పులికనుమ.. గోడు కనుమా!
పులికనుమ.. గోడు కనుమా!
Published Wed, Oct 19 2016 12:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కరువు సీమపై కపటప్రేమ
- ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వ నిర్లక్ష్యం
- రూ.30కోట్లు ఖర్చు చేస్తే పులికనుమకు మోక్షం
- మూడేళ్లు కావస్తున్నా ఆ దిశగా ప్రయత్నం కరువు
- గగ్గోలు పెడుతున్న సీమ రైతాంగం
- నేడు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రతిపక్షాల పాదయాత్ర
పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. ఇప్పటికే నిర్మాణంలోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నదుల అనుసంధానం పేరిట హడావుడి చేస్తున్న పాలకులు.. సీమ గోడు గాలికొదిలేశారు. కొత్త ప్రాజెక్టుల పేరిట అరచేతిలో వైకుంఠం చూపుతూ.. కేవలం రూ.30 కోట్లతో పూర్తయ్యే పులి కనుమ పట్ల శీతకన్ను వేయడం విమర్శలకు తావిస్తోంది.
ఎమ్మిగనూరు: జిల్లాలోని పశ్చిమ పల్లెల కల్పతరువు తుంగభద్ర దిగువ కాలువ. కర్ణాటక పెత్తనం.. ఎగువన జల దోపిడీ కారణంగా విలువైన ఆయకట్టు బీడు వారుతోంది. చివరికి ఎల్‌ఎల్‌సీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో శివారు భూములకూ సాగునీరు అందించే శాశ్వత ప్రణాళికలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆలోచనకు కార్య రూపం ఇస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులికనుమ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. 26,400 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.261.19 కోట్ల ప్రణాళిక బడ్జెట్‌తో పరిపాలనా అనుమతిలిచ్చారు. 7.6.2008న ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోతల పథకాలతో పాటు పులికనుమ నిర్మాణం చేపట్టారు.
ప్రాజెక్టు ఇలా :
మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన రైతుల సాగునీటి కష్టాలు కడతేర్చేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 1.2 టీఎంసీ సామర్థ్యం(సుంకేసుల డ్యాంతో సమానంగా)తో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల ఎల్లెల్సీలో సాగునీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రతి రోజు 300 క్యూసెక్కుల నీటిని ఎల్లెల్సీకీ తరలించే ప్రాజెక్టు ఇది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు–కోసిగి సరిహద్దులో హులికన్వి(పులికనుమ) గ్రామ పొలిమేరలో ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించటం, తుంగభద్ర నది నుంచి వరద నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్‌కు మళ్లించడం, ఎల్లెల్సీలో నీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు పలికనుమ రిజర్వాయర్ నీటిని ఎల్లెల్సీ కాలువకు అనుసంధానం చేయడం.. తద్వార 26,400 ఎకరాల పంటలను రక్షించడం ప్రధాన ఉద్దేశం.
నింపాదిగా నిర్మాణం..
ప్రాజెక్టు పురుడు పోసుకుని సరిగ్గా ఎనిమిదేళ్ల నాలుగు నెలలు గడిచింది. 2011 నాటికి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఏళ్లు నిండుతున్నా నిర్మాణం మాత్రం నింపాదిగా సాగుతోంది. ఫారెస్టు, రైల్వే శాఖల అనుమతుల పేరిట సంవత్సరాలు గడిచిపోయాయి. ఫారెస్టు అనుమతుల కోసం ప్రాజెక్టు బడ్జెట్‌లో రూ.5.14 కోట్లు చెల్లించగా ఏడాది తర్వాత అనుమతి వచ్చింది. ఇప్పటికీ బ్రిడ్జి, పైపులైన్ నిర్మాణం సాగుతూనే ఉంది. మళ్లీ ఎల్లెల్సీనీ అనుసంధానం చేసేందుకు ఫారెస్టు అధికారుల అనుమతి కోసం రూ.74.789 లక్షలు చెల్లించినా అనుమతులకు అతీగతీ లేకపోయింది. ఇప్పటికీ స్టేజ్–1, స్టేజ్–2 పంపు హౌస్‌ల నిర్మాణం జరుగుతుండగా.. 33/11 కేవీ సబ్ స్టేషన్ పూర్తి కాలేదంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు నీరిస్తామని హామీ ఇచ్చినా చేతులెత్తేయడం గమనార్హం.
నేడు రాయలసీమ సాగునీటి సాధన సమితి పాదయాత్ర
రాయలసీమ సాగునీటి కష్టాలు, ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రతిపక్ష–వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలసి పాదయాత్రకు శ్రీకారం చుట్టాయి. ఈనేపథ్యంలో బుధవారం మంత్రాలయం నియోజకవర్గం పులికనుమ ప్రాజెక్టు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వివిధ రైతు సంఘాలతో పాటు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ రైతులు పాల్గొననున్నారు. పులికనుమ రిజర్వాయర్ నుంచి సాతనూరు పంప్‌హౌస్ వరకు 12 కి.మీ. కాలినడక పరిశీలన చేపట్టనున్నారు.
Advertisement
Advertisement