pulikanuma
-
పులికనుమకు పురుడు పోసింది వైఎస్సే
పెద్దకడబూరు (కర్నూలు): పులికనుమ ప్రాజెక్టుకు మహానీయుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పురుడు పోశారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. తానే వైఎస్.రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడి బసలదొడ్డి చింతల చెరువుకు ప్రత్యేక తూము ఏర్పాటు చేయించానన్నారు. అయితే తిక్కారెడ్డి చింతల చెరువును ప్రారంభించడంపై మండిపడ్డారు. మండలంలోని బసలదొడ్డి గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బోడెన్న (ఈరన్న) కుటుంబ సభ్యులను పరామర్శించి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు తదితర సమస్యలకు ఎంత ఖర్చు అయినా సరే తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్సీ కాలనీలోని చర్చిలో బాలనాగిరెడ్డి ప్రత్యేక పార్థనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల అండతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి అలంకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘురాముడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయేంద్రారెడ్డి, జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యల్లప్ప, నాయకులు దేవదానం, పరమేష్, లంకారెడ్డి, శివరాం, మల్లికార్జున, హంపయ్య, డీలర్ అంజినయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పులి’ గర్జన
- పులికనుమ ప్రాజెక్టు కోసం కదంతొక్కిన కర్షకులు - ప్రాజెక్టు నుంచి 19 కి.మీ. పాదయాత్ర - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రాలయం/పెద్దకడబూరు/కోసిగి: వరుస కరువుతో కడుపు మండిన రైతులు నిప్పు కణికలయ్యారు. కదంతొక్కి కన్నీటి కష్టాలను ఎలుగెత్తి చాటారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారీగా పాదయాత్ర చేశారు. పులికనుమ ప్రాజెక్టు నుంచి ఈ యాత్ర 19 కి.మీ వరకు సాగింది. రైతులకు అండగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రైతు సంఘం నాయకులు నిలిచారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్నినిరసిస్తూ బుధవారం అసోసియేషన్ ఆఫ్ తుంగభద్ర ఎల్లెల్సీ ఆయకట్ దార్స్ (ఏ.టి.ఎల్.ఏ) ఆధ్వర్యంలో కనువిప్పు పాదయాత్ర చేపట్టారు. అట్లా అధ్యక్షుడు పెద్దహరివాణం ఆదినారాయణ రెడ్డి నేతృత్వంలో సాగినయాత్రకు రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఉదయం 10.20 గంటలకు ఆందోళన బృందం పులికనుమ ప్రాజెక్టు ఆనకట్టను చేరుకుంది. దాదాపు వెయ్యి మంది రైతులు ఆనకట్టపై నిల్చుని ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు ఇచ్చారు. వేలాది మంది రైతులతో కలిసి ఆందోళన కారులు కాలినడకన బయలు దేరారు.దాదాపు 2 కి.మీ. ప్రయాణం చేసి కోసిగి మండల కేంద్రం చేరుకున్నారు. ప్రధాన రోడ్డుపై ప్రదర్శనగా చేరుకుని వక్తలు పాదయాత్ర ఉద్దేశంపై ప్రసంగించారు. అక్కడి నుంచి 5 కి.మీ. ప్రయాణించి సజ్జలగుడ్డం, మరో 3 కి.మీ నడిచి జంపాపురం, అక్కడి నుంచి 9 కి.