rayaseema
-
Rayalaseema: మన రాయలసీమది ఘన చరిత్ర
రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అనాథ కాదు. నాటి నిజాం, ఆంగ్లేయుల పాలనతోనే కరువుసీమగా మారింది. నిజాం తమ అవసరాల కోసం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18. 1800 సంవత్సరానికి పూర్వం రాయలసీమ రతనాల సీమ. రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం, వరుస దాడుల కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠాలతో యుద్ధ భయం ఉన్న నిజాం ఆంగ్లేయులతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహారం ఇవ్వలేక సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలి వేసినాడు. బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన పాలెగాళ్లు నిలువలేకపోయినారు. అయినా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలెగాళ్లు తొలి స్వాతంత్య్రోద్యమాన్ని నిర్వహించారు. అయినా ఈనాటికీ వారికి ఆ స్థానం లభించలేదు. ఆంగ్లే యులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీడెడ్ జిల్లాలుగా పిలిచారు. తెలుగులో దత్తమండలం అని పిలిచినా, సీడెడ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్థం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అనడం కన్నా, ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్ననలను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు. నంద్యాల సభలో కీలక నిర్ణయం 1913లో ప్రారంభమైన ఆంధ్ర మహసభలు 1928లో నవంబర్ 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు దత్తమండలం సమస్యలపై అవకాశం ఇస్తేనే సహకరిస్తామన్న ఈ ప్రాంత నేతల ఒత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్తమండల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న చిలుకూరి నారా యణరావు గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదనీ, రేనాడు రాజులు, విజయనగర రాజులు పాలించిన నేపథ్యం ఉన్నందున రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందనీ ప్రతిపాదించినారు. దాన్ని పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నాటి నుంచి రాయలసీమ పేరు వాడుకలోకి వచ్చింది. అన్నమయ్య, వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం రాయలసీమ. పప్పూరి తెలుగు ప్రజలు గర్విం చదగ్గ దేశభక్తుడు. వారి జయంతిని ప్రభుత్వం అధికారి కంగా నిర్వహిస్తే సముచితంగా ఉంటుంది. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని తెలుస్తున్నా, ఆ వైపుగా కేంద్రం దగ్గర అధికారిక గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం దైవ కార్యక్రమం అయిన కృష్ణ పుష్కరాలను నది ప్రారంభమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రంలో కలిసే దగ్గర నిర్వ హించింది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ ముఖ ద్వారం ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పుష్కరాలు నిర్వహిం చారు. శ్రీశైలంలో నిర్వహిస్తే ప్రజలు పాల్గొని మన రాయల సీమలో పుష్కలంగా నీరు ప్రవహిస్తుందన్న చైతన్యం ప్రజలలో వస్తుంది. 1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే, ఆంధ్రప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడుస్తున్న రోజు లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనంతపురంలో స్థాపించాలని 1926లో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానాన్ని, మద్రాసు శాసనసభ తీర్మానాన్ని సైతం ఉల్లంఘించి అనం తలో ఉండాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ, అటు పిమ్మట వైజాగ్ తరలించారు. గత అనుభవాన్ని మరిచి అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహనతో ఆంధ్ర రాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలకే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా మారినపుడు పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ‘కర్నూలు రాజధాని’ డిమాండును వదులుకున్నారు. కీలక సమయం వచ్చినపుడు తప్పుటడు గుల కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ 2014లోనైనా సీమకు రాజధాని రావాల్సి ఉంది. కానీ కనీసం హైకోర్టు కూడా రాలేదు. వికేంద్రీకరణలో న్యాయం జరగాలి... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ విధానంలో భాగంగా రాజధానిలోని మూడు కీలక వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుతో బాటు న్యాయ స్వభావం ఉన్న కార్యాలయాలను కర్నూలులో నెలకొల్పడానికి ముందుకు వచ్చారు. ఈ వెసులుబాటును కూడా రాయలసీమకు రావాడాన్ని వ్యతిరేకించే పరిస్థితులు నెల కొన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ‘కేఆర్ఎంబీ’ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో రోజు వారీ సమీక్షతో సంబంధం లేని పలు కమిషనరేట్లు రాయలసీమలో ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా శ్రీభాగ్ ఒప్పందంలో కీలకమైన కృష్ణా, తుంగభద్ర నీటిని రాయలసీమకు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అది జరగాలంటే సిద్ధేశ్వరం, గుండ్రేవుల, పోతిరెడ్డిపాడు వెడల్పు, కాల్వల సామర్థ్యం పెంపు, చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలి. కృష్ణా నీటిలో ఏపీ వాటానుంచి తమకు అధికంగా కేటాయింపులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులైన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ నిర్మాణం పూర్తి చేసి, రాష్టానికి నీటి అవసరాల ప్రాధాన్యతను కోర్టుల ముందుంచాలి. లేకపోతే రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు ప్రశ్నగా మిగిలిపోతుంది. (క్లిక్ చేయండి: సంక్షోభం నుంచి సంక్షేమం లోకి...) - మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం (నవంబర్ 18 ‘రాయలసీమ’గా నామకరణం జరిగిన రోజు) -
పులికనుమ.. గోడు కనుమా!
కరువు సీమపై కపటప్రేమ - ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వ నిర్లక్ష్యం - రూ.30కోట్లు ఖర్చు చేస్తే పులికనుమకు మోక్షం - మూడేళ్లు కావస్తున్నా ఆ దిశగా ప్రయత్నం కరువు - గగ్గోలు పెడుతున్న సీమ రైతాంగం - నేడు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రతిపక్షాల పాదయాత్ర పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. ఇప్పటికే నిర్మాణంలోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నదుల అనుసంధానం పేరిట హడావుడి చేస్తున్న పాలకులు.. సీమ గోడు గాలికొదిలేశారు. కొత్త ప్రాజెక్టుల పేరిట అరచేతిలో వైకుంఠం చూపుతూ.. కేవలం రూ.30 కోట్లతో పూర్తయ్యే పులి కనుమ పట్ల శీతకన్ను వేయడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మిగనూరు: జిల్లాలోని పశ్చిమ పల్లెల కల్పతరువు తుంగభద్ర దిగువ కాలువ. కర్ణాటక పెత్తనం.. ఎగువన జల దోపిడీ కారణంగా విలువైన ఆయకట్టు బీడు వారుతోంది. చివరికి ఎల్ఎల్సీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో శివారు భూములకూ సాగునీరు అందించే శాశ్వత ప్రణాళికలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆలోచనకు కార్య రూపం ఇస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులికనుమ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. 26,400 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.261.19 కోట్ల ప్రణాళిక బడ్జెట్‌తో పరిపాలనా అనుమతిలిచ్చారు. 7.6.2008న ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోతల పథకాలతో పాటు పులికనుమ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ఇలా : మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన రైతుల సాగునీటి కష్టాలు కడతేర్చేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. 1.2 టీఎంసీ సామర్థ్యం(సుంకేసుల డ్యాంతో సమానంగా)తో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల ఎల్లెల్సీలో సాగునీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రతి రోజు 300 క్యూసెక్కుల నీటిని ఎల్లెల్సీకీ తరలించే ప్రాజెక్టు ఇది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరు–కోసిగి సరిహద్దులో హులికన్వి(పులికనుమ) గ్రామ పొలిమేరలో ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించటం, తుంగభద్ర నది నుంచి వరద నీటిని ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్‌కు మళ్లించడం, ఎల్లెల్సీలో నీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు పలికనుమ రిజర్వాయర్ నీటిని ఎల్లెల్సీ కాలువకు అనుసంధానం చేయడం.. తద్వార 26,400 ఎకరాల పంటలను రక్షించడం ప్రధాన ఉద్దేశం. నింపాదిగా నిర్మాణం.. ప్రాజెక్టు పురుడు పోసుకుని సరిగ్గా ఎనిమిదేళ్ల నాలుగు నెలలు గడిచింది. 2011 నాటికి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఏళ్లు నిండుతున్నా నిర్మాణం మాత్రం నింపాదిగా సాగుతోంది. ఫారెస్టు, రైల్వే శాఖల అనుమతుల పేరిట సంవత్సరాలు గడిచిపోయాయి. ఫారెస్టు అనుమతుల కోసం ప్రాజెక్టు బడ్జెట్లో రూ.5.14 కోట్లు చెల్లించగా ఏడాది తర్వాత అనుమతి వచ్చింది. ఇప్పటికీ బ్రిడ్జి, పైపులైన్ నిర్మాణం సాగుతూనే ఉంది. మళ్లీ ఎల్లెల్సీనీ అనుసంధానం చేసేందుకు ఫారెస్టు అధికారుల అనుమతి కోసం రూ.74.789 లక్షలు చెల్లించినా అనుమతులకు అతీగతీ లేకపోయింది. ఇప్పటికీ స్టేజ్–1, స్టేజ్–2 పంపు హౌస్‌ల నిర్మాణం జరుగుతుండగా.. 33/11 కేవీ సబ్ స్టేషన్ పూర్తి కాలేదంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు నీరిస్తామని హామీ ఇచ్చినా చేతులెత్తేయడం గమనార్హం. నేడు రాయలసీమ సాగునీటి సాధన సమితి పాదయాత్ర రాయలసీమ సాగునీటి కష్టాలు, ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రతిపక్ష–వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలసి పాదయాత్రకు శ్రీకారం చుట్టాయి. ఈనేపథ్యంలో బుధవారం మంత్రాలయం నియోజకవర్గం పులికనుమ ప్రాజెక్టు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వివిధ రైతు సంఘాలతో పాటు ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ రైతులు పాల్గొననున్నారు. పులికనుమ రిజర్వాయర్ నుంచి సాతనూరు పంప్‌హౌస్ వరకు 12 కి.మీ. కాలినడక పరిశీలన చేపట్టనున్నారు. -
రైతు ఆశలపై నీళ్లు
–చెరువులకే హంద్రీ–నీవా పరిమితం –తంబళ్లపల్లెలో ప్రయోగాత్మక చర్యలు –ప్రాజెక్టు అధికారులు తాజా ప్రతిపాదన – చెరువులకు నీరిస్తే 3,530 ఎకరాలకే సాగునీరు – ప్రాజెక్టు లక్ష్యానికి భారీగా కోత – నష్టపోనున్న కరువు రైతాంగం హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రాయలసీమ కరువు రైతుల ఆశాకిరణం. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి రైతులకు సాగునీటి కష్టాలు, ప్రజల దాహం తీర్చాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2005లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పుష్కలంగా నిధులిచ్చారు. ఈ పనులు చివరిదశలో చేరుకొంటున్న సమయంలో ఉపకాలువల పనులకు మంగళం పాడిన ప్రస్తుత ప్రభుత్వం ఆయకట్టు సాగుకు నీళ్లిచ్చేందుకు సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. కేవలం చెరువులకు మాత్రమే నీటిని అందించే పథకంగా మార్చే ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదన జలవనరులశాఖ కార్యదర్శికి పంపడం బలం చేకూర్చుతోంది. బి.కొత్తకోట: హంద్రీ–నీవా కాలువల ద్వారా చెరువులకు మాత్రమే నీరందిస్తారని తెలిసింది. ఈ సమాచారం తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉపకాలువలు ఉండవని భోగట్టా. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేసేందుకు తొలిదశలో సీఎం సొంత జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు ప్రత్యేకంగా నిధులివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే..రూ.3.15కోట్లతో సమగ్ర సర్వే కార్యరూపం దాల్చుతుంది. తర్వాత చెరువులకు నీరిచ్చే పథక స్వరూపం తెరపైకి వస్తుంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పుంగనూరు ఉపకాలువ, తంబళ్లపల్లె ఉప కాలువ, నీవా ఉప కాలువలు వెళ్తున్నాయి. ఈ కాలువలకింద 46,550 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రాజెక్టులో రూపొందించారు. ఇందులో బి.కొత్తకోట మండలంలో 6,900 ఎకరాలు, పెద్దమండ్యం మండలంలో 10వేల ఎకరాలు, ములకలచెరువు మండలంలో 9,565 ఎకరాలు, పెద్దతిప్పసముద్రం మండలంలో 4,685 ఎకరాలు, తంబళ్లపల్లె మండలంలో 5వేల ఎకరాలు, కురబలకోట మండలంలో 5వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో పొందుబరిచారు. ఇలాగే నీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే దీనికి విరుద్దంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీరందించే విషయంలో కొత్త ఆలోచనకు తెరతీసింది. –కొత్త పథకమేదంటే... నియోజకవర్గంలోని 46,550 ఎకరాలకు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించాలి. ప్రధాన కాలువ నుంచి సాగే ఉపకాలువలకు పిల్ల కాలువలు తవ్వాలి. పిల్లకాలువలు సాగే చివరి పొలం వరకు నీటీని అందించాలి. ప్రభుత్వం చేసిన కొత్త ఆలోచన ప్రకారం ఈ తతంగమంతా అవసరం ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 22 ద్వారా పిల్లకాలువలను కాంట్రాక్టర్లు తవ్వితే సరే లేదంటే దానిజోలికి వెళ్లవద్దంటూ సూచించింది. దీనితో ప్రాజెక్టు అధికారులు సైతం పిల్లకాలువల మాటెత్తడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఉపకాలువల నుంచి నేరుగా నీటీని సమీపంలోని చెరువులకు మళ్లీంచి ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చింది. దీనికి తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. 27వ ప్యాకేజీ పరిధిలోని 13 చెరువులకు, 28వ ప్యాకేజి పరిధిలో 7 చెరువులకు, 63వ ప్యాకేజి పరిధిలో 16 చెరువులకు నీరు ఇచ్చేలా పథకం సిద్దం చేశారు. ఉపకాలువల ద్వారా ఈ చెరువులకు నీటిని అందిస్తారు. మొత్తం 36 చెరువులకు ఉపకాలువల నుంచి 89.85 కిలోమీటర్ల కాలువలు తవ్వుతారు. ఈ కాలువ సాగే మార్గంలో 362 కల్వర్టులు నిర్మించాల్సివుంటుంది. ఈ పనులు పూర్తిచేస్తే 36 చెరువుల సామర్థ్యం 763.08 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని అందిస్తారు. ఈ నీటితో చెరువులకింద కేవలం 3,530.44 ఎకరాల ఆయకట్టు భూములు మాత్రమే సాగులోకి వస్తాయి. ఇది ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన. –పరిశోధనకు రూ.3.15కోట్లు ఇవ్వండి చెరువులకు నీరు అందించడం కోసం సమగ్ర సర్వే, పరిశోధన కోసం రూ.3.15కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. దీనికి నిధులు మంజూరైతే తక్షణమే అధికారులు రంగంలోకి దిగి చర్యలు వేగవంతం చేయనున్నారు. పథకం అమలుకోసం సమగ్ర స్వరూపంతో ప్రభుత్వానికి నివేదిస్తారు. దీన్ని ప్రభుత్వం చేపట్టడం వెనుక పొలాలకు నీరందించే పరిస్థితుల్లో లేకపోవడం, పిల్లకాలువలు తవ్వించకపోవడమే కారణమని స్పష్టం అవుతోంది. చెరువులకు నీటీని మళ్లించి చేతులు దులుపుకునే చర్యలని భావిస్తున్నారు.