
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాల్, నగేశ్, సుభాష్ చంద్రారెడ్డిలను అరెస్టు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జయరాం హత్య కేసు విచారణపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జయరాం హత్య జరిగిన సమయంలో విశాల్ అనే వ్యక్తి రాకేష్‌తోనే ఉన్నారని చెప్పారు. హత్య చేసే సమయంలో నగేష్ అనే వ్యక్తి మొబైల్‌లో వీడియో తీశారని.. ఆ దృశ్యాలను సేకరించామని డీసీపీ తెలిపారు. జయరాంను రాకేష్ హత్య చేస్తున్న ఫోటోలను, వీడియోను సుభాష్‌కు పంపారని చెప్పారు.
సుభాష్ చంద్రారెడ్డి అనే వ్యక్తి రాకేష్ రెడ్డి స్నేహితుడని, అతని నుంచి మర్డర్‌కు సంబంధించిన వస్తువులను స్వాదీనం చేసుకున్నామన్నారు. పథకం ప్రకారమే జయరాంను కిడ్నాప్ చేసి హత్య చేశారని చెప్పారు. జయరాంను బెదిరించి కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకొని అనంతరం హత్య చేశారని చేశారని వివరించారు. హత్య చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఒక్కరే జయరాం డెడ్ బాడీని తీసుకెళ్లారన్నారు. జయరాంను చిత్రహింసలకు గురిచేసి ఖాళీ బాండు పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి రాకేశ్‌రెడ్డిని పూర్తిగా విచారించామని.. శిఖా చౌదరిపై ఆయన ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపారు. ఈ హత్య జరిగిన విషయాన్ని శిఖా చౌదరికి కారు డ్రైవర్ ఫోన్ ద్వారా తెలిపాడన్నారు. జయరాం ఇంట్లోకి అక్రమంగా చొరబడి, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారనే ఫిర్యాదుపై శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. జయరాం హత్య కేసులో పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై విచారణ కొనసాగుతుందన్నారు. ఐదు మంది పోలీసులకు నోటీసులు ఇచ్చామని, వారిని విచారిస్తామని వెల్లడించారు. (జయరామ్ హత్యకేసు; తెరపైకి కొత్త వ్యక్తి)
Comments
Please login to add a commentAdd a comment