మీ. పాదయాత్రగా తుంగభద్ర నది ఒడ్డున నిర్మిస్తున్న స్టేజ్–1 పంపుహౌస్‌ను చేరుకున్నారు. నత్తనడకన సాగుతున్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్త పరిచారు. పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి వేణుగోపాల్‌రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాలేశ్వరరెడ్డి, ఎస్ఆర్బీసీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎరువ రామచంద్రారెడ్డి, ఉద్యానవన పంటల సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూరి వెంకటస్వామి నాయుడు, గాజులదిన్నెప్రాజెక్టు మాజీ అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, ఎల్లెల్సీ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,రచయిత పాణి, రాయలసీమ సాగునీటి సాధన సమితి సభ్యులు శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు భీమిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఇల్లూరి ఆదినారాయణ, అత్రినయగౌడ్, జెడ్పీటీసీలు మంగమ్మ, లక్ష్మయ్య పాల్గొన్నారు. సీమపై శీతకన్ను : దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. తుంగభద్ర డ్యాంలో 17 ఏళ్ల క్రితం 5.5 టీఎంసీల పూడిక పేరుకుపోగా ప్రస్తుతం 7.0 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర దిగువ కాలువకు 750 టీఎంసీల నీటి వాటా రావాల్సిన ఉండగా పూర్తిగా తగ్గిపోయింది. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతుల కష్టాలు తీర్చేందుకు పులికనుమ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అటవీశాఖ అనుమతులు, 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పేరుతో రెండేళ్లు వృథా చేయడం దారుణం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఐదు రాష్ట్రాల అభ్యంతరాలు ఉన్నా అనుమతులు పొందారు. కరవు రైతులు గగ్గోలు పెడుతున్నా పులికనుమను విస్మరించడం శోచనీయం. కపట ప్రేమ : వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే సీమ రైతాంగంపై రాష్ట్ర ప్రభుత్వం కపటప్రేమ చూపుతోంది. పులికనుమ కోసం వైఎస్సార్ రూ.261.7 కోట్లు వెచ్చించారు. రెండేళ్లు గడిచినా 15 శాతం పనులు చేయకపోవడం దారుణం. కోసిగి బహిరంగ సభలో వేలాదిమంది ఎదుట ఈ ఏడాది ఖరీఫ్‌కు నీళ్లిస్తామని టీడీపీ నాయకుడు పాలకుర్తి తిక్కారెడ్డి గొప్పలు చెప్పారు. లేనిపోని ఆరోపణలు చేయడం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసింది శూన్యం. రైతుల కోసం అప్పట్లో నేను పార్టీ మారాను. అందుకు కృతజ్ఞతగా వైఎస్ఆర్ పులికనుమ ప్రాజెక్టు మంజూరు చేశారు. రైతులకు ఒక్క పనిచేయకపోయినా పార్టీలు మారారని మాట్లాడటం తగదు. దమ్ముంటే అటవీశాఖ అనుమతులు తీసుకుని వచ్చి రైతుల కష్టాలు తీర్చాలి. చైతన్యంతోనే సాధన : ఆదినారాయణరెడ్డి, అట్లా అధ్యక్షుడు కరువును పారదోలాలంటే సాగునీరే శరణ్యం. ఇందుకు పార్టీలకు అతీతంగా రైతులంతా ఏకమై పోరాటాలకు సమాయత్తం కావాలి. ఎల్లెల్సీ వాటా సాధనకోసం, ప్రాజెక్టుల నిర్మాణానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలి. పులికనుమ ప్రాజెక్టు పాదయాత్రకు తరలివచ్చిన రైతులకు పేరుపేరున కృతజ్ఞతలు. -
పులికనుమ.. గోడు కనుమా!
