హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ
రైతు ఆశలపై నీళ్లు
Published Wed, Aug 10 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
–చెరువులకే హంద్రీ–నీవా పరిమితం
–తంబళ్లపల్లెలో ప్రయోగాత్మక చర్యలు
–ప్రాజెక్టు అధికారులు తాజా ప్రతిపాదన
– చెరువులకు నీరిస్తే 3,530 ఎకరాలకే సాగునీరు
– ప్రాజెక్టు లక్ష్యానికి భారీగా కోత
– నష్టపోనున్న కరువు రైతాంగం
హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రాయలసీమ కరువు రైతుల ఆశాకిరణం. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించి రైతులకు సాగునీటి కష్టాలు, ప్రజల దాహం తీర్చాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2005లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పుష్కలంగా నిధులిచ్చారు. ఈ పనులు చివరిదశలో చేరుకొంటున్న సమయంలో ఉపకాలువల పనులకు మంగళం పాడిన ప్రస్తుత ప్రభుత్వం ఆయకట్టు సాగుకు నీళ్లిచ్చేందుకు సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. కేవలం చెరువులకు మాత్రమే నీటిని అందించే పథకంగా మార్చే ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదన జలవనరులశాఖ కార్యదర్శికి పంపడం బలం చేకూర్చుతోంది.
బి.కొత్తకోట:
హంద్రీ–నీవా కాలువల ద్వారా చెరువులకు మాత్రమే నీరందిస్తారని తెలిసింది. ఈ సమాచారం తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉపకాలువలు ఉండవని భోగట్టా. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేసేందుకు తొలిదశలో సీఎం సొంత జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు ప్రత్యేకంగా నిధులివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే..రూ.3.15కోట్లతో సమగ్ర సర్వే కార్యరూపం దాల్చుతుంది. తర్వాత చెరువులకు నీరిచ్చే పథక స్వరూపం తెరపైకి వస్తుంది.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో పుంగనూరు ఉపకాలువ, తంబళ్లపల్లె ఉప కాలువ, నీవా ఉప కాలువలు వెళ్తున్నాయి. ఈ కాలువలకింద 46,550 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రాజెక్టులో రూపొందించారు. ఇందులో బి.కొత్తకోట మండలంలో 6,900 ఎకరాలు, పెద్దమండ్యం మండలంలో 10వేల ఎకరాలు, ములకలచెరువు మండలంలో 9,565 ఎకరాలు, పెద్దతిప్పసముద్రం మండలంలో 4,685 ఎకరాలు, తంబళ్లపల్లె మండలంలో 5వేల ఎకరాలు, కురబలకోట మండలంలో 5వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో పొందుబరిచారు. ఇలాగే నీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే దీనికి విరుద్దంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి నీరందించే విషయంలో కొత్త ఆలోచనకు తెరతీసింది.
–కొత్త పథకమేదంటే...
నియోజకవర్గంలోని 46,550 ఎకరాలకు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించాలి. ప్రధాన కాలువ నుంచి సాగే ఉపకాలువలకు పిల్ల కాలువలు తవ్వాలి. పిల్లకాలువలు సాగే చివరి పొలం వరకు నీటీని అందించాలి. ప్రభుత్వం చేసిన కొత్త ఆలోచన ప్రకారం ఈ తతంగమంతా అవసరం ఉండదు. ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 22 ద్వారా పిల్లకాలువలను కాంట్రాక్టర్లు తవ్వితే సరే లేదంటే దానిజోలికి వెళ్లవద్దంటూ సూచించింది. దీనితో ప్రాజెక్టు అధికారులు సైతం పిల్లకాలువల మాటెత్తడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఉపకాలువల నుంచి నేరుగా నీటీని సమీపంలోని చెరువులకు మళ్లీంచి ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చింది. దీనికి తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. 27వ ప్యాకేజీ పరిధిలోని 13 చెరువులకు, 28వ ప్యాకేజి పరిధిలో 7 చెరువులకు, 63వ ప్యాకేజి పరిధిలో 16 చెరువులకు నీరు ఇచ్చేలా పథకం సిద్దం చేశారు. ఉపకాలువల ద్వారా ఈ చెరువులకు నీటిని అందిస్తారు. మొత్తం 36 చెరువులకు ఉపకాలువల నుంచి 89.85 కిలోమీటర్ల కాలువలు తవ్వుతారు. ఈ కాలువ సాగే మార్గంలో 362 కల్వర్టులు నిర్మించాల్సివుంటుంది. ఈ పనులు పూర్తిచేస్తే 36 చెరువుల సామర్థ్యం 763.08 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని అందిస్తారు. ఈ నీటితో చెరువులకింద కేవలం 3,530.44 ఎకరాల ఆయకట్టు భూములు మాత్రమే సాగులోకి వస్తాయి. ఇది ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన.
–పరిశోధనకు రూ.3.15కోట్లు ఇవ్వండి
చెరువులకు నీరు అందించడం కోసం సమగ్ర సర్వే, పరిశోధన కోసం రూ.3.15కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. దీనికి నిధులు మంజూరైతే తక్షణమే అధికారులు రంగంలోకి దిగి చర్యలు వేగవంతం చేయనున్నారు. పథకం అమలుకోసం సమగ్ర స్వరూపంతో ప్రభుత్వానికి నివేదిస్తారు. దీన్ని ప్రభుత్వం చేపట్టడం వెనుక పొలాలకు నీరందించే పరిస్థితుల్లో లేకపోవడం, పిల్లకాలువలు తవ్వించకపోవడమే కారణమని స్పష్టం అవుతోంది. చెరువులకు నీటీని మళ్లించి చేతులు దులుపుకునే చర్యలని భావిస్తున్నారు.
Advertisement