రాకేశే హంతకుడు | 8 accused and 70 witnesses In The Murder Case Of Jayaram | Sakshi
Sakshi News home page

రాకేశే హంతకుడు

Published Wed, May 1 2019 2:27 AM | Last Updated on Wed, May 1 2019 2:32 PM

8 accused and 70 witnesses In The Murder Case Of Jayaram - Sakshi

సాక్షి,హైదరాబాద్‌:  ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కె.రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్‌ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్‌ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్‌ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్‌ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్‌ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం రాకేశ్‌రెడ్డితోపాటు మిగతా ఏడుగురు నిందితులు జైలులో ఉన్నారు. వీరిపై అదనపు చార్జిషీట్‌ దాఖలు చేయడం ద్వారా పోలీసులు కేసును  పటిష్టం చేసే దిశలో ఉన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన నాయకుడి పేరును కూడా అదనపు చార్జ్‌షీటులో చేర్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కేసులో తీవ్ర వివాదాస్పదమైన రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పోలీసు అధికారుల పేర్లు తొలి చార్జిషీట్‌లో చేర్చలేదని సమాచారం. 

రాకేశ్‌పై పీడీ అస్త్రం..
జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడుతూ రౌడీయిజంతో రెచ్చిపోతున్న రాకేశ్‌రెడ్డిపై పీడీ అస్త్రం ప్రయోగించేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కమిటీకి నివేదిక అందజేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement