తాత అమితాబ్‌తో నవ్య నవేలీ
అమితాబ్ మనవరాలు 23 ఏళ్ల నవ్య నవేలి నందా తీవ్రమైన యాంగ్జయిటీతో బాధ పడుతున్నట్టు చెప్పింది. అమితాబ్ కుమార్తె శ్వేత, అల్లుడు నిఖిల్‌ల కుమార్తె అయిన నవ్య నవేలీ గత సంవత్సరమే న్యూయార్క్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వచ్చింది. ఈమెకు అగస్త్య అనే తమ్ముడు ఉన్నాడు. ఇటీవల నవ్య నవేలి తన సహ భాగస్వామ్యంతో ‘ఆరా’ అనే హెల్త్ పోర్టల్‌ను ప్రారంభించింది. దాని కోసమని విడుదల చేసిన వీడియోలో తన మానసిక సమస్య గురించి, దానికి తీసుకుంటున్న వైద్యం గురించి మాట్లాడింది.
‘గతంలో నేను చాలా నెగెటివ్ మనుషుల మధ్య ఉండేదాన్ని. వారెప్పుడు నెగెటివిటీనే మాట్లాడేవాళ్లు. కారణాలు తెలియదు నేను చాలాసార్లు మానసికంగా లోలోపల అడుగు వరకూ చాలా దెబ్బ తిన్నాను. తీవ్రమైన యాంగ్జయిటీ నన్ను వేధించేది. ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఒక అటాక్‌లాగా వచ్చేది. ఆ సమయంలో దానిని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యేది కాదు. బయటి విషయాలు ఏవో ఒకటి ట్రిగర్ చేయడం వల్ల అలా జరుగుతుంది అనుకునేదాన్ని. ఒక్కోసారి ఏ కారణం లేకపోయినా అలాగే జరిగేది. ఇది చాలా భరింపలేని విషయం’ అందామె.
‘మొదట్లో నేను దీని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకున్నాను. కాని మాట్లాడితేనే సగం పరిష్కారం. అలాగై వైద్య సహాయం తీసుకోవడం మరో సగం పరిష్కారం. కొందరు తమ మానసిక సమస్యకు సహాయం అవసరం అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. యాంగ్జయిటీకి మూలం బయట ఉండదు. ఎనభై శాతం మన బుర్రలోనే ఉంటుంది. అక్కడి నుంచే యాంగ్జయిటీ మొదలవుతుంది. మొదట మన మనసును, శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మన ఎమోషన్స్‌ను అర్థం చేసుకునే కొద్దీ ఈ సమస్య నుంచి బయటపడతాం’ అందామె.
‘యాంగ్జయిటీ నుంచి బయటపడటానికి థెరపిస్ట్‌ను కలుస్తున్నాను. వారానికి ఒక గంట అతనితో మాట్లాడుతున్నాను. మాట్లాడేకొద్దీ నాకు ధైర్యం వస్తోంది. యాంగ్జయిటీ నన్నేమీ చేయదనే నమ్మకం కలుగుతోంది. అలాగే మన చుట్టు మనల్ని కంఫర్ట్‌గా సంతోషంగా ఉంచే మనుషులుండేలా చూసుకోవాలని కూడా తెలుసుకున్నాను’ అని చెప్పిందామె.
అమితాబ్ ప్రియమైన మనవరాలు నవ్య. ఆమె యుక్త వయసుకు రాగానే స్త్రీ ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలను గురించి, సంఘపరమైన సవాళ్ల గురించి మాట్లాడుతూ అమితాబ్ ఆమెకు రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఒక పురోగామి విషయంగా చెప్పుకున్నారు. మానసిక సమస్యలకు స్త్రీ పొందాల్సిన వైద్య సహాయాన్ని ఈ వీడియో నొక్కి చెబుతోంది.
నవ్య నవేలి నందా; తల్లి శ్వేతతో నవ్య
Comments
Please login to add a commentAdd a comment