగా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మరికొందరు నేతలు మాత్రం దూరం పెట్టారని సమాచారం. 

ఎయిర్‌పోర్టులోనూ వీఐపీ ట్రీట్‌మెంట్‌...
నాలుగేళ్ల క్రితం రాకేష్‌రెడ్డి కుత్బుల్లాపూర్‌ నుంచి మకాం మార్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శిఖా చౌదరితో ఉంటున్నాడు. ఇదే విషయంపై అతని తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి 2017లో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నుంచే అతని లైఫ్‌స్టైల్‌లో పూర్తి మార్పులొచ్చినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకేష్‌ తరచూ గోవా, శ్రీలంక, సింగపూర్‌ దేశాలకు సన్నిహిత మిత్రులు, టీడీపీ నాయకులతో వెళ్లే సమయాల్లో ప్రోటోకాల్‌ సిబ్బంది సైతం అతనికి అన్ని సేవలు చేసే వారని, అందుకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని సమాచారం. 

హత్యానంతరం ఒక నేతతో సంభాషణ 
చినబాబుకు, ఆయన ప్రత్యేక అధికారికి అన్నీ తానై వ్యవహరించిన రాకేష్‌పై 2016లో కూకట్‌పల్లిలో ఓ హోటల్‌ యజమానిని డబ్బుకోసం బెదిరించిన కేసుతో పాటు 2017లో తమను పట్టించుకోవటం లేదంటూ ఆయన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. పెద్దబాబు, చిన్నబాబుతో సన్నిహిత సంబంధాలున్న రాకేష్‌రెడ్డికి, తెలంగాణలో పార్టీ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నారై జయరామ్‌ను హత్య చేసిన అనంతరం రాకేష్‌ పలువురు పోలీస్‌ అధికారులతో పాటు హైదరాబాద్‌లోని టీడీపీ ముఖ్యనేతతో చాలా సేపు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

క్యాసినో కోసం ఎందాకైనా..
రాకేష్‌రెడ్డికి క్యాసినో అంటే ఎంతో ఇష్టం. దీని కోసం ఎందాకైనా.. ఎప్పుడైనా.. సిద్ధంగా ఉంటాడని ఆయనతో కలసి క్యాసినో పార్టీలో పాల్గొన్న మిత్రులు చెబుతున్నారు. ఎన్ని లక్షలు నష్టపోయినా సరే అందులో మజానే వేరంటూ ఎంజాయ్‌ చేసేవాడని పేర్కొంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతనికి బీరు మాత్రమే తాగడం అలవాటు. ఆ అలవాటుతోనే నందిగామలో ఓ బార్‌ నుంచి బీరు బాటిల్‌ తీసుకువెళ్తూ సీసీ ఫుటేజీకి చిక్కాడు.  

కాస్ట్‌లీ లైఫ్‌తో ఎంజాయ్‌...
తొలుత ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న రాకేష్‌రెడ్డి గత నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా ఎదిగిపోయాడని, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని సమాచారం. ఆ కోవలోనే శిఖా చౌదరి సైతం పరిచయమైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుత్బుల్లాపూర్‌కు వచ్చినప్పుడల్లా ఖరీదైన కార్లలో వచ్చి పోలీస్, రాజకీయ నాయకులకు పార్టీలు ఇచ్చి వెళ్లేవాడని తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement