సాక్షి ముంబై: అమ్మా... అమ్మా...! బహుశా ఏడుపులో పిలుపు ఇదేనేమో. ఆదివారం జరిగిన దివా-సావంత్‌వాడి రైలు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మూడు నెలల పసికందు మానస్వి ఏడుపు రోహా ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. రైలు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బోగీల్లో నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన చిన్నారిని మానస్వి నాఫ్తీగా గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు ఆమె తల్లిందండ్రులెవరో కూడా గుర్తించారు.
అయితే ఆమె తల్లి సురేఖా మరణించగా తండ్రి జైరామ్ తీవ్ర గాయాలతో సైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఓదార్చే తనవారెవరూ లేక రోహా ఆస్పత్రిలో మానస రోదన అక్కడి వైద్యులు, నర్సులు, చూడడానికి వచ్చినవారిని కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె తోబుట్టువులు కూడా ఇదే రైలులో ప్రయాణించినప్పటికీ వారిద్దరి జాడ ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలం నుంచి ఆస్పత్రికి తీసుకొచ్చిన మానస్వికి స్వల్ప గాయాలయ్యాయని గుర్తించిన వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, జనరల్ వార్డుకు తరలించారు.
ప్రస్తుతం ఆస్పత్రి సిబ్బందే మానస్విని కంటికి రెప్పలా చూసుకుంటున్నా తల్లిలేని లోటును మాత్రం తీర్చలేకపోతున్నారు. ఎంత బుజ్జగించినా ఆమెను ఓదార్చడం తమవల్ల కావడంలేదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చినవారు కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వారి బంధువుల జాడ ఇంకా తెలియలేదని, తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు.
సురక్షితంగా బయటపడ్డ పావస్కర్ కుటుంబం
దివా-సావంత్‌వాడి రైలు ప్రమాదంలో ఠాణేకి చెందిన పావస్కర్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. కిసాన్‌నగర్, నం.2లో నివసించే ప్రమోద్ పావస్కర్, భార్య ప్రాజక్తా, కుమారుడు ప్రజ్యోత్‌లతో స్వగ్రామమైన రత్నగిరి బయలుదేరాడు. నాలుగో బోగీలో ప్రయాణిస్తున్న వీరు రైలు కుదుపులకు పల్టీలు కొడుతూ బయటపడ్డారు. దీంతో చిన్న చిన్న గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ విషయమై పావస్కర్ మాట్లాడుతూ... పట్టాలు తప్పడంతో రైలు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో పల్టీలు కొడుతూ బయటపడ్డా. నా కళ్లముందే ఎంతోమంది బోగీల్లో ఇరుక్కొని చూస్తుండగానే ప్రాణాలు వదిలారు. దీంతో నా భార్యా, కుమారుడు ఎక్కడ ఉన్నాడోనని ఆందోళనకు గురయ్యాను. అయితే అదృష్టవశాత్తు వారు కూడా నాలాగే రైల్లోనుంచి బయటపడడంతో ప్రాణాలను కాపాడుకున్నార’న్నారు.
ఈ పాప ఎవరు..?
ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మరో చిన్నారి కుటుంబ సభ్యులు కూడా ఎవరో ఇంతవరకూ తెలియలేదు. కాలికి గాయం కావడంతో రోహా ఆస్పత్రి నుంచి అలీబాగ్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించామని, ఆమె వివరాలు కూడా పూర్తిగా తెలియలేదని, బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి..
ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబీకులతోపాటు క్షతగాత్రులను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పరామర్శించారు. బాధితులు చికిత్స పొందుతున్న రోహాలోని ఆస్పత్రిని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్నవారి ఆరోగ్యపరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాయగఢ్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సునీల్ తట్కరే కూడా ఉన్నారు. వీరిద్దరితోపాటు పలువురు అధికారులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
21కి చేరిన మృతుల సంఖ్య
దివా-సావంత్‌వాడి ప్యాసింజర్ రైలు ప్రమాదంలో మృతిచెందినవారి సంఖ్య 21కి చేరింది. ఘటనాస్థలంలో 18 మంది మరణించగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. మరణించినవారిలో నలుగురు మహిళలున్నారు. వీరిలో ముంబ్రాకి చెందిన శ్రద్దా అనే బాలిక ఉంది. మృతులకు సంబంధించి ఒకరి వివరాలు మాత్రమే తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీంతో బాధితుల కుటుంబీకులకు రైల్వే శాఖ ప్రకటించిన రూ. రెండు లక్షల నష్టపరిహారాన్ని అందచేసినట్టు సెంట్రల్ రైల్వే పేర్కొంది. ప్రస్తుతం రాయ్‌గఢ్ జిల్లాలోని నాగోఠాణే, రోహా, అలీబాగ్‌లోని ఆసుపత్రులతోపాటు ముంబైలోని సైన్ తదితర ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారు.
ఖర్చులు మావే : ఖర్గే
దివా-సావంత్‌వాడి పాసింజర్ రైలు ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందకీ వైద్య ఖర్చులను రైల్వే శాఖ భరిస్తుందని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జు ఖర్గే ప్రకటించారు. ఘటనాస్థలాన్ని సోమవారం పరిశీలించిన ఆయన అక్కడే ఈ ప్రకటన చేశారు. రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర కుమార్, సెంట్రల్ రైల్వే జీఎం సునీల్‌కుమార్ సూద్ మంత్రి వెంట ఉన్నారు. వీళ్లంతా ప్రమాదస్థలిని పర్యవేక్షించి రైలు పట్టాలు తప్పడం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఖర్గే రోహా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
కదిలిస్తే కన్నీళ్లే..!
Published Mon, May 5 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement