‘పులి’ గర్జన
‘పులి’ గర్జన
Published Wed, Oct 19 2016 8:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- పులికనుమ ప్రాజెక్టు కోసం కదంతొక్కిన కర్షకులు
- ప్రాజెక్టు నుంచి 19 కి.మీ. పాదయాత్ర
- ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం/పెద్దకడబూరు/కోసిగి: వరుస కరువుతో కడుపు మండిన రైతులు నిప్పు కణికలయ్యారు. కదంతొక్కి కన్నీటి కష్టాలను ఎలుగెత్తి చాటారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారీగా పాదయాత్ర చేశారు. పులికనుమ ప్రాజెక్టు నుంచి ఈ యాత్ర 19 కి.మీ వరకు సాగింది. రైతులకు అండగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రైతు సంఘం నాయకులు నిలిచారు.
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్నినిరసిస్తూ బుధవారం అసోసియేషన్ ఆఫ్ తుంగభద్ర ఎల్లెల్సీ ఆయకట్ దార్స్ (ఏ.టి.ఎల్.ఏ) ఆధ్వర్యంలో కనువిప్పు పాదయాత్ర చేపట్టారు. అట్లా అధ్యక్షుడు పెద్దహరివాణం ఆదినారాయణ రెడ్డి నేతృత్వంలో సాగినయాత్రకు రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఉదయం 10.20 గంటలకు ఆందోళన బృందం పులికనుమ ప్రాజెక్టు ఆనకట్టను చేరుకుంది. దాదాపు వెయ్యి మంది రైతులు ఆనకట్టపై నిల్చుని ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు ఇచ్చారు. వేలాది మంది రైతులతో కలిసి ఆందోళన కారులు కాలినడకన బయలు దేరారు.దాదాపు 2 కి.మీ. ప్రయాణం చేసి కోసిగి మండల కేంద్రం చేరుకున్నారు. ప్రధాన రోడ్డుపై ప్రదర్శనగా చేరుకుని వక్తలు పాదయాత్ర ఉద్దేశంపై ప్రసంగించారు. అక్కడి నుంచి 5 కి.మీ. ప్రయాణించి సజ్జలగుడ్డం, మరో 3 కి.మీ నడిచి జంపాపురం, అక్కడి నుంచి 9 కి.మీ. పాదయాత్రగా తుంగభద్ర నది ఒడ్డున నిర్మిస్తున్న స్టేజ్–1 పంపుహౌస్‌ను చేరుకున్నారు. నత్తనడకన సాగుతున్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్త పరిచారు. పాదయాత్రలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి వేణుగోపాల్‌రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాలేశ్వరరెడ్డి, ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎరువ రామచంద్రారెడ్డి, ఉద్యానవన పంటల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి వెంకటస్వామి నాయుడు, గాజులదిన్నెప్రాజెక్టు మాజీ అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, ఎల్లెల్సీ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,రచయిత పాణి, రాయలసీమ సాగునీటి సాధన సమితి సభ్యులు శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్లు భీమిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఇల్లూరి ఆదినారాయణ, అత్రినయగౌడ్, జెడ్పీటీసీలు మంగమ్మ, లక్ష్మయ్య పాల్గొన్నారు.
సీమపై శీతకన్ను : దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్
సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. తుంగభద్ర డ్యాంలో 17 ఏళ్ల క్రితం 5.5 టీఎంసీల పూడిక పేరుకుపోగా ప్రస్తుతం 7.0 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర దిగువ కాలువకు 750 టీఎంసీల నీటి వాటా రావాల్సిన ఉండగా పూర్తిగా తగ్గిపోయింది. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతుల కష్టాలు తీర్చేందుకు పులికనుమ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటవీశాఖ అనుమతులు, 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పేరుతో రెండేళ్లు వృథా చేయడం దారుణం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఐదు రాష్ట్రాల అభ్యంతరాలు ఉన్నా అనుమతులు పొందారు. కరవు రైతులు గగ్గోలు పెడుతున్నా పులికనుమను విస్మరించడం శోచనీయం.
కపట ప్రేమ : వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే
సీమ రైతాంగంపై రాష్ట్ర ప్రభుత్వం కపటప్రేమ చూపుతోంది. పులికనుమ కోసం వైఎస్సార్ రూ.261.7 కోట్లు వెచ్చించారు. రెండేళ్లు గడిచినా 15 శాతం పనులు చేయకపోవడం దారుణం. కోసిగి బహిరంగ సభలో వేలాదిమంది ఎదుట ఈ ఏడాది ఖరీఫ్‌కు నీళ్లిస్తామని టీడీపీ నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి గొప్పలు చెప్పారు. లేనిపోని ఆరోపణలు చేయడం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసింది శూన్యం. రైతుల కోసం అప్పట్లో నేను పార్టీ మారాను. అందుకు కృతజ్ఞతగా వైఎస్‌ఆర్ పులికనుమ ప్రాజెక్టు మంజూరు చేశారు. రైతులకు ఒక్క పనిచేయకపోయినా పార్టీలు మారారని మాట్లాడటం తగదు. దమ్ముంటే అటవీశాఖ అనుమతులు తీసుకుని వచ్చి రైతుల కష్టాలు తీర్చాలి.
చైతన్యంతోనే సాధన : ఆదినారాయణరెడ్డి, అట్లా అధ్యక్షుడు
కరువును పారదోలాలంటే సాగునీరే శరణ్యం. ఇందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఏకమై పోరాటాలకు సమాయత్తం కావాలి. ఎల్లెల్సీ వాటా సాధనకోసం, ప్రాజెక్టుల నిర్మాణానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలి. పులికనుమ ప్రాజెక్టు పాదయాత్రకు తరలివచ్చిన రైతులకు పేరుపేరున కృతజ్ఞతలు.
Advertisement
Advertisement