అతడు హానికారక తండ్రి
రాబోవు చిత్రం
అమ్మాయిలు మానసిక సమస్యలతో పోరాటంలో విజయ సాధించగలరు అని ఇటీవల విడుదలైన ‘డియర్ జిందగీ’ సినిమా నిరూపిస్తే శారీరక బలం పురుషులతో సమానంగా ప్రదర్శించగలరు అని నిరూపించడానికి రేపు శుక్రవారం ‘దంగల్’ వస్తోంది. ‘దంగల్’ అంటే ‘గోదా’ అని ‘కుస్తీ పోటీ’ అని అర్థాలున్నాయి. ఈ కథ నిజజీవిత సంఘటనలతో ప్రభావితమై తీశారని తెలిసిందే. హర్యాణాకు చెందిన మహావీర్ ఫోగట్ అనే మల్లయోధుడు అంతర్జాతీయ పోటీలలో గోల్డ్‌మెడల్ సాధించలనుకున్నాడు. అది సాధించలేకపోయాడు. తన కుమార్తెలకు కుస్తీ యుద్ధం నేర్పించి ఆ కలను నెరవేర్చుకున్నాడు. అతని కుమార్తెలు గీతా ఫోగట్, బబిత కుమారి కామన్‌వెల్త్ పోటీలలో పతకాలు సాధించారు. గీతా ఫోగట్ అయితే ఒలంపిక్స్ యోగ్యత పొందిన తొలి భారతీయ మహిళా మల్లయోధగా రికార్డు సాధించింది.
ఈ విషయాన్ని సినిమాగా మలిస్తే బాగుంటుందని ఆలోచన చేసిన డిస్నీ స్టూడియో ఇది వరకే ‘చిల్లర్ పార్టీ’, ‘భూత్‌నాథ్ రిటర్న్ ్స’ సినిమాలు తీసిన దర్శకుడు నితిష్ తివారీని కథ తయారు చేయమంది. నితిష్ తివారి దీనిని జాక్‌పాట్‌గా భావించి కథ మీద కూర్చున్నాడు.
పదేళ్ల తర్వాత అనుకొని...
కథ పూర్తయ్యాక దీనిని మొదటగా ఆమిర్ ఖాన్‌కు వినిపించాడు డిస్నీ స్టూడియో తరఫున నితిష్ తివారీ. ఆమిర్‌కు వెంటనే నచ్చేసింది. అప్పుడతడు ‘ధూమ్ 3’ షూటింగ్ ముగించి ‘పికె’ సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. ఈ కథ వినగానే చాలా బాగుంది, కాని ఇది చేయాలంటే నాకు ఇంకాస్త వయసు రావాలి, మరికాస్త ముసలివాణ్ణి కావాలి ఒక పదేళ్లు ఆగి చేద్దాం అన్నాడు ఆమిర్ ఖాన్. కాని ఆరునెలల తర్వాత ఏమనుకున్నాడో ఏమో మళ్లీ కథ విని తానే చేస్తానని ముందుకొచ్చాడు. దానికి ఎంత కష్టపడ్డాడో ఎన్ని కేజీల బరువు పెరిగాడో మళ్లీ తగ్గి ఎలా మామూలు మనిషి అయ్యాడో అవన్నీ పత్రికల్లో అందరూ చూస్తూనే ఉన్నారు.
హానికారక్ బాపు
ఈ సినిమాలో తన నెరవేరని కలను తనకు పుట్టబోయేవాడు నెరవేర్చాలని అనుకుంటాడు ఆమిర్‌ఖాన్. కాని భార్య కాన్పు వెంట కాన్పులో వరుసగా నలుగురు ఆడపిల్లలను ప్రసవిస్తుంది. ఆడపిల్లలంటే ప్రేమే అయినా వాళ్లు కుస్తీకి పనికి రారు కదా అని బాధపడతాడు. అయితే వీధి కొట్లాటల్లో తన ఇద్దరు కూతుళ్లు అబ్బాయిలను చితకబాదటం చూసి ‘వీళ్లిద్దరూ కుస్తీకి పనికొస్తారు. బంగారు పతకం బంగారు పతకమే... అది అబ్బాయి తెస్తే ఏమిటి అమ్మాయి తెస్తే ఏమిటి’... అని వాళ్లకు కుస్తీలో శిక్షణ ప్రారంభిస్తాడు. కాని ఆ ఇద్దరి అమ్మాయిలకు ఇది చాలా కష్టమైన పని. పైగా అది తిను ఇది తినకు అలా పరిగెత్తు ఇలా ఎక్సర్‌సైజ్ చెయ్ అని తండ్రి విసిగిస్తుంటే ‘హానికారక్ బాపు’ అని తిట్టుకుంటారు. అంటే తండ్రి తమ పాలిట హానికారకంగా తయారయ్యాడు అని అర్థం. దంగల్ ప్రోమోలలో ఈ హానికారక్ బాపు అనే పాట ఉన్న ప్రోమో పెద్ద హిట్ అయ్యింది కూడా.
ఆడవాళ్లకు జేజేలు
బాలీవుడ్‌లో ఆడవాళ్ల సై్థర్యానికి వ్యక్తిత్వానికి విలువనిచ్చే సినిమాలు వరుసగా వస్తున్నాయి. ‘సాలా ఖడూస్’, ‘పింక్’, ‘డియర్ జిందగీ’... ఇప్పుడు ‘దంగల్’. మంచి కథ ఉంటే బాక్సాఫీస్ దగ్గర కూడా లేడీస్ ఫస్ట్ అని నిరూపిస్తున్న సినిమాలు ఇవి.