కరువు సీమపై కపటప్రేమ - ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వ నిర్లక్ష్యం - రూ.30కోట్లు ఖర్చు చేస్తే పులికనుమకు మోక్షం - మూడేళ్లు కావస్తున్నా ఆ దిశగా ప్రయత్నం కరువు - గగ్గోలు పెడుతున్న సీమ రైతాంగం - నేడు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రతిపక్షాల పాదయాత్ర పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. ఇప్పటికే నిర్మాణంలోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నదుల అనుసంధానం పేరిట హడావుడి చేస్తున్న పాలకులు.. సీమ గోడు గాలికొదిలేశారు. కొత్త ప్రాజెక్టుల పేరిట అరచేతిలో వైకుంఠం చూపుతూ.. కేవలం రూ.30 కోట్లతో పూర్తయ్యే పులి కనుమ పట్ల శీతకన్ను వేయడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మిగనూరు: జిల్లాలోని పశ్చిమ పల్లెల కల్పతరువు తుంగభద్ర దిగువ కాలువ. కర్ణాటక పెత్తనం.. ఎగువన జల దోపిడీ కారణంగా విలువైన ఆయకట్టు బీడు వారుతోంది. చివరికి ఎల్ఎల్సీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో శివారు భూములకూ సాగునీరు అందించే శాశ్వత ప్రణాళికలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆలోచనకు కార్య రూపం ఇస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులికనుమ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. 26,400 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.261.19 కోట్ల ప్రణాళిక బడ్జెట్‌తో పరిపాలనా అనుమతిలిచ్చారు. 7.6.2008న ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోతల పథకాలతో పాటు పులికనుమ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ఇలా : మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన రైతుల సాగునీటి కష్టాలు కడతేర్చేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 1.2 టీఎంసీ సామర్థ్యం(సుంకేసుల డ్యాంతో సమానంగా)తో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల ఎల్లెల్సీలో సాగునీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రతి రోజు 300 క్యూసెక్కుల నీటిని ఎల్లెల్సీకీ తరలించే ప్రాజెక్టు ఇది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు–కోసిగి సరిహద్దులో హులికన్వి(పులికనుమ) గ్రామ పొలిమేరలో ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించటం, తుంగభద్ర నది నుంచి వరద నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్‌కు మళ్లించడం, ఎల్లెల్సీలో నీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు పలికనుమ రిజర్వాయర్ నీటిని ఎల్లెల్సీ కాలువకు అనుసంధానం చేయడం.. తద్వార 26,400 ఎకరాల పంటలను రక్షించడం ప్రధాన ఉద్దేశం. నింపాదిగా నిర్మాణం.. ప్రాజెక్టు పురుడు పోసుకుని సరిగ్గా ఎనిమిదేళ్ల నాలుగు నెలలు గడిచింది. 2011 నాటికి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఏళ్లు నిండుతున్నా నిర్మాణం మాత్రం నింపాదిగా సాగుతోంది. ఫారెస్టు, రైల్వే శాఖల అనుమతుల పేరిట సంవత్సరాలు గడిచిపోయాయి. ఫారెస్టు అనుమతుల కోసం ప్రాజెక్టు బడ్జెట్లో రూ.5.14 కోట్లు చెల్లించగా ఏడాది తర్వాత అనుమతి వచ్చింది. ఇప్పటికీ బ్రిడ్జి, పైపులైన్ నిర్మాణం సాగుతూనే ఉంది. మళ్లీ ఎల్లెల్సీనీ అనుసంధానం చేసేందుకు ఫారెస్టు అధికారుల అనుమతి కోసం రూ.74.789 లక్షలు చెల్లించినా అనుమతులకు అతీగతీ లేకపోయింది. ఇప్పటికీ స్టేజ్–1, స్టేజ్–2 పంపు హౌస్‌ల నిర్మాణం జరుగుతుండగా.. 33/11 కేవీ సబ్ స్టేషన్ పూర్తి కాలేదంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు నీరిస్తామని హామీ ఇచ్చినా చేతులెత్తేయడం గమనార్హం. నేడు రాయలసీమ సాగునీటి సాధన సమితి పాదయాత్ర రాయలసీమ సాగునీటి కష్టాలు, ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రతిపక్ష–వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలసి పాదయాత్రకు శ్రీకారం చుట్టాయి. ఈనేపథ్యంలో బుధవారం మంత్రాలయం నియోజకవర్గం పులికనుమ ప్రాజెక్టు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వివిధ రైతు సంఘాలతో పాటు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ రైతులు పాల్గొననున్నారు. పులికనుమ రిజర్వాయర్ నుంచి సాతనూరు పంప్‌హౌస్ వరకు 12 కి.మీ. కాలినడక పరిశీలన చేపట్టనున్నారు.