సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును వసూలు చేసే క్రమంలో జయరామ్‌ను రాకేష్ హత్య చేశాడని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఐదు రోజులుగా 10 బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు సహకరించిన రాకేష్ వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు. అతన్ని కూడా మంగళవారం నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం ఆ వివరాలను నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు.
జయరామ్‌తో పరిచయం..
శిఖాచౌదరి ప్రియుడు హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కుత్బుల్లాపూర్‌లో ఉన్న జయరామ్‌కు చెందిన టెట్రాన్ పాలీమర్స్ కంపెనీలో 2015లో లాకౌట్ సమస్య వచ్చింది. కార్మికులు, యాజమాన్యాల మధ్య తలెత్తిన సమస్యలో శిఖా ప్రియుడు తలదూర్చాడు. ఆ సమయంలో జయరామ్ అతడికి పరిచయమయ్యా డు. ఈ క్రమంలో జయరామ్ 2016లో అవసరం నిమిత్తం శిఖా ప్రియుడి నుంచి పలు దఫాలుగా రూ.4.17 కోట్లు అప్పు తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని శిఖా ప్రియుడు డిమాండ్ చేయడంతో.. రూ. 4.17 కోట్లకు గాను వడ్డీతో కలిపి రూ.6 కోట్లు 2018, అక్టోబర్ నాటికి ఇస్తానని జయరామ్ ఒప్పందం చేసుకున్నాడు. తరువాత గడువు తీరినా తిరిగి డబ్బులు చెల్లించలేదు.
అందమైన అమ్మాయి పేరిట వల..
చిగురుపాటి జయరామ్ ఈ ఏడాది జనవరి 29న అమెరికా నుంచి ఫార్మా కంపెనీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. అదే రోజు రాత్రి తన మేనకోడలు శిఖా ఇంటికి వచ్చాడు. ఈ విషయం అపార్ట్ మెంట్ మేనేజర్ ద్వారా తెలుసుకున్న శిఖా ప్రియుడు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు. జయరామ్ బలహీనతల గురించి పక్కాగా తెలుసుకున్న రాకేష్ వీణా పేరుతో సిమ్‌కార్డు తీసుకుని అతనితో వాట్సాప్ చాటింగ్ చేశాడు. డీపీగా ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టాడు. హాయ్.. హల్లో.. నుంచి మొదలుపెట్టి వలపు వలవేసి జయరామ్‌ను గత నెల 30న రోడ్డు నంబర్ 10లోని తన ఇంటికి రప్పించుకున్నాడు.
విజయవాడకు మృతదేహం తరలింపు...
మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్న శిఖా ప్రియుడికి.. అదేరోజు రాత్రి జయరామ్ విజయవాడ వెళ్లాలనుకున్నాడని తెలుసు. కేసు నుంచి బయటపడటానికి హైదరాబాద్ నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిలకు సలహా కోసం ఫోన్లు చేశాడు. వారి సలహా మేరకు ప్రమాద ఘటనగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. వాచ్‌మన్ సా యంతో మృతదేహాన్ని జయరామ్‌కు చెందిన కారు (ఏపీ16ఈజీ0620)లో వేసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి నందిగామ సమీపంలోని ఐతవరం శివారుకు చేరుకున్నాడు. అక్కడ జాతీయ రహదారి రోడ్డు మార్జిన్‌కు దిగువలో కారును దింపేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు.
2018లో శిఖాచౌదరితో పరిచయం..
జయరామ్ 2018లో అమెరికా నుంచి నిందితుడికి ఫోన్ చేసి ‘టెట్రాన్ కంపెనీలో గొడవలున్నాయి. వాటిని కొంచెం పరిష్కరించు.. నీకు నా మేనకోడలు శిఖా ఫోన్ చేస్తుంది అటెండ్ అవ్వు’అన్నాడు. ఆ సమయంలోనే శిఖాతో ఇతనికి పరిచయం ఏర్పడింది.
ఈ కేసు ఇప్పటితో ముగిసిపోలేదు: త్రిపాఠి
‘పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం మేరకే ప్రధాన నిందితుడు రాకేష్‌తోపాటు అతనికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివాస్‌పై 302, 419, 342, 346, 348, 312, 201, 202 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో అనుమానాలున్నాయి. మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. సమగ్రంగా విచారించాక మరిన్ని అరెస్టులుండొచ్చు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే కేసును బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తాం.
బంధించి.. చిత్రహింసలకు గురిచేసి..
ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు బంధించాడు. డబ్బులు ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. నెలకు రూ.50 లక్షల చొప్పున చెల్లిస్తానని బతిమిలాడినా ఒప్పకోలేదు. చివరకు కోస్టల్ బ్యాంక్‌లో పనిచేసిన మాజీ మేనేజర్ రూ.6 లక్షలు శిఖా ప్రియుడి స్నేహితుడు రాజశేఖర్‌కు దస్పల్లా హోటల్‌లో అందజేశాడు. రూ.6 కోట్ల అప్పుకుగానూ రూ.6 లక్షలు ఇవ్వడమేంటంటూ జయరామ్‌తో గొడవ పడ్డాడు. అతడిపై ముష్టిఘాతాలకు దిగాడు. ఆ దెబ్బలకు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ సోఫాపై పడిన జయరామ్‌ను ఊపిరాడకుండా చేశాడు. ఆ సమయంలో జయరామ్ కదలకుండా వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నాడు. పిడిగుద్దులు కురిపించడంతో జయరామ్ 31వ తేదీ ఉదయం 11–12 గంటల మధ్య మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment